ప్రైవేటులో ఫెన్సింగ్‌ దందా.. 50కోట్ల విలువైన భూమి కబ్జా!

ABN , First Publish Date - 2021-04-21T09:35:13+05:30 IST

ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన ఖరీదైన స్థలం చుట్టూ ఫెన్సింగ్‌ వేస్తారు. అదంతా తమ ఆధీనంలోనే ఉందంటూ ప్రచారం ప్రారంభిస్తారు. హక్కుదారులను లొంగదీసుకునేందుకు అన్ని ఆయుధాలూ ప్రయోగిస్తారు. ఆపై స్థలాన్ని చాప చుట్టేస్తారు. ఫ్యాక్షన్‌ సినిమాల్లో చూసే ఇలాంటి దృశ్యాలు తాజాగా ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో దర్శనమిస్తున్నాయి.

ప్రైవేటులో ఫెన్సింగ్‌ దందా.. 50కోట్ల విలువైన భూమి కబ్జా!

  • ఒంగోలులో వివాదంలో ఆరున్నర ఎకరాలు.. కోర్టులో పోరాటం
  • నయానో, భయానో అందులో సగం సొంతం చేసుకొన్న వైసీపీ నేత
  • మొత్తం భూమినీ చాపచుట్టే యత్నం.. ఫెన్సింగ్‌ రాళ్లు నాటి, కెమెరాల ఏర్పాటు
  • అది ప్రైవేటు భూమి, నేను కొనుక్కున్నా: నేత


(ఆంధ్రజ్యోతి - ఒంగోలు)

ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన ఖరీదైన స్థలం చుట్టూ ఫెన్సింగ్‌ వేస్తారు. అదంతా తమ ఆధీనంలోనే ఉందంటూ ప్రచారం ప్రారంభిస్తారు. హక్కుదారులను లొంగదీసుకునేందుకు అన్ని ఆయుధాలూ ప్రయోగిస్తారు. ఆపై స్థలాన్ని చాప చుట్టేస్తారు. ఫ్యాక్షన్‌ సినిమాల్లో చూసే ఇలాంటి దృశ్యాలు తాజాగా ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో దర్శనమిస్తున్నాయి. యాభై కోట్లు విలువ చేసే ఆరున్నర ఎకరాల స్థలంపై వైసీపీ కీలక నేత కన్నేసి, చురుగ్గా పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఇందులో సగం స్థలం నయానో, భయానో ఆయన సొంతం చేసుకొన్నారు. మిగతా భూమినీ హస్తగతం చేసుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే, వివరాల్లోకి వెళితే..ఒంగోలు లోని మంగమూరు రోడ్డు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ సుమారు ఆరున్నర ఎకరాల ప్రైవేటు భూమి ఉంది. ఈ భూమి నివాస ప్రాంతాల మధ్య ఉండటంతో విలువ కూడా భారీగా పెరిగింది. ఇక్కడ ఎకరం సుమారు ఏడు కోట్లు పలుకుతోంది.


అంటే ఇది రూ.50కోట్ల ఆస్తి అన్నమాట. ఇదే భూమిలో విల్లాలుకానీ, అపార్టుమెంట్లు కానీ నిర్మించి విక్రయిస్తే మరింత లాభం వస్తుంది. అయితే, కుటుంబసభ్యుల మధ్య ఘర్షణలతో దశాబ్దాలుగా ఈ స్థలం ఎవరి అనుభవంలోనూ లేదు. ఈ భూమిపై హక్కుదారులమంటూ పలువురు వ్యక్తులు ముందుకురావడంతో వ్యవహారం కోర్టుల్లో ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక వైసీపీ నేత ఒకరు రంగప్రవేశం చేశారు. అందులో సగం భూమిని ‘హక్కుదారు’ల నుంచి కొన్నారు. కొద్దిరోజుల క్రితం ఆ భూమి సహా మొత్తం ఆరున్నర ఎకరాల్లోనూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ఏర్పాటుచేయించారు. ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల రోజే రెండువందలమందిని ట్రాక్టర్లలో రప్పించి, ఒక్కరోజులోనే పని పూర్తిచేయించారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు సంతమాగులూరుకు చెందిన వైసీపీ నేత అట్ల చిన్నవెంకటరెడ్డి ఈ వ్యవహారంలో చక్రం తిప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తోపాటు, రాష్ట్రం, జిల్లాకు చెందిన పలువురు వైసీపీ ముఖ్య నాయకులతో ఆయనకు సత్సంబంధాలున్నాయని చెబుతారు. వైసీపీ విపక్షంలో ఉండగా స్థానికసంస్థల నుంచి శాసనమండలి స్థానానికి ఆయన పోటీచేశారు. ప్రస్తుతం సంతమాగులూరు మండల పరిషత్‌ అధ్యక్షుడి పదవి రేసులో ఉన్నారు. 



ఇదీ వివాదం.. 

అది ప్రైవేటు భూమి. ఒక కుటుంబానికి అది చెందినదిగా చెబుతున్నారు. రెండు, మూడు తరాలకు చెందిన కుటుంబసభ్యులు కొందరు తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి నుంచి వేర్వేరు సందర్భాల్లో పవర్‌ ఆఫ్‌ అటార్నీ పొందిన కొందరు ప్రముఖులు, దళారులు ఆ భూమిలో కొంతమేరకు తమకూ హక్కు ఉందంటున్నారు. ఇలా వివాదాస్పదంగా మారిన ఈ ప్రైవేటు భూమి హస్తగతానికి రమారమి దశాబ్దం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైసీపీ నేత మొదలుపెట్టిన తాజా ప్రయత్నాలతో రకరకాల వ్యక్తులు ఇప్పుడు తెరపైకి వచ్చారు. హక్కుదారులమంటూ ముందుకొచ్చినవారిలో సగం మంది ఇప్పుడు సదరు నేత చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. గతంలోనే కోర్టుకు ఎక్కిన ఒకరితో సదరు నేత ఒప్పందం చేసుకొని భారీగా డబ్బులు ముట్టచెప్పి కేసు నుంచి తప్పుకునేలా చేశారని ఆరోపణలు ఉన్నాయి.


వివాదం లేదు.. చట్టప్రకారం కొన్నా

  • -అట్ల చిన్నవెంకటరెడ్డి, వైసీపీ నేత

‘‘ప్రైవేటు భూమిని చట్టప్రకారం హక్కుదారుల నుంచి కొనుగోలు చేశాను. అందులో ఎలాంటి అక్రమాలకు, బెదిరింపులకు పాల్పడలేదు. చట్టప్రకారమే ముందుకు వెళ్లాను. కోర్టులో పిటిషన్‌ వేసిన వ్యక్తి కూడా ఆయనకున్న హక్కు మేరకు నాకు విక్రయించి కోర్టు వివాదం నుంచి తప్పుకున్నారు. ఎవరికైనా హక్కు ఉండి, ఆధారాలు ఉంటే నన్ను కలవాలి. వారి నుంచి కూడా చట్టప్రకారం కొనుగోలు చేస్తాను. అంతకుమించి ఈ భూమిపై రాజకీయ ఒత్తిళ్లు గానీ, అధికారాన్ని వినియోగించడంగానీ జరగలేదు. ఇందులో ఇంకెవ్వరికీ సంబంధం లేదు. అనవసరమైన ఆరోపణలు, ప్రచారాలు చేస్తే, తిప్పికొట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’’

Updated Date - 2021-04-21T09:35:13+05:30 IST