రాత్రి 10 గంటలు.. బాత్రూంకు వెళ్లిన ఐదేళ్ల పాపకు కనిపించిన చిరుత.. బకెట్ శబ్దం విని అమ్మమ్మ వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2021-08-10T03:17:58+05:30 IST

అక్కడో బిల్డింగ్ నిర్మాణం జరుగుతోంది. అక్కడ పనిచేసే ఒక మహిళ.. తన మనుమరాలు ప్రియాంకతో కలిసి భోజనం చేసింది.

రాత్రి 10 గంటలు.. బాత్రూంకు వెళ్లిన ఐదేళ్ల పాపకు కనిపించిన చిరుత.. బకెట్ శబ్దం విని అమ్మమ్మ వెళ్లి చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: అక్కడో బిల్డింగ్ నిర్మాణం జరుగుతోంది. అక్కడ పనిచేసే ఒక మహిళ.. తన మనుమరాలు ప్రియాంకతో కలిసి భోజనం చేసింది. భోజనం తర్వాత ఐదేళ్ల ప్రియాంక బాత్రూంకు వెళ్లాలని చెప్పింది. దీంతో జాగ్రత్తగా వెళ్లాలని నాయనమ్మ భగవతీ దేవి చెప్పింది. సరేనని అలా ఆ భవనం నుంచి బయటకు అడుగు పెట్టిన ప్రియాంక మళ్లీ తిరిగి రాలేదు. పాప బయటకు వచ్చిన మూడే మూడు నిమిషాల్లో మాయమైంది.


అప్పటికే ఆ భవనం పక్కన పొదల్లో పొంచి ఉన్న ఒక చిరుత.. ప్రియాంకపై దాడి చేసింది. పాప దగ్గర ఉన్న నీళ్ల చెంబు శబ్దం రావడంతో భగవతీ దేవి బయటకు వచ్చింది. మనుమనరాలిని ఎంత పిలిచినా జవాబు రాకపోవడంతో భయపడింది. చుట్టూ ఉన్న మిగతా పనివాళ్లను కూడా పిలిచింది. ఎంతసేపటికీ ప్రియాంక జాడ తెలియలేదు. దీంతో వెంటనే భవన నిర్మాణ యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం అందించింది. ఈ దుర్ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో వెలుగు చూసింది.


పోలీసులతోపాటు సమాచారం అందుకున్న వన్యప్రాణి విభాగం అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాత్రంతా గాలించినా ప్రియాంక జాడ తెలీలేదు. దీంతో అర్ధరాత్రి 2 గంటలకు తమ గాలింపు చర్యలను నిలిపేయాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. ఆ మరుసటి రోజు ఉదయమే మళ్లీ గాలింపు చర్యలు ప్రారంభించారు. మూడు గంటలు వెతికిన తర్వాత వారికి వెన్నులో వణుకుపుట్టించే దృశ్యం కనిపించింది. వారు ఉన్న ప్రాంతానికి కొద్ది దూరంలో ప్రియాంక తల మాత్రం దొరికింది. అక్కడి నుంచి ఆనవాలు పట్టి ప్రియాంక మిగతా శరీరం కోసం చేసిన గాలింపు వృధా అయింది.


ప్రియాంక చిన్నతనంలోనే తల్లి ఆమెను వదిలేసి ఎక్కడికో పారిపోయింది. తండ్రి వేరే పెళ్లి చేసుకోవడంతో తాత-నాయనమ్మలు ఆ పాపను తమ వద్దే ఉంచుకున్నారు. జూలై 15న కూతుర్ని చూడటం కోసం ప్రియాంక తండ్రి కూడా వచ్చాడట. ‘‘వచ్చే నెల కూడా నిన్ను చూడటానికి వస్తా’’ అని కూతురికి అతను మాటిచ్చి వెళ్లాడని భగవతీ దేవి చెప్పింది. ఇప్పుడు అతను వచ్చినా ప్రియాంక లేదంటూ కన్నీరుమున్నీరైంది. ఈ ఘటనతో స్థానికంగా పనులు చేసే వాళ్లంతా చిరుతను పట్టుకోవాలని అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో చిరుతను పట్టుకోవడం కోసం అధికారులు పెద్ద పెద్ద పంజరాలను ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-08-10T03:17:58+05:30 IST