తీరానికి కొట్టుకొచ్చిన 40 టన్నుల చచ్చిన చేపలు!

ABN , First Publish Date - 2021-05-01T01:56:34+05:30 IST

కలుషిత జలాల కారణంగా 40 టన్నులకు పైగా చచ్చిన చేపలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. లెబనాన్‌లోని లిటాని నదిలో

తీరానికి కొట్టుకొచ్చిన 40 టన్నుల చచ్చిన చేపలు!

కరౌన్(లెబనాన్): కలుషిత జలాల కారణంగా 40 టన్నులకు పైగా చచ్చిన చేపలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. లెబనాన్‌లోని లిటాని నదిలో జరిగిందీ ఘటన. ఒడ్డుకు కొట్టుకొచ్చిన చచ్చిన చేపలతో నదీతీర గ్రామాలు నిండిపోయాయి. దుర్వాసనతో తీరప్రాంత ప్రజల ముక్కుపుటాలు అదిరిపోయాయి. దేశంలోనే అతిపొడవైన నది అయిన లిటానిలో కలుషిత జలాలు కలుస్తుండడంపై సామాజిక కార్యకర్తలు కొన్నేళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ పట్టించుకోని ఫలితమే ఇదని సమీప గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 


చచ్చిన చేపలతో నది మొత్తం దుర్గంధంగా మారుతుండడంతో వలంటీర్లు వెంటనే రంగంలోకి దిగి వాటిని అక్కడి నుంచి తొలగించే పనులు మొదలుపెట్టారు. కారౌన్ రిజర్వాయర్ వద్ద చచ్చిపడిన చేపల కళేబరాలను తొలగించారు. వేలాది చేపలు కుళ్లిపోవడంతో నది నీళ్లు కూడా కంపు కొడుతున్నాయి.


ఇక్కడ చాలా రోజులుగా పరిస్థితి ఇలానే ఉందని స్థానిక కార్యకర్త అహ్మద్ అస్కర్ పేర్కొన్నారు. నదిలోకి చెత్త, మురుగునీరు కలుస్తుండడం సహించరానిదని అన్నారు. దాదాపు 40 టన్నుల చేపలు చచ్చిపోయాయని, ఇది మంచి పరిణామం కాదని అస్కర్, స్థానిక జాలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా లిటాని రివర్ అథారిటీ ఇందుకు గల కారణాన్ని తెలుసుకోవాలని, కలుషిత నీటిని నదిలోకి వదులుతున్న వారిని గుర్తించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 


వైరస్ కారణంగా చేపలు విషపూరితమయ్యాయని, కాబట్టి చేపల వేటకు వెళ్లొద్దని రివర్ అథారిటీ ఈ వారం మొదట్లో హెచ్చరించింది. ‘ఇది ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే తీవ్ర విపత్తు’ అని అభివర్ణించింది. కాగా, 1959లో నిర్మించిన ఈ రిజర్వాయరులో చేపల వేటను 2018లోనే నిషేధించారు. ఇందులోని నీళ్లు జలవిద్యుదుత్పత్తికి, వ్యవసాయానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు.  

Updated Date - 2021-05-01T01:56:34+05:30 IST