52.38 లక్షల మంది రైతులకు 3,928 కోట్లు

ABN , First Publish Date - 2021-05-14T08:23:13+05:30 IST

ప్రభుత్వానికి ఎన్ని కష్టాలు ఉన్నా, రైతులు ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో రైతు భరోసా అమలు చేస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు. ఖరీఫ్‌ సాగు మొదలవుతోందని, పెట్టుబడి కోసం ఏ

52.38 లక్షల మంది రైతులకు 3,928 కోట్లు

పెట్టుబడి సాయం విడుదల చేసిన సీఎం జగన్‌ 

వరుసగా మూడో ఏడాది రైతు భరోసా అమలు 

25న వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా సొమ్ము : జగన్‌

 అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వానికి ఎన్ని కష్టాలు ఉన్నా, రైతులు ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో రైతు భరోసా అమలు చేస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు. ఖరీఫ్‌ సాగు మొదలవుతోందని, పెట్టుబడి కోసం ఏ రైతు ఇబ్బంది పడకూడదని ఈ రోజు మొదటి విడత సాయం చేస్తున్నామన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకంలో భాగంగా మూడో ఏడాది తొలి విడత చెల్లింపుల కింద, తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో గురువారం కంప్యూటర్‌ బటన్‌ నొక్కిన సీఎం జగన్‌ రైతుల ఖాతాలకు నిధులు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దాదాపు 52.38లక్షల మంది రైతులకు రైతు భరోసా మూడో ఏడాదికి సంబంధించిన మొదటి విడతగా వారి ఖాతాల్లో నేరుగా రూ.3,928 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు.


కొవిడ్‌తో కష్టకాలం ఉన్నా, ఆర్థిక వనరులు తగిన స్థాయిలో లేకపోయినా, ప్రభుత్వ కష్టాల కంటే రైతుల కష్టాలు ఎక్కువని, వారికి ఎలాంటి కష్టం కలగకూడదన్నారు. ఈ 23నెలల్లో దాదాపు రూ.89వేల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఎక్కడా వివక్ష లేకుండా, లంచాలకు తావులేకుండా, పూర్తి పారదర్శకంగా, పక్కాగా, సామాజిక తనిఖీలు నిర్వహించి, ఏ ఒక్క అర్హుడు మిస్‌ కాకుండా అందరికీ ప్రయోజనం కల్పించామన్నారు. 2019-20నుంచి ఇప్పటి వరకు ఒక్క రైతు భరోసా కింద రూ.17,029 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామన్నారు. తమ పాలనలో రైతన్నలకు వివిధ పథకాల కింద నేరుగా అందించిన సహాయం రూ.68వేల కోట్లకు పైగానే ఉందని చెప్పారు. 


వేటికి ఎంతెంత?

రైతు భరోసా కింద 52.38మంది లక్షల రైతులకు మొత్తం రూ.17,029 కోట్లు, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల కింద రూ.1,261 కోట్లు, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా కింద 15.67లక్షల మంది రైతులకు రూ.1,968కోట్లు ఇవ్వగలిగామని సీఎం వివరించారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.1,038 కోట్లు ఇచ్చామన్నారు. ధాన్యం కొనుగోలుకు రూ.18,343 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఇతర పంటలు కొనుగోలు చేసేందుకు రూ.4,761 కోట్లు, ఉచిత వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీ కింద రూ.17,430 కోట్లు, ధాన్యం బకాయిలు రూ.960 కోట్లు, విత్తన సేకరణ బకాయిలకు రూ.384కోట్లు వెచ్చించామన్నారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలన్నారు. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా కింద ఈ నెల 25న సుమారు 38లక్షల మంది రైతులకు దాదాపు రూ.2వేల కోట్లు అందించబోతున్నట్లు సీఎం వెల్లడించారు. ఆతర్వాత కంప్యూటర్‌ బటన్‌ నొక్కిన జగన్‌... రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. మంత్రి కన్నబాబు, ఎంపీ బాలశౌరి పాల్గొన్నారు.

Updated Date - 2021-05-14T08:23:13+05:30 IST