Abn logo
Sep 28 2021 @ 04:06AM

చుంచుపల్లిలో 627 కేజీల గంజాయి స్వాధీనం

నల్లగొండ జిల్లాలో 120 కిలోల గంజాయి సీజ్‌

చుంచుపల్లి/నల్లగొండ క్రైం, సెప్టెంబరు 27: భద్రాద్రి, నల్లగొండ జిల్లాల్లో పోలీసుల తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. భద్రాద్రి జిల్లాలోని చుంచుపల్లి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో సోమవారం 627 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొబ్బరి బొండాల లోడుతో వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా కొబ్బరి బొండాల కింది భాగంలో 26 బస్తాల్లో తరలిస్తున్న గంజాయిని గుర్తించారు. ఆ వాహనాన్ని సీజ్‌ చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.1.25 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని మహరాష్ట్రకు చెందిన కూలీలు శ్యాం శివాజీ, ప్రభాకర్‌ లక్ష్మణ్‌, డ్రైవర్‌ అరవింద్‌ దిలీ్‌పలను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు కున్లే పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ గంజాయిని ఒడిసాలోని మల్కన్‌గిరి నుంచి భద్రాచలం, కొత్తగూడెం మీదుగా మహరాష్ట్రలోని పుణేకు తరలిస్తున్నారని చెప్పారు. నల్లగొండ జిల్లా పరిధిలోని జాతీయ రహదారిపై రెండు రోజులుగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 25న 100 కిలోల గంజాయి, 26న ఆర్టీసీ బస్సులో 20 కిలోలు.. మొత్తం 120 కిలోలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఒడిశాకు చెందిన సుమిత్ర సర్కార్‌, సుజిత్‌ బిశ్వాస్‌, అమల్‌ పొద్దార్‌ గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తూ పట్టుబడ్డారని చెప్పారు. 25నఆంధ్ర-ఒడిసా సరిహద్దు నుంచి మహారాష్ట్రలోని లాతూర్‌కు కారులో 100 కిలోల గంజాయిని తరలిస్తుండగా కట్టంగూరు వద్ద పట్టుకున్నారు. సులేమాన్‌, మహబూబ్‌ దంగ్డేల్‌ను అరెస్టు చేశారు.