గ్యాస్‌ పొయ్యిపై 5 లక్షలు దహనం

ABN , First Publish Date - 2021-04-07T08:42:57+05:30 IST

సరిగ్గా పది రోజుల క్రితం రాజస్థాన్‌లో ఓ తహసీల్దార్‌.. ఏసీబీ అధికారులు వస్తున్న విషయాన్ని పసిగట్టి, లంచం డబ్బులు రూ. 20 లక్షలను గ్యాస్‌ పొయ్యిపై కాల్చేశారు.

గ్యాస్‌ పొయ్యిపై 5 లక్షలు దహనం

  • ఏసీబీకి చిక్కిన మాజీ వైస్‌ ఎంపీపీ
  • తహసీల్దార్‌ సూచనల మేరకు 
  • సర్పంచ్‌ నుంచి లంచం వసూలు
  • తలుపులు మూసేసి నోట్లకు నిప్పు

కల్వకుర్తి టౌన్‌/వెల్దండ, ఏప్రిల్‌ 6: సరిగ్గా పది రోజుల క్రితం రాజస్థాన్‌లో ఓ తహసీల్దార్‌.. ఏసీబీ అధికారులు వస్తున్న విషయాన్ని పసిగట్టి, లంచం డబ్బులు రూ. 20 లక్షలను గ్యాస్‌ పొయ్యిపై కాల్చేశారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోనూ మండల పరిషత్‌ మాజీ ఉపాధ్యక్షుడు ఇదే వ్యూహాన్ని అమలు చేశాడు. మహబూబ్‌నగర్‌ ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కోరింతకుంట తండాకు చెందిన సర్పంచ్‌ రాములునాయక్‌.. నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామంలో క్రషర్‌ ఏర్పాటు కోసం మైనింగ్‌ ఏడీకి దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో సర్వే నిర్వహించాలంటూ వెల్దండ తహసీల్దార్‌ సైదులుకు జనవరి 26న ఆదేశాలు అందాయి. ఎన్వోసీ ఇవ్వాలంటూ రాములు నాయక్‌ పలుమార్లు వెల్దండ తహసీల్దార్‌ను కలిశారు. సర్వే అయితే పని కావాలంటే కల్వకుర్తిలోని విద్యానగర్‌ కాలనీలో నివాసముంటున్న వెల్దండ మాజీ వైస్‌ ఎంపీపీ, టీఆర్‌ఎస్‌ నేత వెంకటయ్యగౌడ్‌ను కలవాలని తహసీల్దార్‌ చెప్పాడు. 


రూ.6 లక్షలు ఇస్తేనే పని జరుగుతుందని, ఆ మొత్తం తనకు ఇవ్వాలని వెంకటయ్యగౌడ్‌ సూచించాడు. రాములు రూ.5 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. అదే సమయంలో ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్‌ను సంప్రదించారు. పథకం ప్రకారం మంగళవారం వెంకటయ్యగౌడ్‌ చేతిలో రాములునాయక్‌ డబ్బు పెట్టే సమయానికి ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఇది గమనించిన వెంకటయ్య.. అధికారులు ఇంట్లోకి రాకుండా తలుపులు మూసేశారు. తీసుకున్న రూ.5 లక్షలను గ్యాస్‌ పొయ్యిపై కాల్చే ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్న చిన్న తలుపును తోసుకొని అధికారులు ఇంట్లోకి వెళ్లే సమయానికి సుమారు 70ు నగదు కాలి బూడిదైంది. కాలిపోయిన డబ్బును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కల్వకుర్తిలోని వెంకటయ్యగౌడ్‌ ఇంటితో పాటు, వెల్దండ తహసీల్దార్‌ కార్యాలయం, హైదరాబాద్‌ జిల్లెలగూడ పరిధిలోని గాయత్రీనగర్‌లో ఉన్న వెంకటయ్యగౌడ్‌ ఇల్లు, ఎల్‌బీనగర్‌ విశాలాంధ్ర కాలనీలోని తహసీల్దార్‌ సైదులు ఇంట్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు.


తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా 

తహసీల్దార్‌ సైదులు ఏసీబీ వలలో చిక్కారని తెలుసుకున్న బాధితులు పెద్దఎత్తున వెల్దండ తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. తహసీల్దార్‌ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ఒకానొక దశలో కార్యాలయం తలుపులు పగులకొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు నిలువరించారు. కల్వకుర్తిలో పట్టుబడ్డ మాజీ వైస్‌ ఎంపీపీ వెంకటయ్యగౌడ్‌ను ఏసీబీ అధికారులు వెల్దండ తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకొనిరాగా అక్కడే ఉన్న బాధితులు వెంకటయ్యపై దాడిచేశారు.

Updated Date - 2021-04-07T08:42:57+05:30 IST