జమ్మూ-కశ్మీరుకు అదనపు బలగాలు

ABN , First Publish Date - 2021-11-10T18:23:41+05:30 IST

జమ్మూ-కశ్మీరులో సాధారణ పౌరులపై ఉగ్రవాద దాడులు పెరుగుతుండటంతో

జమ్మూ-కశ్మీరుకు అదనపు బలగాలు

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరులో సాధారణ పౌరులపై ఉగ్రవాద దాడులు పెరుగుతుండటంతో కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్) అదనపు దళాలను పంపిస్తోంది. సీఆర్‌పీఎఫ్ బలగాలు 3,000; బీఎస్ఎఫ్ బలగాలు 2,500 పని చేయబోతున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 138 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు, 39 మంది ఉగ్రవాదులను, ఉగ్రవాదుల కోసం క్షేత్ర స్థాయిలో పని చేసే సుమారు 700 మందిని అరెస్టు చేసినట్లు కశ్మీరు ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. 


విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని నిలువరించే చర్యల్లో భాగంగా 138 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఉగ్రవాదుల కోసం పని చేసే సుమారు 700 మందిని, 39 మంది ఉగ్రవాదులను అరెస్టు చేశామన్నారు. 


జమ్మూ ఏడీజీపీ ముఖేశ్ సింగ మాట్లాడుతూ, జమ్మూ డివిజన్‌లో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు, 16 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. 


వ్యూహం మార్చిన ఉగ్రవాదులు

ఉగ్రవాదులు సులువుగా దాడి చేయడానికి సామాన్యులను లక్ష్యంగా చేసుకుంటున్నారని సీఆర్‌పీఎఫ్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఉగ్రవాదుల వ్యూహం మారడంతో, అందుకు అనుగుణంగా వ్యూహాలను రచించి, అమలు చేస్తున్నట్లు తెలిపారు. కశ్మీరు లోయలో భద్రతా దళాల నిఘాను పెంచినట్లు చెప్పారు. ముఖ్యంగా శ్రీనగర్‌లో సాధారణ పౌరులపై దాడులు పెరుగుతుండటంతో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. బీఎస్ఎఫ్ ఇప్పటికే అదనంగా 25 కంపెనీల దళాలను కశ్మీరులో మోహరించిందన్నారు. సీఆర్‌పీఎఫ్ కూడా 25 కంపెనీలను మోహరించిందని, అదనంగా మరో 5 కంపెనీలను వచ్చే వారం పంపించబోతోందని చెప్పారు. 


అందరికీ భద్రత కష్టమేనా?

ప్రజలందరికీ కట్టుదిట్టమైన భద్రతను కల్పించడం చాలా కష్టమనే భావం వ్యక్తమవుతోంది. శ్రీనగర్‌లో జన సాంద్రత ఎక్కువ కావడం వల్ల ప్రతి ఒక్కరికీ భద్రత కల్పించడం చాలా భారీ కార్యక్రమమవుతుందని చెప్తున్నారు. ఉగ్రవాదులు గత నెలలో ఇద్దరు టీచర్లను, ఓ వీథి వ్యాపారిని, ఓ కెమిస్ట్‌ను హత్య చేశారు. సోమవారం ఓ సేల్స్‌మ్యాన్, ఆదివారం మరో సాధారణ పౌరుడు ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. 


స్థానికేతరులకు ఉగ్రవాదుల హెచ్చరిక

ఇదిలావుండగా, జమ్మూ-కశ్మీరులో తనిఖీలను పెంచారు. రోజుకు దాదాపు 8,000 వాహనాలను భద్రతా దళాలు తనిఖీ చేస్తున్నాయి. కశ్మీరు లోయలో సాధారణ పౌరుల హత్య తమ పనేనని లష్కరే తొయిబా, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థలు ప్రకటించాయి. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో స్థానికేతరులు వెంటనే వెళ్ళిపోవాలని హెచ్చరించింది. కశ్మీరు లోయ నుంచి వెళ్ళిపోకపోతే స్థానికేతరులు తమకు తగిన శాస్తి జరగడం కోసం సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. 


Updated Date - 2021-11-10T18:23:41+05:30 IST