అందమైన యువతులతో డేటింగ్‌ పేరిట 41.50 లక్షలు డిపాజిట్‌ చేయించుకుని..

ABN , First Publish Date - 2021-03-28T16:42:54+05:30 IST

అందమైన యువతులు, మహిళలతో డేటింగ్‌ పేరుతో

అందమైన యువతులతో డేటింగ్‌ పేరిట 41.50 లక్షలు డిపాజిట్‌ చేయించుకుని..

  • నగరవాసి నుంచి రూ. 41.50 లక్షలు కాజేసిన మోసగాళ్లు
  • ఇద్దరిని అరెస్ట్‌ చేసిన సీసీఎస్‌ పోలీసులు

హైదరాబాద్‌ : అందమైన యువతులు, మహిళలతో డేటింగ్‌ పేరుతో నగరవాసి నుంచి రూ. 41.50 లక్షలు కాజేసిన ఇద్దరు సైబర్‌ నేరగాళ్లను సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గ్రేటర్‌ నోయిడాకు చెందిన కుశాల్‌ చౌదరి(30), ఉమేష్‌ యాదవ్‌ (21), జంటా విశ్వాస్‌, అమన్‌ వర్మ కలిసి ముఠా కట్టారు. ఆన్‌లైన్‌ డేటింగ్‌ సైట్లలో సోషల్‌ మీడియా వేదికల్లో మహిళలతో డేటింగ్‌ చేసేందుకు యువకులు కావాలని పోస్టింగ్‌లు చేసేవారు. వీటిని చూసి ఆసక్తి కనబరిచి ఫోన్‌ చేసిన వారి నుంచి పలు ఫీజుల పేరుతో అందినకాడికి దోచేస్తారు. యువకులను నమ్మించేందుకు వెస్ట్‌ బెంగాల్‌ ప్రాంతం నుంచి యువతులతో ఫోన్‌లో మాట్లాడించేవారు. ఆ యువతులు తమను కలుసుకోవాలంటే సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాలంటూ ఒత్తిడి చేసేవారు. నగరానికి చెందిన ఓ యువకుడు వీరి మాయలో పడ్డాడు. ఆన్‌లైన్‌లో ఉన్న ప్రకటనను చూసి.. వారిని సంప్రదించాడు.


అందమైన మహిళలు, యువతులు తమ సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని, వారితో డేటింగ్‌ చేయాలంటే కొంత మొత్తం సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాలని కోరారు. వారి మాటలు నమ్మిన అతడు వారు సూచించినట్లు  బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేశాడు. హోటల్‌ సెక్యూరిటీ డిపాజిట్‌, యువతుల సెక్యూరిటీ పేరుతో పలు దఫాలుగా అతడి నుంచి  రూ.41.50 లక్షలు కాజేశారు. అనంతరం ఫోన్‌ స్విచ్చాఫ్‌ రావడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుతో కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులను గుర్తించిన సీసీఎస్‌ పోలీసులు కుశాల్‌ చౌదరి, ఉమేష్‌ యాదవ్‌లను అరెస్ట్‌ చేసి నగరానికి తరలించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

Updated Date - 2021-03-28T16:42:54+05:30 IST