Abn logo
May 1 2021 @ 06:23AM

400 ఏళ్ల క్రితం నాటి సీన్ ఇప్పుడు మళ్ళీ రిపీట్..! అప్పుడు కూడా అచ్చం ఇలాగే..

ప్రస్తుత కరోనా కాలంలో మనం ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే ఆలోచిస్తున్నాం. సోషల్ డిస్టెన్సింగ్, లాక్‌డౌన్ పదాలు మన రోజువారీ జీవితంలో భాగం అయిపోయాయి. ఆధునిక వైద్యశాస్త్రం ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కరోనా మహమ్మారిని నియంత్రించడానికి శాస్త్రవేత్తలకు ఇంతకు మించి ఆలోచన రాలేదు. అయితే ఇప్పుడు మనం చూస్తున్న కరోనా నిబంధనల మూలాలు ఎక్కడున్నాయో తెలుసా? 432 ఏళ్ల క్రితం చరిత్రలో. ఒక వైరస్ వ్యాప్తిని గుర్తించిన వైద్యుడు.. ఇప్పుడు మనం చూస్తున్న లాక్‌డౌన్ నిబంధనలను అమలు చేసి బుబోనిక్ మహమ్మారి నుంచి లక్షలాది ప్రాణాలను కాపాడాడు.


డాక్టర్ క్వింటో టిబెరియో ఏంజెలెరియో (Quinto Tiberio Angelerio) ఒక డాక్టర్. ఇటలీకి చెందిన ఆయన సిసిలీలో ఉండేవాడు. ఇక్కడ 1575లో ఒక మహమ్మారి వచ్చి ఎన్నో ప్రాణాలు బలయ్యాయి. అలాంటి ప్రాంతంలో పుట్టిపెరిగిన డాక్టర్ ఏంజెలెరియోకు సహజంగానే ఇలాంటి మహమ్మారులను నియంత్రించడంపై ఆసక్తి పెరిగింది. వైద్య శాస్త్రం చదివిన తర్వాత ఆ ఆసక్తి పట్టుదలగా మారింది. మళ్లీ అలాంటి మహమ్మారి ఎదురైతే ఏం చేయాలి? అని తలబద్దలుకొట్టుకున్న ఏంజెలెరియో కొన్ని నిబంధనలు సృష్టించాడు. అవి పాటిస్తే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని నమ్మాడు.


1852లో సిసిలీ నుంచి ఆల్ఘెరో (Alghero)కు వచ్చాడు ఏంజెలెరియో. ఇక్కడ ఉండగా బుబోనిక్ మహమ్మారి విజృంభించే లక్షణాలు ఆయన కంట పడ్డాయి. సాధారణ ప్రజలు వాటిని పట్టించుకోకపోయినా.. స్వతహాగా వైద్యుడు, తన స్వస్థలంలో ఒకసారి ఇలాంటి మహమ్మారి వందలాది ప్రాణాలు బలిగొనడం తెలిసిన వాడు అయిన ఏంజెలెరియో మాత్రం ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టాడు. వెంటనే మహమ్మారిని నియంత్రించడానికి తాను సృష్టించిన నిబంధనలు పాటించాలంటూ ప్రజలను, స్థానిక అధికారులను కోరాడు. అయితే వారి నుంచి అతనికి ప్రతిఘటనే ఎదురైంది తప్ప ఎవరూ ఏంజెలెరియో మాటలు నమ్మలేదు. ఏమీ జరక్కుండానే అతను ఆరాటపడుతున్నాడని విమర్శలు చేశారు కూడా. ప్రజల నుంచి అంత వ్యతిరేకత వచ్చేలా ఏంజెలెరియో చెప్పిన నిబంధనలు ఏంటో తెలుసా?వైద్యుడిగా తన అనుభవాన్ని, జ్ఞానాన్ని రంగరించి మహమ్మారి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏంజెలెరియో 57 నిబంధనలు పేర్కొంటూ ఒక పుస్తకం రాశాడు. దానిలో ఉన్న నిబంధనలు ప్రస్తత కరోనా కాలంలో మనం పాటిస్తున్న వాటితో చాలావరకూ సరిపోతాయి. ఇంతకీ ఏంజెలెరియో రాసిన నిబంధనలేంటంటే..

  • సామాజిక దూరం: కుదిరితే ప్రజలంతా తమ వెంట ఒక స్కేలు వంటిది తెచ్చుకొని, ఇతరులతో కనీసం 6 అడుగుల దూరం పాటించాలనే నిబంధనల ఏంజెలెరియో పేర్కొన్న అతిముఖ్యమైన వాటిలో ఒకటి.


  • అలాగే ఇళ్ల నుంచి అందరూ బయటకు రావొద్దని, కుటుంబం నుంచి ఎవరో ఒకరు మాత్రమే బయటకు వచ్చి అవసరమైన వస్తువులు తీసుకెళ్లాలని ఏంజెలెరియో సూచించాడు. అలాగే ప్రజలంతా తమ ఇళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా డిసిన్ఫెక్ట్ చేసుకోవాలని చెప్పాడు.


  • హ్యాండ్‌షేక్స్, సమావేశాలు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వంటివి చేయొద్దని స్పష్టంచేశాడు.


  • ప్రజలు సామాజిక దూరం పాటించడాని వీలుండేలా, ఆహారం అమ్మే దుకాణాలు రెయిలింగ్ ఏర్పాటు చేసుకోవాలని గట్టిగా చెప్పాడు.


  • స్థానిక అధికారులు సిటీ చుట్టూ కార్డన్ ఏర్పాటు చేయాలని, ప్రజలెవర్నీ సిటీ దాటి వెళ్లకుండా ఆపాలని, ఇలా చేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని ఆపవచ్చని ఏంజెలెరియో సూచించాడు.


ఇలా ఏంజెలెరియో చెప్పిన నిబంధనలు ఇటు ప్రజలకు, అటు స్థానిక అధికారులకు నచ్చలేదు. దీంతో వారు అతనిపై విమర్శలు చేస్తూ నిబంధనలను తుంగలో తొక్కారు. అయినా వెనక్కు తగ్గని ఏంజెలెరియో ఆ ప్రాంత వైస్రాయ్‌ను కలిసి తన ప్రణాళికను వివరించాడు. వస్తున్న ప్రమాదాన్ని గుర్తించిన వైస్రాయ్.. ఏంజెలెరియోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఆ ప్రాంతంలో ఈ నిబంధనలన్నీ అమలు చేసిన ఏంజెలెరియో.. బుబోనిక్ మహమ్మారిని చాలావరకు నియంత్రించాడనడం అతిశయోక్తికాదు. చూశారా?

Advertisement
Advertisement