ఢిల్లీ నుంచి తిరిగొచ్చేటప్పుడు మార్చి 13 నుంచి 19 లోపు ఆ ఐదు రైళ్లలో..

ABN , First Publish Date - 2020-04-01T20:41:58+05:30 IST

దేశంలో కరోనా వ్యాప్తికి ఢిల్లీలోని ‘నిజాముద్దీన్‌’ ప్రధాన కేంద్రంగా మారినట్లు గుర్తించారు. మార్చి 1వ తేదీ నుంచి అక్కడ జరిగిన సమావేశాల్లో...

ఢిల్లీ నుంచి తిరిగొచ్చేటప్పుడు మార్చి 13 నుంచి 19 లోపు ఆ ఐదు రైళ్లలో..

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తికి ఢిల్లీలోని ‘నిజాముద్దీన్‌’ ప్రధాన కేంద్రంగా మారినట్లు గుర్తించారు. మార్చి 1వ తేదీ నుంచి అక్కడ జరిగిన సమావేశాల్లో 19 రాష్ట్రాలకు చెందిన వారు పాల్గొన్నారు. 16 దేశాల నుంచి మత పెద్దలు హాజరయ్యారు. వీరిలో... కరోనా తీవ్రంగా ప్రబలిన దేశాలకు చెందిన వారూ ఉన్నారు. తబ్లీగ్‌-ఎ-జమాత్‌ అనే సంస్థ నిర్వహించిన ఈ సమావేశాలకు బృందాలుగా ప్రయాణించి, బృందాలుగానే బస చేసిన వారిలో అనేక మందికి కరోనా ‘పాజిటివ్‌’గా నిర్ధారణ అయ్యింది. అయితే.. ఈ మత ప్రార్థనలు అయ్యాక తిరుగు ప్రయాణం చేసిన వారిలో ఎక్కువ మంది ఐదు రైళ్లలో ప్రయాణం చేసినట్లు అధికారులు తేల్చారు. మార్చి 13 నుంచి 19లోపు ఐదు రైళ్లలో వీరు ప్రయాణించినట్లు తెలిసింది.


ఢిల్లీ నుంచి గుంటూరు మీదుగా నడిచే దురంతో ఎక్స్‌ప్రెస్, చెన్నై వెళ్లే గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్.. ఢిల్లీ, తమిళనాడు మధ్య నడిచే మరో రైలు తమిళనాడు ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ-రాంచీ మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్, ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో మత ప్రార్థనలకు ఢిల్లీకి వెళ్లి తిరుగు పయనమైన వారిలో ఎక్కువ మంది ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. దాదాపు ప్రతీ ట్రైన్‌లో 1000 నుంచి 1200 మంది ప్రయాణం చేసే అవకాశముంది. వారిలో ఎంతమందిపై కరోనా ప్రభావం చూపిందో తెలుసుకోవడమే తక్షణ కర్తవ్యంగా అధికారులు భావిస్తున్నారు.


రైల్వే అథారిటీని సంప్రదించి ప్రయాణికుల జాబితాను పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో 10 మంది ఇండోనేషియన్లు ప్రయాణించారని, వారంతా కరీంనగర్‌కు మత ప్రార్థనలకు వెళ్లారని అధికారులు ఇప్పటికే తేల్చారు. వారు కరోనా బారిన పడినట్లు గుర్తించారు. అయితే.. ఇప్పటికే వీరిలో కోలుకున్న వారిని డిశ్చార్జ్ చేశారు.

Updated Date - 2020-04-01T20:41:58+05:30 IST