8 సీట్ల లోపు కార్లకు.. 6 ఎయిర్‌ బ్యాగులు

ABN , First Publish Date - 2022-01-15T08:13:30+05:30 IST

ఎనిమిది సీట్ల వరకు సామర్థ్యమున్న కార్లన్నింటికీ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి కానున్నాయి. అది 800 సీసీ అయినా.. అంతకు మించిన సామర్థ్యం ఉన్న కార్లయినా.. ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేసే దిశలో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత ఏడాది నుంచే కేంద్రం దీనిపై అప్పుడప్పుడూ ప్రకటనలు చేస్తున్నా..

8 సీట్ల లోపు కార్లకు.. 6 ఎయిర్‌ బ్యాగులు

  • తప్పనిసరి చేస్తూ త్వరలో అమల్లోకి రానున్న కొత్త నిబంధన
  • ప్రయాణికుల భద్రత నేపథ్యంలో నిర్ణయం.. కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడి
  • 800 సీసీ కార్లకూ వర్తించనున్న నిబంధన
  • చిన్న, బేసిక్‌ మోడల్‌ వాహనాలకే ఇబ్బందులు
  • హై-ఎండ్‌ కార్లకు ఇప్పటికే ఈ సదుపాయాలు
  • పెరగనున్న కార్ల ధరలు.. చాసీస్‌లో మార్పులు!
  • సీట్‌బెల్ట్‌ ఉంటేనే పనిచేయనున్న ఎయిర్‌బ్యాగ్‌
  • అంటే.. వెనక కూర్చునేవారికీ.. సీట్‌బెల్ట్‌ మస్ట్‌


కార్లో ఎన్ని ఎయిర్‌బ్యాగులున్నా.. కొన్ని సెన్సార్లు పనిచేయాలంటే అందులో ప్రయాణించేవారు నిబంధనలను పాటించాల్సిందే. ప్రమాదాల సమయంలో ఎయిర్‌బ్యాగు తెరుచుకోవాలంటే.. ప్రయాణికుడు కచ్చితంగా సీట్‌బెల్టు పెట్టుకోవాలి. ట్రాఫిక్‌/పోలీసు నిబంధలు ముందు సీట్లలో కూర్చొనేవారికే సీట్‌బెల్టు తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నాయి. దాంతో.. వెనక సీట్లలో కూర్చొనేవారు చాలా మంది ఆ నిబంధనను పట్టించుకోవడం లేదు. ఆరు ఎయిర్‌బ్యాగుల నిబంధన ఫలితాలు అందాలంటే.. వెనక సీట్లలో కూర్చునేవారు కూడా సీట్‌బెల్టును అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది.


న్యూఢిల్లీ, జనవరి 14: ఎనిమిది సీట్ల వరకు సామర్థ్యమున్న కార్లన్నింటికీ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి కానున్నాయి. అది 800 సీసీ అయినా.. అంతకు మించిన సామర్థ్యం ఉన్న కార్లయినా.. ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేసే దిశలో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత ఏడాది నుంచే కేంద్రం దీనిపై అప్పుడప్పుడూ ప్రకటనలు చేస్తున్నా.. తాజాగా జనరల్‌ సాట్యుటరీ రూల్స్‌(జీఎ్‌సఆర్‌) ఈ ప్రతిపాదనను బలపరుస్తూ నివేదిక అందజేసింది. ఆ రిపోర్టుపై సంతకం చేసినట్లు కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. శుక్రవారం ఆయన ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ‘‘ప్రమాదాల సమయంలో ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ ఆరు ఎయిర్‌బ్యాగుల నిర్ణయం తీసుకున్నాం. జీఎ్‌సఆర్‌ నివేదికను ఆమోదిస్తూ సంతకం చేశాను’’ అని ఆయన వివరించారు. 2019 జూలై నుంచి డ్రైవర్‌ సీటుకు ఎయిర్‌ బ్యాగును తప్పనిసరి చేశామని, ఈ ఏడాది జనవరి నుంచి ముందు సీట్లో కూర్చొనే ప్రయాణికుడికి కూడా ఈ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చినట్లు ఆయన గుర్తుచేశారు. ఎం1 కేటగిరీ వాహనాలన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేశారు. అంటే.. ఎనిమిది సీట్ల వరకు సామర్థ్యం ఉన్న కార్లన్నీ ఈ కెటగిరీ కిందకు వస్తాయి. అది 800 సీసీ వాహనమైనా.. ఈ నిబంధనను అమలు చేస్తే ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండాల్సిందే.


ఆ మేరకు కార్ల ఉత్పత్తిదారులు చర్యలు తీసుకోవాలని నితిన్‌ గడ్కరీ కోరారు. డ్రైవర్‌ సీటుకు స్టీరింగ్‌ పైభాగంలో, ముందు సీట్లో కూర్చొనే ప్యాసింజర్‌కు డ్యాష్‌బోర్డుకు అనుసంధానంగా ఎయిర్‌బ్యాగులు ఉంటాయనే విషయం తెలిసిందే. కేంద్రం తీసుకురానున్న తాజా నిబంధనలో.. వెనక వరస/వరసల్లో కూర్చొనే వారికి సైడ్‌ కార్నర్‌ నుంచి, ముందు నుంచి కూడా నాలుగు ఎయిర్‌బ్యాగులను ఏర్పాటు చేయాలి. ప్యాసింజర్ల పక్క వైపు సైడ్‌ కర్టైన్‌ లేదా ట్యూబ్‌ తరహా ఎయిర్‌బ్యాగులను అమర్చాల్సి ఉంటుంది.


