పునరావాసానికి 500కోట్లు చాలవు

ABN , First Publish Date - 2020-10-22T07:49:17+05:30 IST

భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టానికి సంబంధించి పునరావాస చర్యల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.500 కోట్లు ఏ మాత్రం చాలవని,

పునరావాసానికి  500కోట్లు చాలవు

సాయాన్ని 5వేల కోట్లకు పెంచాలి

టీపీసీసీ కోర్‌ కమిటీ భేటీలో తీర్మానం

హైదరాబాద్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టానికి సంబంధించి పునరావాస చర్యల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.500 కోట్లు ఏ మాత్రం చాలవని, సాయాన్ని రూ.5 వేల కోట్లకు పెంచాలని టీపీసీసీ కోర్‌ కమిటీ డిమాండ్‌ చేసింది. వరద మృతులకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.5 లక్షల చొప్పున, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.2 లక్షల చొప్పున సాయం అందించాలని కోరింది. వరద నీరు చేరిన ఇళ్లకు రూ.50వేల చొప్పున ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.


గజ్వేల్‌లోని ప్రజ్ఞాపూర్‌లో మంగళవారం సమావేశమైన టీపీసీసీ  కోర్‌ కమిటీ ఈ మేరకు పలు తీర్మానాలను ఆమోదించింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కం ఠాగూర్‌, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోర్‌ కమిటీ సభ్యు లు భట్టివిక్రమార్క, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కుసుమ్‌కుమార్‌, జానారెడ్డి, వీహెచ్‌, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌అలీ, సంపత్‌కుమార్‌, చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క పాల్గొన్నారు. రాష్ట్రంలో సంభవించిన ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాయాలని కోర్‌ కమిటీ నిర్ణయించింది.


నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20వేల చొప్పున సాయంగా ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. సన్న రకం ధాన్యాన్ని రూ.2500, మొక్కజొన్నను రూ. 1850 ధరకు మార్క్‌ఫెడ్‌ ద్వారా సేకరించాలని  కోరింది. ఏఐసీసీ సూచించిన కిసాన్‌ అధికార్‌ దివ్‌స(అక్టోబరు 31) కార్యక్రమానికి కుసుమ్‌కుమార్‌ను, వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమానికి పొన్నం ప్రభాకర్‌ను, మహిళా దళిత ఉత్పిదాన్‌ దివ్‌స(నవంబర్‌ 7) కార్యక్రమానికి సంపత్‌కుమార్‌ను, రాష్ట్ర స్థాయి ట్రాక్టర్‌ ర్యాలీ(నవంబర్‌ 11) కార్యక్రమానికి భట్టి విక్రమార్కను ఇన్‌చార్జిలుగా నియమించింది.  


Updated Date - 2020-10-22T07:49:17+05:30 IST