రాష్ట్రంలో కొత్త కేసులు 3,944

ABN , First Publish Date - 2022-01-28T07:30:44+05:30 IST

రాష్ట్రంలో గురువారం 97,549 మందికి పరీక్షలు చేయగా, 3,944 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది.

రాష్ట్రంలో కొత్త కేసులు 3,944

  • జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 1,372 పాజిటివ్‌లు
  • ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెరుగుతున్న రోగులు
  • పరీక్షల్లో 50 శాతంమందికి కొవిడ్‌ పాజిటివ్‌
  • కింగ్‌ కోఠిలో రెండ్రోజుల్లో 20 ఆక్సిజన్‌ చేరికలు
  • ఆర్టీపీసీఆర్‌కు ఉస్మానియాలో కొత్త నిబంధన
  • వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి కరోనా


హైదరాబాద్‌, మంగళ్‌హాట్‌, జనవరి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గురువారం 97,549 మందికి పరీక్షలు చేయగా, 3,944 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. వైర్‌సతో మరో ముగ్గురు మృతిచెందారు. 2,444 మంది కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇంకా 39,520 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజా పాజిటివ్‌లలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,372, మేడ్చల్‌-మల్కాజిగిరిలో 288, రంగారెడ్డిలో 259, ఖమ్మంలో 135, సంగారెడ్డిలో 120, హనుమకొండలో 117, నిజామాబాద్‌లో 105, సిద్దిపేటలో 104, భద్రాద్తి-కొత్తగూడెం జిల్లాలో 101 నమోదయ్యాయి. గురువారం 2,58,770 మందికి టీకా ఇచ్చారు. కాగా, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కొద్ది రోజులుగా అభివృద్ధి కార్యక్రమాలు, సమావేశాల్లో మంత్రి పాల్గొంటున్నారు. గురువారం నాబార్డు రుణ ప్రణాళిక విడుదల సందర్భంగా సమావేశంలో పాల్గొన్నారు. అలసట అనిపించడంతో పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌ వచ్చింది. యాదాద్రి జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పథి వైరస్‌ బారినపడ్డారు. బుధవారం గణంతంత్ర దినోత్సవం సందర్భంగా ఈమె రాష్ట్రస్థాయి అధికారులతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


కింగ్‌కోఠిలో పెరిగిన రోగులు

హైదరాబాద్‌లో ప్రధానమైన ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌, కింగ్‌ కోఠి, టిమ్స్‌ లాంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోజువారీ టెస్టుల్లో భారీగా పాజిటివ్‌లు వస్తున్నాయి. ఉస్మానియాలో మంగళవారం 469 మందికి ఆర్టీపీసీఆర్‌ పరీక్ష  చేయగా 202 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. రోగులను ఎక్కడికక్కడే ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందించాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఉస్మానియా, నిలోఫర్‌, కింగ్‌కోఠి తదితర ఆస్పత్రుల్లో కొవిడ్‌ రోగుల చేరికలు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. కాగా, కింగ్‌ కోఠి ఆస్పత్రిలో లక్షణాలు తీవ్రంగా ఉండి ఆక్సిజన్‌ అవసరం ఉన్నవారిని మాత్రమే చేర్చుకుంటున్నారు. ఇక్కడ రెండు రోజుల్లో రోగుల సంఖ్య 20కి చేరింది. వీరంతా ఉస్మానియా నుంచి రిఫర్‌ అయినవారే. 


 అధికారుల సంతకాలతోనే టెస్టు

తీవ్ర స్థాయిలో లక్షణాలు ఉండి సంబంధిత వైద్యుల సంతకాలతో కొవిడ్‌ పరీక్ష పత్రంపై స్టాంప్‌ వేయించుకుని వస్తే తప్ప ఉస్మానియాలో ఆర్టీపీసీఆర్‌ చేయడం లేదు.   అయితే, కనీసం ఆర్టీపీసీఆర్‌ దరఖాస్తు పత్రాలు అందుబాటులో లేవు. మీ సేవా సెంటర్‌లో రూ.5 పెట్టి కొనాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కువగా వైద్య సిబ్బంది, తీవ్ర లక్షణాలు ఉన్నవారికే ఆర్టీపీసీఆర్‌ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మరోవైపు ఉస్మానియాలో రోగుల సంఖ్య పెరుగుతుండడంతో వారిని కింగ్‌ కోఠి ఆస్పత్రికి తరలించాలని ఆస్పత్రి ఉన్నతాధికారులు గురువారం నిర్ణయించారు.  కాగా, ఆర్థో, కార్డియాలజీ, సిటీ సర్జరీ, గ్యాస్ట్రో, సర్జికల్‌ గ్యాస్ట్రో, జనరల్‌ సర్జరీ, న్యూరో, యూరాలజీతో పాటు ఇతర అన్ని విభాగాలకు సంబంధించి గతంలో ఏదైన రోగికి  శస్త్రచికిత్సకు ముందు కొవిడ్‌ పాజిటివ్‌ వస్తే వెంటనే గాంధీకి తరలించే వారు. 2 రోజుల క్రితం దాదాపు 10 మంది రోగులను ఇలా తరలించినట్లు సమాచారం. వీరిలో అడ్మిషన్‌ అవసరం లేనివారూ ఉండడంతో ఉన్నతాధికారులు మండిపడినట్లు తెలిసింది. కింగ్‌కోఠి సేవలు ఎందుకు వాడుకోవడం లేదని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో గురువారం హుటాహుటిన ఉస్మానియా హెచ్‌వోడీలతో సమావేశం ఏర్పాటు చేసి కింగ్‌ కోఠికి కొవిడ్‌ రోగులను పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉస్మానియా వైద్యులే అక్కడ విధులు నిర్వహించేలా ఆదేశాలిచ్చారు.

Updated Date - 2022-01-28T07:30:44+05:30 IST