T-Shirt: పూర్తిగా ఉచితం.. కానీ ఆ నాణెం తెచ్చినవారికే!

ABN , First Publish Date - 2021-10-22T01:34:05+05:30 IST

ఒకప్పుడు బోల్డన్ని నాణేలు చెల్లుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు రూపాయి, 5 రూపాయల నాణేలు

T-Shirt: పూర్తిగా ఉచితం.. కానీ ఆ నాణెం తెచ్చినవారికే!

తిరుచ్చి: ఒకప్పుడు బోల్డన్ని నాణేలు చెల్లుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు రూపాయి, 5 రూపాయల నాణేలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 10 రూపాయల నాణెం ఉన్నప్పటికీ దానిని తీసుకునేందుకు వ్యాపారులు నిరాకరిస్తున్నారు. దానిని నిషేధించలేదని, తీసుకోకుంటే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది.


ఇక ఇప్పుడు నాణేల గొడవ ఎందుకయ్యా అంటే.. తమిళనాడులోని తిరుచ్చిలో ఓ వ్యక్తి కొత్తగా వస్త్ర దుకాణం ప్రారంభించాడు. ప్రమోషన్‌లో భాగంగా టీ షర్టులు ఉచితంగా ఇస్తానని ప్రకటించాడు. ఈ ప్రకటన చూసి జనం పోటెత్తుతారని ముందే గ్రహించాడు. అసలే కరోనా భయం ఉండడంతో జనం కుప్పలుతెప్పలుగా రాకుండా ఓ షరతు విధించాడు. ఎవరైతే 50 పైసల నాణేన్ని తీసుకొచ్చి ఇస్తారో.. వారు ఉచితంగా టీ షర్టు తీసుకెళ్లొచ్చని ప్రకటించాడు. అయితే, అతడి అంచనా తప్పైంది.


 హకీమ్ మొహమ్మద్ అనే వ్యక్తి ఈ దుకాణాన్ని ప్రారంభించాడు. ప్రారంభోత్సవ ఆఫర్‌లో భాగంగా ఉచిత టీ షర్టులు ప్రకటించాడు. అయితే, కరోనా వేళ జనం పెద్ద ఎత్తున తరలిరాకుండా ఉండేందుకు 50 పైసల నాణెం తెచ్చిన వారికి టీ షర్టు ఉచితమని మెలికపెట్టాడు.  మనప్పరాయ్ బస్టాండ్‌తోపాటు, వాట్సాప్‌లోనూ కొన్ని రోజులుగా ఈ ప్రచారం జరిగింది. దీంతో ఈ రోజు జనం కుప్పలు తెప్పలుగా షాపు వద్దకు తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. 


పోటెత్తిన జనాన్ని నియంత్రించడం ఎవరి వల్లా కాలేదు. వెయ్యి టీషర్టులు ఉన్నాయని, జనం ఎవరూ ఆందోళన చెందొద్దని, ఓ పద్ధతిలో రావాలని హకీమ్ చెప్పినప్పటికీ జనం వినలేదు. 50 పైసల నాణేలతో వచ్చిన జనం ఉచిత టీ షర్టు కోసం ఫస్ట్ ఫ్లోర్ వరకు ఎక్కేశారు. మరోవైపు, ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.


దీంతో ఒంటిగంట వరకు జరగాల్సిన ప్రమోషన్ 11 గంటలకే ఆగిపోయింది. పోలీసులు దుకాణాన్ని మూసివేయించారు. ఒంటి గంట తర్వాత తిరిగి తెరిచిన షాపు వద్దకు జనం మళ్లీ 50 పైసలతో వచ్చినప్పటికీ ప్రమోషన్ ముగిసిందని చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు. 100 మందికి మాత్రమే ఉచిత టీ షర్టులు అందించినట్టు హకీమ్ తెలిపారు. 

Updated Date - 2021-10-22T01:34:05+05:30 IST