నెలాఖరుకు 60 వేల కేసులు!

ABN , First Publish Date - 2020-07-04T08:55:58+05:30 IST

నెలాఖరుకు 60 వేల కేసులు!

నెలాఖరుకు 60 వేల కేసులు!

  • హైదరాబాద్‌లో 45 వేలకు చేరుకునే చాన్స్‌..
  • వైద్య ఆరోగ్య శాఖ అధికారుల లెక్కలు


హైదరాబాద్‌, జూలై 3(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో వైరస్‌ ఉధృతిని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే జూలై చివరి నాటికి రాష్ట్రంలో 60 వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతాయని భావిస్తోంది. అంతకంటే ఎక్కువైనా ఆశ్చర్యపోవనవసరం లేదని అధికారులు అంటున్నారు.  ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్యను అనుసరించి నెలాఖరు నాటికి టెస్టుల సంఖ్య పెంచుకుంటూ పోతే రోజుకు 2500- 3000 కేసులు నమోదవుతాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సేకరిస్తున్న నమూనాల్లో సగటున 22-25 శాతం పాజిటివ్‌గా నిర్థారణ అవుతున్నాయి. కొద్దిరోజుల్లో టెస్టుల సామర్థ్యాన్ని 6వేలకు పెంచుతామని మంత్రి ఈటల రాజేందర్‌ ఇప్పటికే ప్రకటించారు. ప్రైవేటులోనూ 8వేల పరీక్షలు చేసే సామర్థ్యముంది. రెండింటిలోనూ రోజుకు 14వేల టెస్టులు నిర్వహిస్తే భారీ సంఖ్యలో కేసులు బయటపడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.


నెలలో 8 రెట్లు పెరిగిన కేసులు

మే నెలలో 1,659 కేసులు నమోదవ్వగా ఒక్క జూన్‌లోనే  13,641 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. అంటే 30 రోజుల వ్యవధిలో వైరస్‌ బారినపడినవారు 8 రెట్లు పెరిగారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న సంఖ్యలోనే జూలైలో కూడా పరీక్షలు నిర్వహిస్తే నెలాఖరునాటికి కేసుల సంఖ్య 60వేలు దాటతాయని అధికారులు చెబుతున్నారు. పూర్తిసామర్థ్యం మేరకు (రోజుకు 14వేల) పరీక్షలు చేస్తే పాజిటివ్‌ల సంఖ్య లక్ష దాటినా ఆశ్చర్యపోవక్కర్లేదంటున్నారు. ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే ప్రస్తుతం రోజుకు 1000 కేసులు నమోదవుతున్నాయి. జూలై చివరినాటికి ఇక్కడ కేసుల సంఖ్య 45 వేలకు  చేరుతుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.


జూన్‌ మొదటి వారంలో సీఎం వద్ద జరిగిన సమావేశంలో ఆ నెల చివరి వరకు రాష్ట్రంలో కేసుల సంఖ్య 13 వేలకు చేరుతుందని, గ్రేటర్‌ హైదరాబాద్‌లో 8వేల పైగా కేసులు వస్తాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నివేదికవ్వగా, అంతకంటే ఎక్కువగానే పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. వాస్తవానికి నిర్ధారణ అవుతున్న పాజిటివ్‌లకు, వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేస్తున్న లెక్కకు మధ్య ఇప్పటికే 3 వేలవరకు తేడా ఉందని విశ్వసనీయ సమాచారం. 


మందుల కొనుగోళ్లపై దృష్టి

ప్రస్తుతం నమోదవుతున్న కేసులు, రానున్న కేసుల ఆధారంగా మందుల సేకరణపై వైద్య ఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది. కొనుగోళ్లపై ప్రతివారం ఉన్నతస్థాయి కమిటీ సమావేశమవుతోంది. కొవిడ్‌ నిపుణుల కమిటీ సభ్యుడు కరుణాకర్‌రెడ్డి,  డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ శ్రీనివాసరావు, డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, టీఎ్‌సఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని కమిటీ రెండు రోజుల క్రితం భేటీ అయింది. రాబోయే కేసులపై ఒక అంచనాకు వచ్చిన కమిటీ అందుకనుగుణంగా మందుల సేకరణపై సమీక్షించింది. కేసుల సంఖ్య భారీగా పెరగనున్న నేపథ్యంలో హెచ్‌సీక్యూ, అజిత్రోమైసిన్‌, యాంటీ బయాటిక్స్‌, ఐవీ ఫ్లూయిడ్స్‌, విటమిన్స్‌, మాస్కులు, పీపీఈ కిట్ల ఏ మేరకు అవసరమౌతాయో ఒక అంచనాకు వచ్చింది. కరోనా రోగులకు మొత్తం 54 రకాల మందులు అవసరం పడుతుండటంతో, 50 రోజులకు సరిపడా అందుబాటులో ఉంచుకుంటోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్యలో వారం కిందట రాష్ట్రం పదో స్థానంలో ఉండేది. ప్రస్తుతం ఏడో స్థానానికి చేరుకుంది. ఈ నెలాఖరు నాటికి తెలంగాణ దేశంలో ఐదో స్థానానికి చేరే అవకాశాలున్నాయి. 



Updated Date - 2020-07-04T08:55:58+05:30 IST