గాంధీలో కరోనా చికిత్సకు 500 బెడ్లు

ABN , First Publish Date - 2021-04-09T08:08:53+05:30 IST

కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తుండడంతో ప్రభుత్వ, కార్పొరేట్‌ ఆస్పత్రులకు రోగుల తాకిడి బాగా పెరిగింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు పెంచేందుకు అధికార

గాంధీలో కరోనా చికిత్సకు 500 బెడ్లు

చెస్ట్‌ ఆస్పత్రిలో 124 పడకలు సిద్ధం..

గాంధీలో 167, చెస్ట్‌లో 16 మంది ఇన్‌పేషెంట్లు 


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తుండడంతో ప్రభుత్వ, కార్పొరేట్‌ ఆస్పత్రులకు రోగుల తాకిడి బాగా పెరిగింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు పెంచేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. గాంధీ ఆస్పత్రిలో 500 పడకల వరకు కొవిడ్‌ రోగులకు వైద్య సేవలు అందించడానికి సన్నద్ధమైంది. ఇప్పటికే ఈ ఆస్పత్రిలో 300 బెడ్లను కరోనా రోగులకు కేటాయించారు. మార్చి నెల ఆరంభం వరకు ఇక్కడ కొవిడ్‌ రోగుల కోసం 200 పడకలు మాత్రమే ఏర్పాటు చేశారు. ఆ సమయంలో 50 నుంచి 70 మంది మాత్రమే ఇన్‌పేషెంట్లకు చికిత్స పొందారు. మార్చి రెండు, మూడో వారం నుంచి ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో మార్చి నెలాఖారు నాటికి గాంధీలో మరో వంద పడకలు పెంచారు. అడ్మిట్‌ అయ్యే రోగుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో 500 పడకలకు పెంచాలని అధికారులు తాజాగా నిర్ణయం తీసుకున్నారు.


ఎక్కువగా సీరియస్‌ కేసులు ఉంటేనే ఆస్పత్రికి పంపిస్తున్నారు. ఆరోగ్యం మెరుగ్గా ఉండి, కేవలం ఆక్సిజన్‌ సదుపాయం అవసరమై, కాస్త జ్వరంతో ఉన్న వారిని కింగ్‌కోఠి, టిమ్స్‌ ఆస్పత్రులకు పంపిస్తున్నారు. శ్వాసకోశ సంబంధిత బాధితులను చెస్ట్‌ ఆస్పత్రికి తరలిస్తున్నారు. కరోనా వైరస్‌ నిర్ధారణ అయి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని మాత్రం గాంధీ ఆస్పత్రికి పంపుతున్నారు. అలాంటి రోగులకు ఎక్కువగా ఐసీయూ సేవలు అవసరం అవుతుండడంతో గాంధీలోనే అడ్మిట్‌ చేస్తున్నారు. గురువారం ఉదయం నాటికి గాంధీ ఆస్పత్రిలో 167 మంది చికిత్స పొందుతున్నారు. వారందరికీ ఐసీయూలో వైద్య సేవలు అందిస్తున్నారు. చెస్ట్‌ ఆస్పత్రిలో కొత్తగా 124 పడకలు అందుబాటులోకి వచ్చాయి. వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ సదుపాయాలతో ఐసీయూ పడకలను సిద్ధం చేశారు. దీంతో రోగులకు వైద్య సేవలను ప్రారంభించారు. ప్రస్తుతం చెస్ట్‌ ఆస్పత్రిలో 16 మంది ఇన్‌పేషెంట్లు ఉన్నారు. కింగ్‌కోఠి ఆస్పత్రిలో 167 మందికి చికిత్స అందిస్తున్నారు. ఇక్కడి ఐసీయూలో 38 చికిత్స పొందుతున్నారు. ఈ ఆస్పత్రిలో గురువారం 256 మంది అవుట్‌పేషెంట్‌ విభాగంలో వైద్య సేవలు పొందారు.

Updated Date - 2021-04-09T08:08:53+05:30 IST