రూ.4626 కోట్లివ్వండి: కేంద్ర బృందానికి CM విజ్ఞప్తి

ABN , First Publish Date - 2021-11-25T13:31:44+05:30 IST

ఎడతెరిపి లేని వర్షాల కారణంగా దెబ్బతిన జిల్లాలను ఆదుకునేందుకు, వర్షాలు, వరద నివారణ చర్యలకు రూ.4,626 కోట్లు కేటాయించాలని కేంద్ర పరిశీలక బృందానికి ముఖ్య మంత్రి ఎంకే స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు. జిల్లాల్లో

రూ.4626 కోట్లివ్వండి: కేంద్ర బృందానికి CM విజ్ఞప్తి

                  - 12 జిల్లాల్లో వరద నష్టాలపై సమీక్ష


చెన్నై: ఎడతెరిపి లేని వర్షాల కారణంగా దెబ్బతిన జిల్లాలను ఆదుకునేందుకు, వర్షాలు, వరద నివారణ చర్యలకు రూ.4,626 కోట్లు కేటాయించాలని కేంద్ర పరిశీలక బృందానికి ముఖ్య మంత్రి ఎంకే స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు. జిల్లాల్లో కనిపించని నష్టం సంభవించిందని, తమ ప్రభుత్వం ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టినా తీరని నష్టం వాటిల్లిందని ఆయన కేంద్ర బృందానికి వివరించారు. తొలుత ప్రాథమిక అంచనా ప్రకారం రూ.2,080 కోట్లకు కేంద్రానికి నివేదిక అందజేశామని పేర్కొన్న ముఖ్యమంత్రి తాజాగా రూ.4,626 కోట్లు కేటా యించాలని కోరారు. తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.1,071 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.3,555 కోట్లు కేటాయించాలని, జాతీయ విపత్తుల నివారణ నిధుల నుంచి ఈ నిధులు కేటాయించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. వర్షబాధిత ప్రాంతాల్లో రెండు రోజులపాటు పర్యటించిన కేంద్ర పరిశీలకబృందం సభ్యులు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఈశాన్య రుతు పవనాల ప్రభావం, రెండు వాయుగుండాల కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఆస్తినష్టం, పంటనష్టం సంభవించిన 12 జిల్లాల్లో కేంద్ర పరిశీలక బృందం సభ్యులు రెండు జట్లుగా ఏర్పడి వేర్వేరుగా పర్యటించిన విషయం తెలిసిందే. కేంద్ర హోంశాఖ డిప్యూటీ సెక్రటరీ రాజీవ్‌శర్మ నాయకత్వంలోని ఈ బృందంలో కేంద్ర ఆర్థిక శాఖ వ్యయవిభాగం సలహాదారుడు ఆర్బీ కౌల్‌, కేంద్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ విజయ్‌ రాజ్‌మోహన్‌, చెన్నైలోని కేంద్ర నీటి వనరుల సంస్థ డైరెక్టర్‌ ఆర్‌ తంగమణి, కేంద్ర ఇంధనశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ భవ్యా పాండే, చెన్నైలోని కేంద్ర జాతీయ రహదారుల శాఖ ప్రాంతీయ అధికారిరణజయ్‌సింగ్‌, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఎంవీఎన్‌ వరప్రసాద్‌ సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం సభ్యులు మంగళవారం సాయంత్రం తమ పర్యటనను ముగించుకుని చెన్నైకి తిరిగివచ్చారు. రాత్రి స్థానిక ఎంఆర్‌సీ నగర్‌లోని స్టార్‌ హోటల్‌లో బసచేశారు. ఆ తర్వాత బుధవారం ఈ బృందం సభ్యులంతా సచివాలయానికి వెళ్లి స్టాలిన్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో సంభవించిన వర్షబాధిత ప్రాంతాల్లో వరద బాధిత ప్రాంతాల్లో ఏర్పడిన పంట, ఆస్తి నష్టాల గురించి, ప్రభుత్వం బాధితులను ఆదుకునేందుకు తీసుకున్న చర్యలు గురించి స్టాలిన్‌ వివరించారు. ఇటీవల డీఎంకే ఎంపీ టీఆర్‌ బాలు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుసుకుని రాష్ట్రానికి వరద నిధులు మంజూరు చేయమని వినతిపత్రం సమర్పించిన విషయాన్ని కూడా కేంద్ర బృందం సభ్యులకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వర్షబాధితులను, వరద బాధితులను ఆదుకునేందుకు రూ.2629 కోట్ల మేరకు నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని స్టాలిన్‌ తెలిపారు. సుమారు గంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర బృందం సభ్యులు ఢిల్లీకి పయనమైవెళ్లారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, మంత్రి కేఎన్‌ నెహ్రూ, ఏవీ వేలు, కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌, రెవెన్యూ విభాగ కమిషనర్‌ కె.ఫణీందర్‌రెడ్డి, ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శి ఎన్‌ మురుగానందం, రెవిన్యూ విపత్తుల నివారణ శాఖ ప్రధాన కార్యదర్శి కుమార్‌ జయంత్‌, విపత్తుల నివారణ శిఖ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌ సుబ్బయన్‌ తదితరులు పాల్గొన్నారు.


కలెక్టర్లతో సమీక్ష

రాష్ట్రంలో మళ్ళీ భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వరద ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టే నిమిత్తం జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సమావేశమయ్యారు. బుధవారం ఉదయం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన జిల్లా కలెక్టర్లతో చర్చలు జరిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం త్వరలో వాయుగుండంగా మారుతుందని, దాని ప్రభావంతో ఈ నెల 25 నుంచి 28 వరకు చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, రాణిపేట, కడలూరు, విల్లుపురం తదితర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. దీంతో ఈ జిల్లాలకు చెందిన కలెక్టర్లతో ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రత్యేకంగా మాట్లాడుతూ... వర్షబాధిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను వివరించారు. పల్లపు ప్రాంతాల్లో నివసిస్తున్నవారిని, జలాశయాలకు చేరువుగా నివసిస్తున్నవారిని వీలయినంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉందని, దానికంటే ముందు వీధుల్లో వర్షపునీరు చేరకుండా కాలువలలో పూడిక పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇదేవిధంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన సమగ్రంగా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు తదితర అధికారులు కూడా పాల్గొన్నారు.



Updated Date - 2021-11-25T13:31:44+05:30 IST