మేనకోడలికి ఆన్‌లైన్‌ క్లాసులని స్మార్ట్‌ఫోన్ కొనిస్తే.. చివరికి..

ABN , First Publish Date - 2020-11-14T23:26:38+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలోని ఓ మాల్‌లో శుక్రవారం రోజు ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. భీమ్ సింగ్ అనే 40 ఏళ్ల వ్యక్తి తన మేనకోడలికి...

మేనకోడలికి ఆన్‌లైన్‌ క్లాసులని స్మార్ట్‌ఫోన్ కొనిస్తే.. చివరికి..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ మాల్‌లో శుక్రవారం రోజు ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..  భీమ్ సింగ్ అనే 40 ఏళ్ల వ్యక్తి తన మేనకోడలికి ఆన్‌లైన్ క్లాసులు జరుగుతుండటంతో స్మార్ట్‌ఫోన్ కొనివ్వాలనుకున్నాడు. నెల రోజుల క్రితం ప్రహ్లాద్‌పూర్‌లోని తన ఇంటికి దగ్గర్లో ఉన్న ఓ మొబైల్ షోరూంకు వెళ్లి 14వేల ధర కలిగిన స్మార్ట్‌ఫోన్ కొని.. 12వ తరగతి చదువుతున్న తన మేనకోడలికి ఇచ్చాడు. తన సోదరి నెల రోజుల క్రితం చనిపోవడంతో మేనకోడలికి భీమ్ సింగే అన్నీ తానై చూసుకుంటున్నాడు. అయితే.. ఫోన్ కొనిచ్చిన కొన్ని రోజులకే ఆ స్మార్ట్‌ఫోన్ బాగా హీటవడం, హ్యాంగ్ అవడం లాంటి సమస్యలు తలెత్తడంతో.. అతని మేనకోడలు ఈ విషయాన్ని భీమ్ సింగ్‌కు చెప్పింది. కొని నెల రోజులు కూడా పూర్తి కాకుండానే ఇలాంటి సమస్య రావడంతో.. ఆ ఫోన్‌ను ఢిల్లీలోని రోహిణిలో ఉన్న ఎం2కె మాల్‌కు వెళ్లి ఆ మొబైల్ కంపెనీ సర్వీస్ సెంటర్‌లో చూపించాడు.


ఈ ఫోన్ తీసుకుని తనకు కొత్త స్మార్ట్‌ఫోన్ ఇవ్వాలని భీమ్ సింగ్ సర్వీస్ సెంటర్ వారిని కోరాడు. అయితే.. అది తమ పాలసీకి విరుద్ధమని, కొత్త ఫోన్ ఇవ్వడం కుదరదని మొబైల్ కంపెనీ సర్వీస్ సెంటర్ వారు తేల్చి చెప్పారు. తనకు కొత్త ఫోన్ ఇవ్వాలని పలుమార్లు సర్వీస్ సెంటర్‌కు వెళ్లి భీమ్ సింగ్ అడిగినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో.. ఇక లాభం లేదనుకుని భావించిన భీమ్ సింగ్ ఓ ఖాళీ బాటిల్‌లో పెట్రోల్ తీసుకెళ్లి తనకు కొత్త ఫోన్ ఇవ్వాలని సర్వీస్ సెంటర్ వాళ్లను నిలదీశాడు. అందుకు వాళ్లు ఒప్పుకోకపోవడంతో మాల్‌లోనే.. సర్వీస్ సెంటర్ ఎదుటే మీద పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు. భీమ్ సింగ్‌ను ఆసుపత్రికి తరలించారు. దాదాపు 40 శాతం కాలిన గాయాలయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని రోహిణి డీసీపీ పీకే మిశ్రా తెలిపారు.

Updated Date - 2020-11-14T23:26:38+05:30 IST