షాకింగ్ : Hyderabadలో ఒక్క ఏడాదిలోనే రూ. 57.92 కోట్లు కొట్టేశారు..!

ABN , First Publish Date - 2021-12-17T17:05:37+05:30 IST

Hyderabadలో ఒక్క ఏడాదిలోనే రూ. 57.92 కోట్లు కొట్టేశారు..!

షాకింగ్ : Hyderabadలో ఒక్క ఏడాదిలోనే రూ. 57.92 కోట్లు కొట్టేశారు..!

  • రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు
  • సైబరాబాద్‌లో 3,854 కేసులు నమోదు

హైదరాబాద్‌ సిటీ : రోజు రోజుకు సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజల అవసరాన్ని, అత్యాశను ఆసరాగా చేసుకొని వివిధ రకాల స్కీములతో అమాయకులను బురిడీ కొట్టిస్తూ రూ. లక్షల్లో కొల్లగొడుతున్నారు. ఒక్క సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే ఈ ఏడాది రూ. 57.92 కోట్లు కొల్లగొట్టారంటే సైబర్‌ నేరగాళ్లు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. 11 నెలల్లో 3,854 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. అదనంగా మరో వెయ్యికి పైగా చిన్న చితకా ఫిర్యాదులు అందాయి. నమోదైన కేసుల్లో బృందాలుగా రంగంలోకి దిగిన సైబర్‌ క్రైం పోలీసులు 587 కేసులు ఛేదించి, 164 మంది సైబర్‌ నేరగాళ్లను కటకటాల్లోకి నెట్టారు. ఈ కేసుల్లో సైబర్‌ క్రైం హెల్ప్‌లైన్‌ నంబర్‌ టీమ్‌ సహకారంతో రూ. 1.43 కోట్లు రికవరీ చేయగలిగారు.


ఐదు నెలల్లో రూ.1.43కోట్ల రికవరీ

సైబరాబాద్‌ పరిధిలోని ఓ బాధితుడు సైబర్‌ నేరగాళ్లకు చిక్కి ఇన్వెస్టిమెంట్‌ ఫ్రాడ్‌లో రూ. 20లక్షలు పోగొట్టుకున్నాడు. తాను మోసపోయిన విషయం తెలుసుకొని వెంటనే హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి గోడు వెల్లబోసుకున్నాడు. రంగంలోకి దిగిన హెల్ప్‌లైన్‌ టీమ్‌ అన్ని బ్యాంకుల నోడల్‌ అధికారులకు మెసేజ్‌ ఫార్వర్డ్‌ చేసింది. దాంతో బాధితుడి డబ్బు ఓ బ్యాంకులో డిపాజిట్‌ అయినట్లు గుర్తించారు. ఆ బ్యాంకు నోడల్‌ అఽధికారి తక్షణమే స్పందించి సైబర్‌ నేరగాళ్ల ఖాతాలో ఉన్న రూ. 20లక్షలు ఫ్రీజ్‌ చేశారు. ఇలా సిటిజన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం సహకారంతో సైబరాబాద్‌ పోలీసులు ఈ ఐదు నెలల్లో రూ. 1.43 కోట్లు రికవరీ చేసినట్లు సమాచారం.


అండగా నిలుస్తున్న సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్‌.. 

సైబర్‌ నేరగాళ్ల బారినపడి డబ్బులు పోగొట్టుకుంటున్న బాధితులకు, పోగొట్టుకున్న డబ్బులను తిరిగి ఇప్పించేలా దేశంలో ఎక్కడి నుంచైనా బాధితులు ఫిర్యాదులు చేయడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం సిటిజన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్‌)ను ఏర్పాటు చేసింది. సైబర్‌ నేరగాళ్ల బారినపడిన బాధితులకు సహాయం చేయడానికి ప్రభుత్వం  మినిస్ట్రీ ఆఫ్‌ హోమ్‌ అఫైర్స్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉచిత 155260 హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ఏర్పాటు చేసింది. ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్ర పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హెల్ప్‌లైన్‌ను  తెలంగాణ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సైబర్‌  నేరగాళ్ల బారినపడి, డబ్బులు పోగొట్టుకున్న బాధితులు ఎవరైనా తక్షణమే ఈ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి తమ డబ్బులను తిరిగి తప్పించుకోవచ్చు.


హెల్ప్‌లైన్‌ కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్న సిబ్బంది వద్ద అన్ని బ్యాంకుల, యూపీఐ వాలెట్స్‌కు సంబంఽధించిన నోడల్‌ ఆఫీసర్‌లతో కమ్యునికేషన్‌ ఉంటుంది. బాధితులు హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫోన్‌ చేయగానే అక్కడున్న సిబ్బంది కాల్‌ను స్వీకరించి జరిగిన మోసం గురించి తెలుసుకుంటారు. బాధితుడు ఏ బ్యాంకు నుంచి అయితే డబ్బులు పోగొట్టుకున్నాడో, ఆ బ్యాంకులో సైబర్‌ ఫిర్యాదులపై పనిచేస్తున్న నోడల్‌ ఆఫీసర్‌  బాధితుడి బ్యాంకు ఖాతాను పరిశీలిస్తారు. వెంటనే సంబంధిత బ్యాంకు అధికారికి సమాచారం ఫార్వర్డు చేస్తారు. బాధితుడి డబ్బులు జమచేయబడిన వ్యక్తి బ్యాంకు ఖాతాను ఆ బ్యాంకు అధికారులు ఫ్రీజ్‌ చేస్తారు. ఇలా అన్ని బ్యాంకుల నోడల్‌ అధికారులు సకాలంలో స్పందించి బాధితుడి డబ్బు చివరగా ఎక్కడి వరకు చేరిందో అక్కడి బ్యాంకు అధికారుల వరకు సమాచారం వెళ్తుంది. ఇలా అంతా కలిసి సైబర్‌ నేరగాళ్లు కొట్టేసిన డబ్బును రక్షిస్తారు. ఒకవేళ అప్పటికే ఆ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేయబడితే ఆ లింక్‌ద్వారా సైబర్‌ నేరగాళ్ల ఆచూకీ తెలియడంతో పోలీసులకు చిక్కుతారు.

Updated Date - 2021-12-17T17:05:37+05:30 IST