1980 విమాన ప్ర‌మాదంలో సంజ‌య్‌గాంధీ మృతి.... ఒక్క‌సారిగా మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు

ABN , First Publish Date - 2021-06-23T13:39:36+05:30 IST

ప్రపంచ చరిత్రలో ప‌రిస్థితుల‌ను త‌ల్ల‌కిందులు చేసే

1980 విమాన ప్ర‌మాదంలో సంజ‌య్‌గాంధీ మృతి.... ఒక్క‌సారిగా మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు

న్యూఢిల్లీ: ప్రపంచ చరిత్రలో ప‌రిస్థితుల‌ను త‌ల్ల‌కిందులు చేసే ఎన్నో ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. భారత రాజకీయ చరిత్రలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. జూన్23, 1980 న జరిగిన ఒక విమాన ప్రమాదం భారతదేశాన్నంత‌టినీ కుదిపేసింది. దేశంలోని రాజకీయ సమీకరణ‌లను ఒక్క సారిగామార్చివేసింది. ఆరోజు మాజీ ప్రధాన మంత్రి, దివంగ‌త‌ ఇందిరా గాంధీ, ఫిరోజ్ గాంధీల చిన్న కుమారుడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో క‌న్నుమూశారు. ఆ సమయంలో సంజయ్ గాంధీని ఇందిరా గాంధీ రాజకీయ వారసునిగా అంద‌రూ భావించేవారు. సంజయ్ గాంధీ మరణించకపోయివుంటే ఇందిర‌ పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చేవారు కాద‌ని అంటుంటారు. సంజయ్ గాంధీ 1980 మే నెల‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇది జ‌రిగిన నెల‌రోజుల‌కు అత‌ను విమాన ప్రమాదంలో క‌న్నుమూశారు.


ప్రమాద సమయంలో సంజయ్ గాంధీ ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్‌కు చెందిన నూత‌న‌ విమానంలో ప్ర‌యాణిస్తున్నారు. సంజ‌య్‌గాంధీ ఏరోబాటిక్ స్టంట్ చేస్తున్నప్పుడు నియంత్రణ కోల్పోయారు. దీంతో అత‌ను నడుపుతున్న‌ విమానం కూలిపోయింది. ఈ విమాన ప్రమాదంలో సంజ‌య్ గాంధీ తలకు బ‌ల‌మైన గాయం కావ‌డంతో వెంట‌నే మరణించారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న మ‌రో ప్రయాణికుడు కెప్టెన్ సుభాష్ సక్సేనా కూడా ఈ ప్రమాదంలో క‌న్నుమూశారు. సంజయ్ గాంధీ 1974, మే 23న  మేనకా గాంధీని వివాహం చేసుకున్నారు.  సంజయ్ విమాన‌ ప్రమాదంలో మరణించిన స‌మ‌యంలో అతని కుమారుడు వరుణ్ వయసు కేవలం మూడు నెలలు మాత్రమే. దేశంలో అప్ప‌టి ప్ర‌ధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితులు విధించిన‌ స‌మ‌యంలో సంజయ్ గాంధీ పాత్ర చాలా వివాదాస్పదమ‌య్యింది. 70 వ దశకంలో సంజ‌య్‌గాంధీ కాంగ్రెస్‌లో కీల‌క నేత‌గా ఉన్నారు. ఖుష్వంత్ సింగ్ రాసిన 'సంపూర్ణ ఖుష్వంత్' పుస్తకంలోని వివ‌రాల ప్రకారం సంజ‌య్ గాంధీ మరణానంతరం ఇందిర‌, మేనకాగాంధీల‌ మధ్య మ‌న‌స్పర్థ‌లు పుట్టుకొచ్చాయని, ఆ త‌రువాత కాలంలో మేనకా గాంధీ ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఇదే స‌మయంలో ఆమె రాజకీయాల్లో ప్ర‌వేశించి, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 

Updated Date - 2021-06-23T13:39:36+05:30 IST