దేశంలో 43 వేలు..

ABN , First Publish Date - 2021-07-29T06:28:32+05:30 IST

కేరళలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మంగళ, బుధవారాల్లో

దేశంలో 43 వేలు..

  • కేరళలోనే 22 వేలు
  • కరోనా కొత్త కేసుల్లో సగం పైగా ఈ రాష్ట్రంలోనే.. 
  • త్వరలో కేరళకు ఎపిడెమియాలజిస్టులు, నిపుణులు
  • పాజిటివిటీ ఎక్కువ ఉన్న జిల్లాల్లో కేరళవే ఏడు
  • జాగ్రత్తలు మరువొద్ద్దు.. రాష్ట్రాలకు కేంద్రం సూచన
  • ఐసీఎంఆర్‌ భాగస్వామ్యంతో సీరో సర్వేకు ఆదేశం

 

న్యూఢిల్లీ, తిరువనంతపురం, జూలై 28: కేరళలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మంగళ, బుధవారాల్లో 22 వేలకు పైగా పాజిటివ్‌లు నమోదయ్యాయి. మంగళవారం దేశంలో 43,654 మందికి వైరస్‌ నిర్ధారణ కాగా ఇందులో సగానికి మించి కేరళ(22,129)కు చెందినవే. క్రితం రోజుకు ఇవి రెట్టింపు. దేశంలో గత 51 రోజుల్లో 20వేలకు పైగా పాజిటివ్‌లు నమోదైన రాష్ట్రం కేరళనే.


కాగా, దేశంలో కరోనాతో మంగళవారం 640 మంది చనిపోయినట్లు కేంద్రం తెలిపింది. మరోవైపు వరుసగా పండుగలు రానున్నందున రద్దీ ప్రదేశాల్లో కొవిడ్‌ నిబంధనల పాటింపుపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌, వ్యాక్సిన్‌, జాగ్రత్తల పాటింపు నిరంతరం పరిశీలన ఉండాలని పేర్కొంది. కొవిడ్‌పై అనుమానా లను తొలగించేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేయాలని మత, సామాజిక సంస్థల ప్రతినిధులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.


పిల్లలకు వ్యాక్సిన్లు వేయకుండా స్కూళ్లకు పంపేందుకు సిద్ధంగా లేమని దేశంలోని 48% మంది తల్లిదండ్రులు అంటున్నారు. తమ జిల్లాలో కరోనా కేసులు పూర్తి గా తగ్గిపోయాకే తమ పిల్లలను బడికి పంపుతామని 30% తల్లిదండ్రులు చెప్పారు. స్కూళ్లను ఎప్పుడు తెరిచినా తమ పిల్లలను పంపడానికి సిద్ధంగా ఉన్నామని 21% తల్లిదండ్రులే చెప్పారు. గత వారం ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు 21% పెరిగాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. యూరప్‌ మినహా మిగతా అన్ని ఖండాల్లోనూ మృతుల సంఖ్య పెరిగిందని పేర్కొంది. అమెరికా, బ్రెజిల్‌, భారత్‌, ఇండోనేసియా, యూకేల్లో కేసులు ఎక్కువగా వచ్చినట్లు చెప్పింది. 




ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఉచిత టీకా

దేశంలోనే తొలిసారిగా ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ కరోనా నిరోధక టీకాల ఉచిత పంపిణీ పథకం తమిళనాట ప్రారంభమైంది. భారతీయ పరిశ్రమల సమాఖ్యతో పాటు మరికొన్ని సంస్థలు అందించిన నిధులతో రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా టీకా పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ స్థానిక ఆళ్వారుపేటలోని కావేరీ ఆసుపత్రిలో బుధవారం లాంఛనంగా ప్రారంభించారు.


Updated Date - 2021-07-29T06:28:32+05:30 IST