ఈ అప్లికేషన్‌తో 6.40లక్షలు కొట్టేశాడు!

ABN , First Publish Date - 2021-03-13T17:02:24+05:30 IST

యువతి ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ వచ్చింది..

ఈ అప్లికేషన్‌తో 6.40లక్షలు కొట్టేశాడు!

హైదరాబాద్‌ : రిమోట్‌ అప్లికేషన్స్‌తో బురిడీ కొట్టించి రూ. లక్షలు దోచేస్తున్న సైబర్‌ నేరగాడి ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. జామ్‌తారాకు చెందిన నిందితుడు బీర్‌బల్‌ పండిట్‌ను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. రాచకొండ ప్రాంతానికి చెందిన యువతి ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. మరో 24 గంటల్లో మీ మొబైల్‌ నెట్‌వర్క్‌ బ్లాక్‌ అవుతుందని అందులో ఉంది. సరిగ్గా అతను చెప్పిన సమయానికి కొన్ని నిమిషాల ముందు బాధితురాలికి ఫోన్‌ చేశాడు. సాంకేతిక సమస్య వల్ల మీ ఫోన్‌లో నెట్‌వర్క్‌ బ్లాక్‌ అవుతుందని, టీమ్‌వీవర్‌ క్విక్‌ సపోర్ట్‌ అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేయమని చెప్పాడు. దాంతో ఆమె అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసింది. యూసర్‌ ఐడీ చెప్పి యాక్సెప్ట్‌  చేసింది. దాంతో నిందితుడు ఆమె ఫోన్‌ స్వయంగా ఆపరేట్‌ చేసి, ఏదో సెట్టింగ్‌ మార్చినట్టు కలరింగ్‌ ఇచ్చాడు. కొద్దిసేపటి తర్వాత మీ ఫోన్‌లో ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా రూ.10 వేరే ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ చేసి, చెక్‌చేసుకోండి అన్నాడు. దాంతో ఆ యువతి ఇంటర్నెట్‌ బ్యాకింగ్‌ ఉపయోగించి అతను చెప్పినట్లే చేసింది.


ఆ సమయంలో యూసర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ తెలుసుకున్న నిందితుడు. అదే రిమోట్‌ కంట్రోల్‌ యాప్‌తోనే మూడు విడతలుగా రూ. 6.40లక్షలు దోచేశాడు. ఆ తర్వాత అప్లికేషన్‌ క్లోజ్‌ చేశాడు. కొద్దిసేపటి తర్వాత తన మొబైల్‌ ఫోన్‌ చూసుకున్న యువతి డబ్బులు పోయాయన్న విషయం తెలిసి షాక్‌కు గురైంది. తిరిగి ఆ వ్యక్తికి ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ చేసి ఉంది. మోసపోయానని గుర్తించిన యువతి రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా నిందితుడు జార్ఖండ్‌ రాష్ట్రం జామ్‌తారాకు చెందిన వాడిగా గుర్తించారు. జామ్‌తారా వెళ్లిన పోలీసులు సైబర్‌ నేరస్థుడు బీర్‌బల్‌ను అరెస్టు చేశారు.

Read more