Abn logo
Sep 25 2021 @ 03:27AM

భారత వాయుసేనకు..56 కొత్త సీ-295 విమానాలు

ఎయిర్‌బస్‌, టాటాతో రక్షణ శాఖ ఒప్పందం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: ఏకకాలంలో రెండున్నర యుద్ధాలకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించిన భారత్‌.. వాయుసేనను మరింత బలోపేతం చేసే దిశలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న బ్రిటిష్‌ తయారీ అవ్రో-748 రవాణా విమానాలను తొలగించి.. వాటి స్థానంలో 56 సీ-295 మిలటరీ విమానాల కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఎయిర్‌బస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌(టీఏఎ్‌సఎల్‌)తో రక్షణ శాఖ రూ. 20 వేల కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఎయిర్‌బస్‌ సంస్థ నాలుగేళ్లలో స్పెయిన్‌లో 16 సీ-295 విమానాలను తయారు చేసి, భారత్‌కు అందజేస్తుంది. పారిశ్రామిక భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా ఎయిర్‌బస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌తోపాటు.. తయారీ సాంకేతికతను అందిపుచ్చుకోనున్న టీఏఎ్‌సఎల్‌ సంస్థ మిగతా 40 విమానాలను భారత్‌లో తయారు చేయనుంది. వీటిలో ఎలకా్ట్రనిక్‌ వార్‌ఫేర్‌ స్యూట్‌లను భారత్‌లోనే తయారు చేస్తారు. ఈ విషయాలను రక్షణ శాఖ ప్రతినిధి భరత్‌ భూషణ్‌ బాబు శుక్రవారం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. రక్షణ శాఖ నిర్ణయం భారత్‌లోని ఏవియేషన్‌, ఏవియానిక్స్‌ ప్రాజెక్టులకు ఎంతో మేలు చేస్తుందని టాటా ట్రస్టుల చైర్మన్‌ రతన్‌ టాటా అన్నారు.. భారత్‌లో విమానాల తయారీతో రానున్న పదేళ్లలో ఈ రంగంలో ప్రత్యక్షంగా 15 వేల మందికి, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.