వారానికో కుబేరుడు!

ABN , First Publish Date - 2021-03-03T06:24:20+05:30 IST

కొవిడ్‌ సంక్షోభ సమయంలోనూ భారత కుబేరుల చిట్టా మరింత పెద్దదైంది. గత సంవత్సరంలో మరో 55 మంది భారతీయులు బిలియన్‌ డాలర్‌ క్లబ్‌లో చేరారు. అంటే, 2020లో సగటున వారానికో కొత్త బిలియనీర్‌ పుట్టుకొచ్చాడన్నమాట

వారానికో కుబేరుడు!

కరోనా కాలంలోనూ కాసుల పంట.. హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ వెల్లడి

బిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి కొత్తగా 55 మంది భారతీయులు 

           

ముంబై: కొవిడ్‌ సంక్షోభ సమయంలోనూ భారత కుబేరుల చిట్టా మరింత పెద్దదైంది. గత సంవత్సరంలో మరో 55 మంది భారతీయులు బిలియన్‌ డాలర్‌ క్లబ్‌లో చేరారు. అంటే, 2020లో సగటున వారానికో కొత్త బిలియనీర్‌ పుట్టుకొచ్చాడన్నమాట. మంగళవారం విడుదలైన ’హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ 2021’ ఈ విషయాన్ని వెల్లడించింది. కనీసం 100 కోట్ల డాలర్ల ఆస్తి కలిగిన వారిని బిలియనీర్‌ అంటారు. ప్రస్తుత మారకం రేటు ప్రకారం, మన కరెన్సీలో రూ.7,300 కోట్ల పైమాటే. 


గత ఏడాది చివరి నాటికి భారత బిలియనీర్ల సంఖ్య 209కి పెరిగిందని హురున్‌ 10వ వార్షిక రిపోర్టు తెలిపింది. అందులో 118 మంది స్వశక్తితో కుబేరులుగా ఎదిగినవారు కాగా, మిగతా 91 మందికి వారసత్వంగా సంపద సంక్రమించింది. మొత్తం 209 మందిలో 177 మంది బిలియనీర్లు భారత్‌లోనే నివసిస్తుండగా.. మిగిలిన వారు విదేశాల్లో స్థిరపడ్డట్లు నివేదిక వెల్లడించింది. భారత్‌లోనే నివసిస్తున్న బిలియనీర్ల సంఖ్య గత ఏడాది మరో 40 మేరకు పెరిగింది. అత్యధిక మంది బిలియనీర్లున్న దేశాల జాబితాలో భారత్‌ మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది.


మళ్లీ ముకేశే నెం.1

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ 8,300 కోట్ల డాలర్ల (రూ.6.05 లక్షల కోట్లు) సంపదతో అత్యంత సంపన్న భారతీయుడిగా కొనసాగుతున్నారు. గత ఏడాది ఆయన వ్యక్తిగత ఆస్తి 2,400 కోట్ల డాలర్ల మేర పెరిగింది. దాంతో, ప్రపంచ సంపన్నుల జాబితాలోనూ ముకేశ్‌ మరో మెట్టు పైకెక్కి 8 స్థానాన్ని చేజిక్కించుకున్నారు. ఈ ఏడాది జనవరి 15న నమోదైన నెట్‌వర్త్‌ ఆధారంగా ర్యాంకింగ్‌లను కేటాయించినట్లు హురున్‌ స్పష్టం చేసింది. 

  • అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ సంపద గత ఏడాదిలో దాదాపు రెట్టింపై 3,200 కోట్ల డాలర్ల (రూ.2.34 లక్షల కోట్లు)కు చేరుకుంది. భారత బిలియనీర్లలో రెండో స్థానం లో నిలిచిన అదానీ.. ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ 20 స్థానా లు ఎగబాకి 48వ స్థానానికి చేరుకున్నారు. తన సోదరుడు వినోద్‌ ఆస్తి సైతం గత ఏడాది 128 శాతం వృద్ధి చెంది 980 కోట్ల డాలర్లకు పెరిగింది. 
  • హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వ్యవస్థాపకుడు శివ్‌ నాడార్‌.. 2,700 కోట్ల డాలర్ల (రూ.1.97 లక్షల కోట్లు) ఆస్తితో భారత సంపన్నుల ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో నిలిచారు. 
  • గత ఏడాది మహీంద్రా గ్రూప్‌ అధిపతి ఆనంద్‌ మహీంద్రా, కుటుంబ ఆస్తి 100 శాతం వృద్ధి చెంది 240 కోట్ల డాలర్ల (రూ.17,520 కోట్లు)కు చేరుకోగా..పతంజలి ఆయుర్వేద్‌ సారథి ఆచార్య బాలకృష్ణ సంపద 32 శాతం తగ్గి 360 కోట్ల డాలర్ల(రూ.26,280 కోట్లు)కు పడిపోయింది. 
  • బయోకాన్‌ చీఫ్‌ కిరణ్‌ మజుందార్‌ షా.. భారత్‌లోని అత్యంత సంపన్న మహిళగా నిలిచింది. గత ఏడాది ఆమె ఆస్తి 41 శాతం వృద్ధి చెంది 480 కోట్ల డాలర్ల (రూ.35,040 కోట్లు)కు చేరుకుంది. గోద్రేజ్‌కు చెందిన స్మితా వీ కృష్ణా 470 కోట్ల డాలర్లు, లుపిన్‌కు చెందిన మంజు గుప్తా 330 కోట్ల డాలర్ల ఆస్తి కలిగి ఉన్నట్లు హురున్‌ తెలిపింది. 


