కరోనా నిబంధనలు పాటించకుండా.. న్యూయార్క్‌లో 400 మంది అక్రమంగా..

ABN , First Publish Date - 2020-12-01T08:05:45+05:30 IST

అమెరికాలో కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతున్నా అక్కడి ప్రజలు మహమ్మారిని ఏమాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదు.

కరోనా నిబంధనలు పాటించకుండా.. న్యూయార్క్‌లో 400 మంది అక్రమంగా..

న్యూయార్క్: అమెరికాలో కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతున్నా అక్కడి ప్రజలు మహమ్మారిని ఏమాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదు. న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌లో కరోనా నిబంధనలను పాటించకుండా అక్రమంగా పార్టీని నిర్వహిస్తున్న క్లబ్‌ను తాజాగా పోలీసులు మూసివేశారు. లిక్కర్ లైసెన్స్ లేకుండానే ఈ క్లబ్‌లో 400 మందికి  పైగా మందు పార్టీ చేసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు. గత కొద్ది నెలలుగా న్యూయార్క్‌లో ప్రతి వారాంతం ఇలాంటి అక్రమ క్లబ్‌లను తాము గుర్తిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. మందు, పార్టీ చేసుకోవడం కోసం ప్రతి వారాంతం వందలాది మంది కలిసి అక్రమంగా ఇలా క్లబ్‌లు ఏర్పాటు చేసుకుంటున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఇలాంటి క్లబ్‌లు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. 


ఇదిలా ఉంటే.. న్యూయార్క్ నగరంలో ఈ నెల మొదట్లో 2 శాతంగా ఉన్న కరోనా పాజిటివ్ రేటు నెలాఖరుకు 3.9 శాతానికి పెరిగినట్టు మేయర్ బిల్ డీ బ్లాసియో తెలిపారు. థ్యాంక్స్ గివింగ్ డే కారణంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగినట్టు ఆయన వివరించారు. గత వారం రోజుల్లో న్యూయార్క్ నగరంలో 720 మంది కరోనా బారిన పడినట్టు ఆయన చెప్పుకొచ్చారు. కాగా.. అమెరికాలో నిత్యం లక్షన్నర నుంచి రెండు లక్షల కేసులు నమోదవుతున్నాయి. థ్యాంక్స్ గివింగ్ డే, క్రిస్ట్‌మస్ కారణంగా ఈ కేసుల సంఖ్య రెట్టింపు అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. అమెరికాలో ఇప్పటివరకు మొత్తం 1,37,60,186 కేసులు నమోదుకాగా.. కరోనా బారిన పడి 2,73,160 మంది మృత్యువాతపడ్డారు. 

Updated Date - 2020-12-01T08:05:45+05:30 IST