మరణాలను నిరోధించడానికే..

జాతీయ నేరాల నమోదు విభాగం(ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో.. కార్లలో ఎయిర్‌బ్యాగులు తెరుచుకుని, డ్రైవర్లు, ముందువరసలోని ప్యాసింజర్లు క్షేమంగా బయటపడ్డా.. వెనక సీట్లలో కూర్చొనేవారు చనిపోయిన ఉదంతాలున్నాయి. ఇలా జరిగిన మరణాల సంఖ్య 17,538. దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం రోడ్డు ప్రమాదాల్లో నమోదైన మరణాల వాటాలో ఇది 17ు. ఇప్పుడున్న రెండు ఎయిర్‌బ్యాగుల నిబంధనతో.. వాహనాల ముందు/వెనక భాగంలో ప్రమాదం జరిగితేనే సెన్సార్లు యాక్టివేట్‌ అయ్యి ఎయిర్‌బ్యాగులు తెరుచుకుంటాయి. పక్కవైపున ప్రమాదం జరిగితే.. సెన్సార్లు లేకపోవడం వల్ల ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడం లేదు. అందుకే.. సైడ్‌ కర్టైన్‌/ట్యూబ్‌ ఎయిర్‌బ్యాగులను కేంద్రం తప్పనిసరి చేస్తోంది.


పెరగనున్న కార్ల ధరలు

కేంద్రం తాజా నిర్ణయంతో ప్రతి కారుకు ఎయిర్‌బ్యాగ్‌ తప్పనిసరి అవ్వనుంది. అంటే.. 800 సీసీ వాహనాలు మొదలు.. ఎనిమిది సీట్లుండే మోడళ్ల దాకా ఉత్పత్తిదారులు ఆరు ఎయిర్‌బ్యాగులను ఏర్పాటు చేయాల్సిందే. దీంతో చిన్న/మధ్యతరహా కార్ల కేటగిరీలో ధరలు పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పుడున్న రెండు ఎయిర్‌బ్యాగుల నిబంధనకు మరో నాలుగింటిని జోడించాలంటే.. కనీసం రూ. 8 వేల నుంచి రూ. 10 వేల వరకు అదనపు ఖర్చవుతుందని అంచనా. చిన్నకార్లు/బేసిక్‌ మోడళ్ల విషయంలో చాసీస్‌ రీ-ఇంజనీరింగ్‌ చేయాల్సి రావొచ్చు. ఇలా.. ఉత్పత్తిదారుడి వద్దే రూ. 30 వేల నుంచి రూ. 40 వేల దాకా ఖర్చవుతుందని తెలుస్తోంది. ఆ ఖర్చు వినియోగదారుడికి చేరేసరికి రూ. 50 వేల దాకా అవుతుందని ఆటోమొబైల్‌ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పైగా.. ఈ ధరల అంచనా కేవలం డ్రైవర్‌, ముందుసీటు ప్యాసింజర్‌ ఎయిర్‌బ్యాగులకు సంబంధించినవే. సైడ్‌ కర్టైన్‌/ట్యూబ్‌ రకం ఎయిర్‌బ్యాగుల ధరలు.. సెన్సార్‌, మెకానిజం కలిపి ఒక్కోదానికి రూ. 10వేల దాకా ఉంటుందని చెబుతున్నారు. ‘‘మారుతీ ఆల్టోలో రెండు ఎయిర్‌బ్యాగుల నిబంధనకు ముందు.. ఆ తర్వాత ధరల్లో రూ. 20 వేల వరకు తేడా ఉంది. ఆపైన మోడళ్లలో ఈ తేడా రూ. 30 వేల దాకా ఉంటోంది. 800 సీసీ కెపాసిటీ ఉండే చిన్న కార్లకు ఆరు ఎయిర్‌బ్యాగుల నిబంధన ఇబ్బందికరమే. ఉత్పత్తిదారుల నుంచే మార్పులు జరగాల్సి ఉంటుంది’’ అని హైదరాబాద్‌ మలక్‌పేట్‌కు చెందిన ఆటోడీలర్‌ ఎం.వెంకట్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.


ఎప్పటిలోగా అమల్లోకి రావొచ్చు?

సాధారణంగా ఇలాంటి నిబంధనలు జనవరి లేదా జూలై నెలల్లో అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం జీఎ్‌సఆర్‌ నివేదికపై కేంద్ర మంత్రి గడ్కరీ సంతకం పూర్తయింది. ఈ ముసాయిదా కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఆమోదం పొందాలి. అటుపైన లోక్‌సభలో.. ఆ తర్వాత రాజ్యసభలో ఆమోదం పొందాలి. చివరగా రాష్ట్రపతి ఆమోద ముద్ర పడితే.. అందులో పేర్కొన్న నిర్ణీత తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. నిజానికి రెండు ఎయిర్‌బ్యాగుల నిబంధన గత ఏడాది మార్చి నుంచే అమలు కావాల్సి ఉంది. కానీ, ఉత్పత్తిదారులు ఏడాదికి సరిపడా ముడిపదార్థాలను ముందే సమకూర్చుకోవడం.. డిమాండ్‌కు తగ్గట్లుగా ప్రాడక్టులు దొరికే అవకాశాలు తక్కువ కావడం వల్ల.. వారి అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం ఆ నిబంధనను ఈ నెల 1 నుంచి అమల్లోకి తెచ్చింది. అన్నివనరులు అందుబాటులోకి వచ్చాకే.. ఈ నిబంధనను అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - 2022-01-15T08:13:30+05:30 IST