అందని ప్రోత్సాహం

ABN , First Publish Date - 2020-02-23T05:37:45+05:30 IST

విద్యలో అత్యున్నతంగా రాణించిన వారిని ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేశారు. వీరిలో పదోతరగతి

అందని ప్రోత్సాహం

సర్టిపికెట్‌ ఇచ్చారు.. ట్యాబ్‌లు, నగదు మరిచారు !

నాలుగు నెలలుగా పంపిణీ కాని వైనం

471 మంది విద్యార్థుల నిరీక్షణ

త్వరలో అందిస్తాం : డీఈవో


నెల్లూరు (విద్య) ఫిబ్రవరి 22 : విద్యలో అత్యున్నతంగా రాణించిన వారిని ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేశారు. వీరిలో పదోతరగతి నుంచి పీజీ వరకు విద్యార్థులు ఉన్నారు. వీరిని మరింతగా వెన్నుతట్టి ప్రోత్సహించడానికి అవార్డులు  కూడా ప్రకటించారు. ప్రతిభావంతులకు ట్యాబ్‌లు, నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని భావించారు. ఆరంభంలో హడావిడి చేసినా ఆచరణలో మాత్రం  విద్యాశాఖాధికారులు వాటిని అందజేయలేదు. నాలుగు నెలలుగా వాటి కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.


471 మంది ఎంపిక

భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి (జాతీయ విద్యా దినోత్సవం) సందర్భంగా క్షిపణి పితామహుడు డాక్టర్‌ ఏపీజే అబుల్‌ కలాం పేరుతో ప్రతిభావంతులకు విద్యా పురస్కారాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో గత  నవంబరులో జిల్లా నుంచి 471 మంది విద్యార్థులను  ఎంపిక చేసింది. వీరిలో పలు కేటగిరీల వారున్నారు. వీరందరికీ నగరంలోని కస్తూర్భా కళాక్షేత్రంలో నవంబరు 11న అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. వీరికి ప్రశంసాపత్రాలతోపాటు  ట్యాబ్‌, రూ.20వేల నగదు ప్రోత్సాహం అందించాలి. కానీ ఆ రోజు ప్రశంసా పత్రాలు మాత్రమే అందచేశారు. నాలుగు ట్యాబ్‌లను స్టేజీ పైకి కిందకి తిప్పుతూ హడావిడి చేశారు. తిరిగి వాటిని అధికారులే స్వాఽధీనం చేసుకున్నారు. అవార్డులు ప్రదానం చేసే రోజునే ట్యాట్‌, నగదు ప్రోత్సాహకాలు అందించాలి. ఇది జరిగి నాలుగు నెలలు గడుస్తున్నా  ఇంతవరకు వాటిని అందజేయలేదు.  వాటి కోసం పురస్కార గ్రహీతలు  ఆశగా ఎదురు చూస్తున్నారు.


ట్యాబ్‌ల కొనుగోళ్లు ఎక్కడ ?

ఇవ్వాల్సిన ట్యాబ్‌లను ఇప్పటి వరకు కొనుగోలు కూడా చేయలేదు. అవి ఏ ప్రమాణాలతో ఉండాలో ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించి ఒక్కో ట్యాబ్‌కు రూ.6,100ను కేటాయించింది. ఆ ప్రమాణాల ప్రకారం ఆ ధరలో ట్యాబ్‌లు ఎక్కడా దొరకలేదు. ప్రధాన నగరాల్లో సైతం ఎక్కడా లభించ లేదు. దీంతో పంపిణీ ఆలస్యమయ్యిందని అధికారులు చెపుతున్నారు. అవార్డుకు ఎంపికైన విద్యార్థులకు ఒక్కొక్కరికి ప్రభుత్వం రూ.20వేల చొప్పున నగదు ప్రోత్సాహం అందిం చాలి. ఈ నగదును ప్రభుత్వమే నేరుగా వారి ఖాతాలకు జ మ చేయాలి. ఈ విషయంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోం ది. ఇప్పటికైనా అధికారులు స్పందించి  వాటిని పంపణీ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.


 త్వరలో అందిస్తాం..

ప్రతిభా అవార్డులకు ఎంపికైన విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పని లేదు. అందరికీ త్వరలోనే ట్యాబ్‌లు అందచేస్తాం. నగదు మాత్రం ప్రభుత్వమే నేరుగా ఆ విద్యార్థి ఖాతాలో జమచేస్తుంది. విద్యార్ధుల జాబితాను ఇప్పటికే ప్రభుత్వానికి అందచేశాం. ఈ నగదు కూడా త్వరలోనే ప్రభుత్వం అందచేయనున్నది.

- డీఈవో జనార్దనాచార్యులు

Updated Date - 2020-02-23T05:37:45+05:30 IST