కాళరాత్రి!

ABN , First Publish Date - 2021-07-31T05:17:12+05:30 IST

మండలంలోని లంకేవానిదిబ్బ సమీపంలో గురు వారం అర్ధరాత్రి తర్వాత జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు యువ కులు సజీవ దహనం అయ్యారు.

కాళరాత్రి!

ఆరుగురు కూలీల సజీవ దహనం

రొయ్యల చెరువులో పనిచేసేందుకు వచ్చిన ఒడిశా యువకులు

అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉండగా షెడ్డులో వ్యాపించిన మంటలు

మంటలకు మాడిపోయిన మృతదేహాలు

ప్రమాదం నుంచి బయటపడిన నలుగురు

ఘటనా స్థలాన్ని పరిశీలించిన రూరల్‌, విజిలెన్స్‌ ఎస్పీలు

ప్రమాద కారణాలపై భిన్నాభిప్రాయాలు

బ్లీచింగ్‌ ఉన్న గదిలో నిద్రిస్తున్న సమయంలో ఘటన 

 

అంతా పాతికేళ్ల లోపు యువ కులు.. పొట్ట చేతపట్టుకుని వచ్చిన వలస కూలీలు.. అలసిపోయి నిద్రకు ఉపక్రమించిన సమ యంలో మృత్యువు మంటల రూపంలో ఆవహించింది.. తేరుకునేలోగా అవి దహించివేశాయి.. నిమిషాల వ్యవధిలోనే ఆరుగురు సజీవ దహనం అయ్యారు. తీరప్రాంతంలో జరిగిన ఈ ఘటన జిల్లాలో విషాదాన్ని నింపింది. 


రేపల్లె, జూలై 30: మండలంలోని లంకేవానిదిబ్బ సమీపంలో గురు వారం అర్ధరాత్రి తర్వాత జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు యువ కులు సజీవ దహనం అయ్యారు.  ఒడిశా రాష్ట్రం రాయఘడ్‌ జిల్లా పుల్లపుటి, జంపాపూర్‌కు చెందిన రామ్మూర్తి సుబాల్‌(17), పండబ్‌ సుబాల్‌ (22), మనోజ్‌సుబాల్‌(21), కరుణాకరన్‌ సుబాల్‌(21), నవీన్‌ సుబాల్‌ (23), మహిర్‌ సుబాల్‌ (23) మృతువాత పడ్డారు. సేకరించిన వివరాల ప్రకారం.. ఇక్కడి బెయిలీ ఆక్వా ఫారమ్స్‌ ఆధ్వర్యంలో  సుమారు వంద ఎకరాల్లో  నిర్వహిస్తున్న రొయ్యల చెరువుల్లో పనిచేసేందుకు ఓ లేబర్‌ కాంట్రాక్టర్‌ ద్వారా 45 రోజు ల కిందట ఒడిశా రాష్ట్రం నుంచి 25 మంది వలస కూలీలు వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులో వారు నివాసం ఉంటున్నారు. గురువారం పగలంతా రొయ్యల చెరువు వద్ద పనులు చేశారు. అల సిపోయి షెడ్డు వద్దకు చేరుకుని రాత్రి ఎనిమిది గంటల సమయంలో భోజనం చేశారు. షెడ్డులోని ఓ గదిలో 10మంది నిద్రకు ఉపక్రమిం చారు. ఏమైందో ఏమో అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద శబ్ధం కూడా వచ్చిందని తోటివారు చెబు తున్నారు. తేరుకునే లోగానే షెడ్డులో మంటలు వ్యాపించాయి. శబ్దానికి ఉలికిపడి నలుగురు బయటకు రాగా అందులో ఉన్న ఆరుగురు సజీవ దహనం ఆయ్యరు. బయట నిద్రిస్తున్న సహచరులు హుటాహుటిన సమీపంలోని నీటిని తీసుకుని  మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈలోగానే ఆరు ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. సమాచారం అందుకున్న రేపల్లె రూరల్‌ సీఐ శివశంకర్‌ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. రొయ్యల చెరువువద్ద పనిచేస్తున్న కూలీలను, యజమానిని వివరాలను అడిగి తెలుసుకున్నారు.


ఘటనా స్థలాన్ని పరిశీలించిన రూరల్‌ ఎస్పీ

సంఘటనా స్థలాన్ని రూరల్‌ఎస్పీ విశాల్‌ గున్నీ, రీజనల్‌ విజిలెన్స్‌ అధికారి జగదీశ్వరరావు, బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు.  విశాల్‌గున్నీ మాట్లాడుతూ ఘటనకు సంబంధించిన సాంకేతిక ఆధారాలను క్లూస్‌ టీం, ఎఫ్‌ఎస్‌ఎల్‌టీంలు సేకరించి భద్రపరుస్తారన్నారు. ప్రమాదం జరిగిన షెడ్డులో బ్లీచింగ్‌ పౌడర్‌ లభించిందని వాటిని పరీక్షలకు పంపి వచ్చిన ఫలితాలను ఆధారంగా దర్యాప్తు చేపడతామన్నారు. రొయ్యల చెరువు యజమాని, ఇద్దరు మేనేజర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.


కారణాలేమిటో..?

అసలు ఈ దుర్ఘటన ఎలా సంభవించిందనే దానిపై పలు అభిప్రా యాలు వ్యక్తం అవుతున్నాయి. తొలుత విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల జరిగిందని పోలీసులు తెలిపారు. అది కారణం కాదని విద్యుత్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. రొయ్యల చెరువుల్లో పనులు చేసేందుకు వచ్చిన వలస కూలీల కోసం 8 గదులు ఏర్పాటు చేశారు. మూడు గదు ల్లో కూలీలు బసచేస్తుంటారు. మిగిలిన వాటిలో బ్లీచింగ్‌, తెల్లసున్నం ఉంచుతారు. వాటి ఘాటు వాసనకు ఎవరూ ఆ గదిలో నిద్రించరు. అదే గదిలో నీటిని శుద్ధి చేసే కెమికల్స్‌ కూడా ఉన్నాయని స్థానికులు అం టున్నారు. నిద్రకు ఉపక్రమించే ముందు కూలీలు మస్కిటో కాయిల్స్‌ను పెట్టారని పక్కనే ఉన్న ప్లాస్టిక్‌ గోతాంకు అంటుకుని ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని, అవి  బ్లీచింగ్‌, కెమికల్స్‌కు అటుంకుని ఉంటాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.


మిత్రులను కోల్పోయాం...

 ఒక్కసారిగా శబ్దం రావటంతో ఉలిక్కిపడి వెంటనే బయటకు పరిగెత్తానని ప్రమాదం నుంచి బయటపడిన ప్రత్యక్షసాక్షి రమేష్‌ సుబాల్‌ బోరున విలపిస్తూ చెప్పాడు. మిత్రులను కాపాడుకుందామని పెద్దగా కేకలు వేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నాడు. వారి కుటుంబ సభ్యులకు ఏం చెప్పాలంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. 

Updated Date - 2021-07-31T05:17:12+05:30 IST