HYD : ఒక్కరోజులోనే కోటీశ్వరుడవ్వాలని ఏం చేశాడో చూడండి..!

ABN , First Publish Date - 2021-11-06T17:36:28+05:30 IST

ఒక్కరోజులోనే కోటీశ్వరుడు కావాలని అనుకున్న ....

HYD : ఒక్కరోజులోనే కోటీశ్వరుడవ్వాలని ఏం చేశాడో చూడండి..!

హైదరాబాద్ సిటీ/సికింద్రాబాద్‌ : రైళ్లలో ప్రయాణికులకు మత్తుమందు ఇచ్చి దోపిడీకి పాల్పడుతున్న పాతనేరస్థుడిని సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే డీఎస్పీ చంద్రభాను, రైల్వే సీఐడీ ఇన్‌స్పెక్టర్లు రవిబాబు, వీరబాబుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ బుదౌన్‌ జిల్లా కాకర్ల గ్రామానికి చెందిన ముకద్దర్‌ అలీ (44) దుస్తుల వ్యాపారి. వ్యాపారంలో నష్టపోవడంతో ఒక్కరోజులోనే కోటీశ్వరుడు కావాలని అనుకున్న ఇతను రైళ్లలో ప్రయాణం చేసేవాడు. మధ్యరాత్రిలో రైళ్లలో ప్రయాణికులు పడుకున్న సమయంలో పండ్లలో సూది ద్వారా మత్తు మందు కలిపి దేవుడి ప్రసాదం అంటూ తోటి ప్రయాణికులకు మాయ చేసి తినిపించేవాడు. 2019 సెప్టెంబర్‌ 9న సికింద్రాబాద్‌ - నాగాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో జనరల్‌ కోచ్‌లో ప్రయాణం చేస్తున్న బాధితుడు రజ్జన్‌ సింగ్‌ అనే వ్యక్తికి ముకద్దర్‌ అలీ మత్తుమందు కలిపి ఉన్న పండ్లు ప్రసాదం అంటూ తినిపించాడు.


కోమాలో ఉన్న ప్రయాణికుడు నాగాపూర్‌ రాగానే కోమా నుంచి కోలుకుని చూసే సరికి తన వద్ద ఉన్న బ్యాగు కనిపించలేదు. బ్యాగులో రూ 15 వేలు నగదు, ఖరీదైన ఫోన్‌, ఏటీఎం కార్డులు, పాస్‌పోర్టు, దుస్తులు ఎత్తుకెళ్ళాడు. అదే విధంగా 2018 సెప్టెంబర్‌లో చెన్నై రైల్వే స్టేషన్‌లో విజయవాడ రైల్వే స్టేషన్‌ వద్ద ఓ తోటి ప్రయాణికుడికి మత్తుమందు కలిపిని బిస్కెట్లు తినిపించాడు. అతడి  నుంచి రూ 3 వేలు నగదు, బంగారు ఆభరణాలు  చోరీ చేశాడు. 2019 మేలో హజరత్‌ నిజాముద్దిన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని ఇదే తరహాలో మత్తుమందు కలిపి అతడి నుంచి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. 


ఈనెల 4న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అక్కడ మాటు వేసిన రైల్వే సీఐడీ ఇన్‌స్పెక్టర్లు రవిబాబు, వీరబాబు, జీఆర్‌పీ, ఆర్పీఎఫ్‌ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా ఆయా రైల్వే స్టేషన్‌ల పరిధిలో ప్రయాణికులకు మత్తుమందు (డోపింగ్‌) తినిపించి నగలు కాజేస్తానని విచారణలో వెల్లడించాడు. నిందితుడిని అరెస్టు చేసి నగదు, బంగారు ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మీడియా సమావేశంలో రైల్వే సీఐబీ  ఇన్‌స్పెక్టర్లు రవి బాబు, వీరబాబు, భవాని సరస్వతి ఆర్పీఎఫ్‌ సీఐ నర్సింహ, ఎస్సై శ్రీనివాస్‌, జీఆర్‌పీ ఎస్సైలు మాజీద్‌, రమే‌ష్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-06T17:36:28+05:30 IST