HYD : Biryani తినడానికి పల్సర్‌‌‌పై వెళ్లిన ఫ్రెండ్స్.. దారిలో బైక్‌‌ను ఢీ కొట్టారని.. ఆరుగురు యువకులు వెంబడించి...!

ABN , First Publish Date - 2021-08-11T15:51:37+05:30 IST

సోమవారం రాత్రి అతని స్నేహితుడు సురేశ్‌తో కలిసి బిర్యానీ తినడానికి పల్సర్‌ బైక్‌పై షాహీన్‌నగర్‌కు వచ్చారు. దారిలో ....

HYD : Biryani తినడానికి పల్సర్‌‌‌పై వెళ్లిన ఫ్రెండ్స్.. దారిలో బైక్‌‌ను ఢీ కొట్టారని.. ఆరుగురు యువకులు వెంబడించి...!

హైదరాబాద్ సిటీ/మదీన : పొరపాటున ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోతున్న వాహనదారున్ని గుర్తుతెలియని వ్యక్తులు అటకాయించి బైక్‌ను, జేబులో ఉన్న నగదును లాక్కెళ్ళారు. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి చాంద్రాయణగుట్ట పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌వర్మ, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.వీరయ్య తెలిపిన వివరాల ప్రకారం... తుక్కుగూడ శ్రీరాంకాలనీకి చెందిన జి.సుధాకర్‌ అలియాస్‌ లడ్డు (24) ప్రైవేట్‌ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. సోమవారం రాత్రి అతని స్నేహితుడు సురేశ్‌తో కలిసి బిర్యానీ తినడానికి పల్సర్‌ బైక్‌పై షాహీన్‌నగర్‌కు వచ్చారు. దారిలో ఓ ద్విచక్ర వాహనాన్ని స్వల్పంగా ఢీకొట్టారు. అనంతరం ఆపకుండా ముందుకువెళ్తుండడంతో ఆ ద్విచక్ర వాహనంపై ఉన్న యువకులు వెంబడించారు. దీంతో సుధాకర్‌, సురేశ్‌లు భయపడి ఎర్రకుంట చౌరస్తా నుంచి బండ్లగూడ వెళ్ళే దారికి తమ బైక్‌ను తిప్పారు.


అసలేం జరిగింది..!?

ఇంతలో మరో రెండు బైక్‌లపై నలుగురు యువకులు వచ్చి వీరిని అడ్డగించారు. మొత్తం ఆరుగురు యువకులు సుధాకర్‌, సురేశ్‌లను అడ్డగించి చేతులతో కొట్టి వారి జేబులో ఉన్న రెండు సెల్‌ఫోన్లు, రూ.30వేల నగదుతో పాటు పల్సర్‌బైక్‌ను లాక్కుని పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న సుధాకర్‌, సురేశ్‌లు చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుండగులు పల్సర్‌ బైక్‌ను సంఘటన జరిగిన స్థలానికి కొద్దిదూరంలో వదిలేసి పారిపోయారు. ఆ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరిసరాలలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, దాడిచేసిన యువకులను గుర్తించి పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌వర్మ తెలిపారు. కేసును డీఐ వీరయ్య దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-08-11T15:51:37+05:30 IST