ఇంటింటి సర్వే

ABN , First Publish Date - 2020-05-19T09:36:18+05:30 IST

ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది.

ఇంటింటి సర్వే

జిల్లాలో 642 ఆర్‌ఆర్‌టీ బృందాలు

ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచార సేకరణ


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో ముందస్తుగానే ఆరోగ్య పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఈ సర్వే చేపడుతున్నారు. కరోనా ప్రభావిత రాష్ట్రాల నుంచి జిల్లాలోని తమ స్వగ్రామాలకు తిరిగి వస్తున్న వలసకూలీల ఆరోగ్య పరిస్థితులను కూడా తెలుసుకునేందుకు ఈ సర్వే ఎంతో దోహదపడనుంది. జిల్లాలో ఆరోగ్య సర్వే నిర్వహించేందుకు 642 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ (ఆర్‌ఆర్‌టీ) బృందాలను నియమించారు.


ఒక్కో బృందంలో ఏఎన్‌ఎంతోపాటు ఆశావర్కర్‌ లేదా అంగన్‌వాడీ టీచర్‌ ఉంటారు. జిల్లాలో 4 మునిసిపాలిటీలు, 18 మండలాల్లో ఇంటింటి సర్వే కొనసాగుతోంది. ఒక్కో ఆర్‌ఆర్‌టీ బృందం ప్రతిరోజూ 50 నుంచి 100 కుటుంబాలకు సంబంఽధించి ఆరోగ్య సమాచారం సేకరిస్తోంది. ఆర్‌ఆర్‌టీ బృందాలు సేకరించిన ఈ సమాచారాన్ని కంప్యూటరీకరణ చేస్తున్నారు. ఒక్కో కుటుంబానికి ఒక్కో గుర్తింపు సంఖ్య కేటాయిస్తున్నారు. 


వలస కూలీలపై ప్రత్యేక దృష్టి : ముంబయి, గుజరాత్‌, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్‌, ఒడిస్సా వంటి కరోనా ప్రభావిత రాష్ట్రాల నుంచి జిల్లాలోని తమ స్వగ్రామాలకు చేరుకుంటున్న వలస కూలీలు, కార్మికులపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది. హోంక్వారంటైన్‌లో ఉన్న వలసకూలీలతోపాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులను ఆర్‌ఆర్‌టీ బృందాలు ప్రతిరోజూ పరిశీలిస్తున్నాయి. హోంక్వారంటైన్‌లో ఉన్న ప్రతివ్యక్తి వద్దకు వెళ్లి ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నాయి. 

Updated Date - 2020-05-19T09:36:18+05:30 IST