మొబైల్‌ ఫోన్ల తయారీకి పెద్దపీట

ABN , First Publish Date - 2020-06-03T06:02:56+05:30 IST

భారత్‌ను మొబైల్‌ ఫోన్లు, కీలక ఎలకా్ట్రనిక్‌ ఉపకరణాల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం మూడు ప్రత్యేక పథకాలు ప్రకటించింది...

మొబైల్‌ ఫోన్ల తయారీకి పెద్దపీట

  • రూ.50,000 కోట్ల వరకు ప్రోత్సాహకాలు
  • కేంద్ర మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌


న్యూఢిల్లీ : భారత్‌ను మొబైల్‌ ఫోన్లు, కీలక ఎలకా్ట్రనిక్‌ ఉపకరణాల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం మూడు ప్రత్యేక పథకాలు ప్రకటించింది. ఆసక్తి ఉన్న కంపెనీలు  ఇందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర ఐటీ, టెలికాం శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. ఈ పథకాల కింద దేశంలో తమ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రభుత్వం రూ.50,000 కోట్ల వరకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఈ పథకాల ద్వారా అంతర్జాతీయ మొబైల్‌ ఫోన్ల మార్కెట్లో 80 శాతం వాటా ఉన్న బడా అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించాలని ప్రభుత్వం యోచిస్తోంది.


అర్హతలు: ఏ కంపెనీలు ఈ ప్రోత్సాహకాల పథకాల కింద దరఖాస్తు చేసుకోవచ్చో కూడా ప్రభు త్వం స్పష్టం చేసింది. విదేశీ కంపెనీలైతే ఒక్కో మొబైల్‌ ఫోన్‌ ను రూ.15,000 కంటే ఎక్కువ ధరకు అమ్ముతూ, 2019-20లో కనీసం రూ.10,000 కోట్ల ఆదాయం ఉండాలి. అదే దేశీయ కంపెనీలైతే కనీసం రూ.100 కోట్ల టర్నోవర్‌ ఉండి ఉండాలి. అయితే దేశీ కంపెనీల ఫోన్లకు మాత్రం ఎలాంటి ధరల పరిమితి విధించలేదు. 


ఇవీ ప్రోత్సాహకాలు: కంపెనీల ఉత్పత్తి విలువ ఆధారంగా ఈ ప్రోత్సాహకాలు అందిస్తారు. వచ్చే ఐదేళ్లలో ఏదైనా కంపెనీ రూ.1.5 కోట్ల విలువైన మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలకా్ట్రనిక్‌ ఉపకరణాలు ఉత్పత్తి చేస్తే ఈ కంపెనీకి రూ.7,500 కోట్ల వరకు ప్రత్యేక ప్రోత్సాహం లభిస్తుంది. ఎలకా్ట్రనిక్‌ విడిభాగాలు తయారు చేసే కంపెనీలు రూ.5 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడి పెడితే అందులో 25 శాతం రాయితీగా అందిస్తారు. ఇంకా రూ.70 కోట్లకు విలువకు లోబడి పెట్టుబడి వ్యయంలో 50 శాతానికి సమానమైన 100 ఎకరాలు పరిశ్రమ ఏర్పాటు కోసం సమకూరుస్తారు. 


చైనాలోని విదేశీ కంపెనీలపై కన్ను!

చైనా నుంచి తమ ఉత్పత్తి యూనిట్లను ఇతర దేశాలకు తరలించాలని భావిస్తున్న కంపెనీలను దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలు తీసుకొచ్చిందని భావిస్తున్నారు. యాపిల్‌తో సహా అనేక  మొబైల్‌ ఫోన్‌ కంపెనీలు చైనాకు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నాయి. విస్తృత దేశీయ మార్కెట్‌, చౌకగా ఉత్పత్తి చేయడం, నిపుణులైన కార్మికులు దొరికే దేశాల కోసం ఈ కంపెనీలు చూస్తున్నాయి. దీంతో సహజంగానే చాలా కంపెనీలు మన దేశంవైపు చూస్తున్నాయి. ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పిస్తే మరింత తేలిగ్గా ఈ కంపెనీలను ఆకర్షించ  వచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ముందుగా 5 విదేశీ కంపెనీలను, 5 దేశీయ కంపెనీలను ఎంపిక చేస్తామని మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. దీంతో వచ్చే కొద్ది సంవత్సరాల్లో 15 నుంచి 20 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.


Updated Date - 2020-06-03T06:02:56+05:30 IST