ఆరు వేలు దాటేశాయ్‌!

ABN , First Publish Date - 2021-04-17T09:27:09+05:30 IST

రాష్ట్రంలో రోజువారీ కేసులు ఆరు వేల మార్కుని దాటేశాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,962 శాంపిల్స్‌ను పరీక్షించగా 6,096 మందికి పాజిటివ్‌గా

ఆరు వేలు దాటేశాయ్‌!

6 వేలు రాష్ట్రంలో 24 గంటల్లో 6,096 కేసులు

కరోనాతో మరో 20 మంది మృతి

చిత్తూరులో వెయ్యి దాటిన కేసులు.. తూర్పు, గుంటూరుల్లో ఉధృతి


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో రోజువారీ కేసులు ఆరు వేల మార్కుని దాటేశాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,962 శాంపిల్స్‌ను పరీక్షించగా 6,096 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 9,48,231కి పెరిగింది. తాజాగా చిత్తూరు జిల్లాల్లో వెయ్యి కేసులు బయటపడ్డాయి.


ఈ జిల్లాలో ఒక్కరోజే 1,024 మందికి వైరస్‌ సోకగా.. తూర్పుగోదావరిలో 750, గుంటూరులో 735, కర్నూలులో 550, శ్రీకాకుళంలో 534, ప్రకాశంలో 491, విశాఖపట్నంలో 489, నెల్లూరులో 354, అనంతపురంలో 313 కేసులు నమోదయ్యాయి. ఒకరోజులో 2,194 మంది డిశ్చార్జ్‌ కావడంతో.. రికవరీల సంఖ్య 9,05,266కి చేరుకుంది. శుక్రవారం రాష్ట్రంలో 20 కరోనా మరణాలు సంభవించాయి. చిత్తూరులో 5, కృష్ణాలో 3, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున చనిపోయారు. దీంతో మొత్తం మరణాలు 7,373కి చేరాయి.


కరోనాతో సర్వేయర్‌ మృతి.. యువకుడి ఆత్మహత్య 

గుంటూరు జిల్లా రాజుపాలెం మండల సర్వేయర్‌ శేషగిరిరావు కరోనాతో మృతిచెందారు. వారం రోజుల క్రితం జ్వరం రావడంతో ఆయన సెలవు పెట్టి ఇంటికే పరిమితమయ్యారు. కరోనా నిర్ధారణ కావడంతో జీజీహెచ్‌లో చేరారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందారని తహసీల్దారు నగేష్‌ తెలిపారు. కాగా.. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం నడిపల్లికి చెందిన యువకుడు (26) కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఆందోళనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 


రెమ్‌డెసివిర్‌ రూ.2,500

రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ రూ.2500 మించి అమ్మరాదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. దీనిపై ఆరోగ్యశ్రీ సీఈవో, డీహెచ్‌ ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. మార్కెట్‌లో రెమ్‌డెసివిర్‌ ధర అధికంగా ఉంటుందని, రోగులకు అందుబాటులో ఉండటం లేదంటూ ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఆరోగ్యశాఖ ధర నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated Date - 2021-04-17T09:27:09+05:30 IST