10మందితెలుగువారు

హురున్‌ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 10 మంది తెలుగువారికి చోటు దక్కింది. ఇందులో ఏడుగురు ఫార్మా రంగానికి చెందిన వారే. మిగతా ముగ్గురు ఇన్‌ఫ్రా, నిర్మాణ రంగాలకు చెందినవారు. ఈ పది మంది   మొత్తం ఆస్తి 2,260 కోట్ల డాలర్లు (రూ.1,65,900 కోట్లు)గా నమోదైంది. 


పేరు       కంపెనీ        సంపద (రూ.కోట్లు)   ర్యాంకింగ్‌              భారత్‌             ప్రపంచ

మురళీ దివీ, కుటుంబం దివీస్‌ ల్యాబ్స్‌ 54,100 20 385

పీవీ రామ్‌ప్రసాద్‌ రెడ్డి, కుటుంబం అరబిందో ఫార్మా 22,600 56 1,096

బీ పార్థసారథి రెడ్డి, కుటుంబం హెటిరో డ్రగ్స్‌ 16,000 83 1,609

కే సతీశ్‌ రెడ్డి, కుటుంబం డాక్టర్‌ రెడ్డీస్‌          12,800 108 2,050

జీవీ ప్రసాద్‌, జీ అనురాధ డాక్టర్‌ రెడ్డీస్‌          10,700 133 2,238

పీ పిచ్చి రెడ్డి ఎంఈఐఎల్‌          10,600 134 2,383

జూపల్లి రామేశ్వర్‌ రావు, కుటుంబం మై హోమ్‌ గ్రూప్‌    10,500 138 2,383

పీవీ కృష్ణారెడ్డి ఎంఈఐఎల్‌ 10,200 140 2,383

ఎం సత్యనారాయణ రెడ్డి, కుటుంబం ఎంఎ్‌సఎన్‌ ల్యాబ్స్‌ 9,800 143 2,530

వీసీ నన్నపనేని నాట్కో ఫార్మా 8,600 164 2,686


ప్రపంచవ్యాప్తంగా 3,228 మంది బిలియనీర్లు 

గత ఏడాది వారానికి 8 మంది చొప్పున పెరుగుదల 

గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వారానికి 8 మంది కొత్త బిలియనీర్లు పుట్టుకొచ్చారని హురున్‌ వెల్లడించింది. 2020లో ప్రపంచ బిలియనీర్ల సంఖ్య మరో 412 పెరిగి 3,228కి చేరుకుందని తెలిపింది. గత ఏడాది ప్రపంచ బిలియనీర్ల మొత్తం సంపద 3.5 లక్షల కోట్ల డాలర్లు (జర్మనీ జీడీపీతో సమానం) పెరిగి 14.7 లక్షల కోట్ల డాలర్ల(చైనా జీడీపీతో సమానం)కు చేరుకుంది.


 ప్రపంచంలో సంపద అంతా ధనికుల వద్దే కేంద్రీకృతమవుతున్నదనడానికి ఇదే సంకేతమని రిపోర్టు పేర్కొంది. బిలియనీర్లు అధికంగా ఉన్న దేశాల్లో చైనా అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది చివరి నాటికి చైనా బిలియనీర్ల సంఖ్య 1,058కి చేరుకుంది. 696 మంది బిలియనీర్లతో అమెరికా రెండో స్థానంలో ఉంది. 


ఏ నగరం నుంచి ఎంత మంది..? 

ముంబె 60

ఢిల్లీ 40

బెంగళూరు 22

హైదరాబాద్‌ 10


ఏ రంగం నుంచి ఎంత మంది..? 

హెల్త్‌కేర్‌ 37

కన్స్యూమర్‌ గూడ్స్‌ 27

రసాయనాలు 19

సాఫ్ట్‌వేర్‌ సేవలు 14

ఆటోమొబైల్‌ 13


ప్రపంచ టాప్‌-10 కుబేరుల జాబితా 

ర్యాంకింగ్‌ పేరు కంపెనీ ఆస్తి (రూ.లక్షల కోట్లు)

1          ఎలాన్‌ మస్క్‌ టెస్లా 14.41

2         జెఫ్‌ బెజోస్‌ అమెజాన్‌ 13.82

3        బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ ఎల్‌వీఎంహెచ్‌  8.34

4        బిల్‌గేట్స్‌ మైక్రోసాఫ్ట్‌ 8.04

5        మార్క్‌ జుకెర్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌ 7.38

6        వారెన్‌ బఫెట్‌ బెర్క్‌షైర్‌ హాత్‌వే  6.65

7        జాంగ్‌ షాన్షాన్‌ వైఎ్‌సటీ 6.21

8        ముకేశ్‌ అంబానీ రిలయన్స్‌ 6.05

9        స్టీవ్‌ బామర్‌ మైక్రోసాఫ్ట్‌ 5.85

9        బెరా్ట్రండ్‌ ప్యూచ్‌ హీర్మేస్‌ 5.85

Updated Date - 2021-03-03T06:24:20+05:30 IST