Chennai సహా 4 జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన

ABN , First Publish Date - 2021-11-23T15:26:11+05:30 IST

రాష్ట్రంలో ఈశాన్యరుతుపవనాల ప్రభావం, రెండు వాయుగుండాల కారణంగా కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన జిల్లాల్లో పర్యటించేందుకు విచ్చేసిన కేంద్ర పరిశీలక బృందాల సభ్యులు సోమవారం ఉదయం నుంచి తమ

Chennai సహా 4 జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన

చెన్నై: రాష్ట్రంలో ఈశాన్యరుతుపవనాల ప్రభావం, రెండు వాయుగుండాల కారణంగా కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన జిల్లాల్లో పర్యటించేందుకు విచ్చేసిన కేంద్ర పరిశీలక బృందాల సభ్యులు సోమవారం ఉదయం నుంచి తమ పర్యటనను ప్రారంభించారు. రెండు జట్లుగా చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, కన్నియాకుమారి జిల్లాలో వర్షబాధిత ప్రాంతాల్లో పర్యటించి ఆస్తి నష్టాన్ని, పంటనష్టాన్ని పరిశీలించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ డిప్యూటీ కార్యదర్శి రాజీవ్‌శర్మ నాయకత్వం వహిస్తున్న ఈ బృందంలో కేంద్ర ఆర్థికశాఖ ఖర్చుల విభాగం సలహాదారుడు ఆర్బీ కౌల్‌, కేంద్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ విజయ్‌ రాజ్‌మోహన్‌, చెన్నైలోని కేంద్ర నీటివనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నీటివనరుల సంస్థ సంచాలకులు ఆర్‌ తంగమణి, కేంద్ర ఇంధన శాఖ సహాయ సంచాలకులు భవ్యా పాండే, చెన్నైలోని కేంద్ర హైవేస్‌ ప్రాంతీయ అధికారి రణజయ్‌సింగ్‌, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఎంవీఎన్‌ వరప్రసాద్‌ సభ్యులుగా ఉన్నారు.


చెన్నైలో...

చెన్నైలో కేంద్ర పరిశీలక బృందం సభ్యులు రాజీవ్‌శర్మ, విజయ్‌రాజ్‌మోహన్‌, రణజయ్‌సింగ్‌, ఎంఈఎన్‌ వరప్రసాద్‌, సమన్వయకర్త, రెవెన్యూ విభాగం కమిషనర్‌ కె.ఫణీందర్‌ రెడ్డి, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ బేదీతో కలిసి వర్షబాధిత ప్రాంతాలను సందర్శించారు. ఉత్తర చెన్నైలోని వీరాశెట్టి వీధి, పులియంతోపు హైరోడ్డు, పురుషవాక్కం అళగప్పారోడ్డు, కొళత్తూరు శివ ఇళంగో రోడ్డు తదితర ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులను పరిశీలించారు. నగరంలో పర్యటనను ముగించుకున్న కేంద్రబృందం సభ్యులు సబర్బన్‌ ప్రాంతమైన తాంబరానికి వెళ్ళి వర్షబాధిత ప్రాంతాల్లో పర్యటించారు. వరదరాజపురం ప్రాంతంలో దెబ్బతిన్న రహదారులను, జలమయమైన నివాసప్రాంతాలను సందర్శించారు. ఆ సందర్భంగా పంచాయతీరాజ్‌ ప్రత్యేక అధికారి అముదా, చెంగల్పట్టు కలెక్టర్‌ రాహుల్‌నాథ్‌, కాంచీపురం జిల్లా కలెక్టర్‌ ఆరతి ఆయా ప్రాంతాల్లో సంభవించిన నష్టం గురించి వివరించారు. చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో పలు ప్రాంతాలల్లో పర్యటించిన తర్వాత కేంద్ర బృందం సభ్యులు మహాబలిపురం మీదుగా పుదుచ్చేరికి చేరుకున్నారు. ఈ సభ్యులు సోమవారం రాత్రి అక్కడే బసచేస్తారు. మంగళవారం ఉదయం ఆ రాష్ట్రంలోని వరద బాధిత ప్రాంతాలను సందర్శించనున్నారు. ఆ తర్వాత కడలూరు, మైలాడుదురై, నాగపట్టినం, తిరువా రూరు, తంజావూరు జిల్లాల్లో వర్షబాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.


తూత్తుకుడిలో రెండో జట్టు...

కేంద్ర పరిశీలకబృందం రెండో జట్టు సభ్యులు సోమవారం ఉదయం చెన్నై నుంచి విమానంలో తూత్తుకుడికి బయల్దేరి వెళ్ళారు. ఈ జట్టులో ఆర్పీ కౌల్‌, ఆర్‌. తంగమణి, భవ్యాపాండే సభ్యులుగా ఉన్నారు. వీరందరూ తూత్తుకుడిలో వర్ష, వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. పలుచోట్ల నీట మునిగిన పంటలను సందర్శించారు. ఆ సందర్భంగా స్థానిక రైతులను కలుసుకుని పంటనష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కారులో అక్కడి నుంచి బయల్దేరి కన్నియాకుమారి జిల్లాలో వరద బాధిత ప్రాంతాలను సందర్శించిన మీదట మళ్ళీ తూత్తుకుడికి చేరుకున్నారు. ఈ బృందం సభ్యులు రాత్రి తూత్తుకుడిలోనే బసచేస్తారు. మంగళవారం ఉదయం తూత్తుకుడి నుంచి విమానంలో బయల్దేరి చెన్నై చేరుకుంటారు. చెన్నై నుంచి కారులో బయలుదేరి వేలూరు, రాణిపేట జిల్లాల్లో వర్ష, వరద బాధిత ప్రాంతాలలో పర్యటించనున్నారు. రెండు జట్లకు చెందిన సభ్యులంతా తమ పర్యటనను ముగించుకుని ఈ నెల 24 తేదీ ఉదయం 10 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కలుసుకుని చర్చలు జరుపుతారు.

Updated Date - 2021-11-23T15:26:11+05:30 IST