ఐదుగురు స్నేహితుల చొర‌వ‌... అత్య‌వ‌స‌ర ఆసుప‌త్రులుగా మూడు లగ్జ‌రీ కార్లు

ABN , First Publish Date - 2021-05-05T16:00:44+05:30 IST

రాజ‌స్థాన్‌లోని కోచింగ్ సిటీ కోటాలో కరోనా తీవ్ర‌రూపం దాల్చ‌డంతో...

ఐదుగురు స్నేహితుల చొర‌వ‌... అత్య‌వ‌స‌ర ఆసుప‌త్రులుగా మూడు లగ్జ‌రీ కార్లు

రాజ‌స్థాన్‌: రాజ‌స్థాన్‌లోని కోచింగ్ సిటీ కోటాలో కరోనా తీవ్ర‌రూపం దాల్చ‌డంతో బాధితులకు ఆసుపత్రులలో పడకలు, ఆక్సిజన్, మందులు, ఇంజెక్షన్లు అంద‌క ప‌డ‌రానిపాట్లు ప‌డుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో న‌గ‌రానికి చెందిన ఐదుగురు యువకులు త‌మ‌ లగ్జరీ కార్లను అత్యవసర ఆసుపత్రులుగా మార్చివేశారు. ఈ కార్లలో రోగుల ప్రాణాలను కాపాడేందుకు పడకలు అందించడమే కాకుండా, ఆక్సిజన్ కూడా అందిస్తున్నారు. వీట‌న్నింటినీ బాధితుల‌కు ఉచితంగా అందించ‌డం విశేషం. 


తాజాగా ఈ లగ్జరీ కార్లలో న‌లుగురు బాధితుల‌కు ఆక్సిజన్ అందించారు. అదే సమయంలో ఇద్ద‌రు బాధితుల‌ ఇళ్లకు ఆక్సిజన్ సిలెండర్లు అందించారు. విజ్ఞానగర్‌లో ఉంటున్న‌ 44 ఏళ్ల చందేష్‌కు క‌రోనా బాధితుల‌ను ఆదుకోవాల‌నే ఆలోచ‌న‌వ‌చ్చింది. దీంతో అత‌ను  త‌న స్నేహితులు ఆశిష్ సింగ్, భారత్, రవి కుమార్, అశు కుమార్‌ల  సాయంతో క‌రోనా బాధితుల‌కు సేవా కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించారు. వీరు త‌మ మూడు లగ్జరీ కార్లను అత్యవసర ఆసుపత్రులుగా మార్చివేశారు. అంబులెన్స్‌లో మాదిరిగా ఈ కార్ల‌లో సాధారణ బెడ్‌లతో ఆక్సిజన్ సిలిండర్ల‌ను అమ‌ర్చారు. వీరు క‌రోనాతో తీవ్రంగా బాధ‌ప‌డుతున్న వారిని గుర్తించి వారికి సేవ‌లు అందిస్తున్నారు. ముఖ్యంగా ఆసుపత్రిలో పడకలు, ఆక్సిజన్ అంద‌క బాధ‌ప‌డుతున్న‌వారికి సాయం అందిస్తున్నారు.ఇంతే కాకుండా ఈ అంబులెన్సుల‌ను క‌రోనా బాధితుల‌ను ఆసుపత్రుల‌కు తీసువెళ్లేందుకు కూడా వినియోగిస్తున్నారు. 

Updated Date - 2021-05-05T16:00:44+05:30 IST