Advertisement
Advertisement
Abn logo
Advertisement

67 ఏళ్ల వృద్ధుడితో 19 ఏళ్ల యువతి ప్రేమ పెళ్లి.. కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడంతో వాళ్లేం చేశారంటే..

67 ఏళ్ల ఓ వృద్ధుడు, 19 ఏళ్ల ఓ యువతి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఫిర్యాదు చేయడానికి వచ్చాము.. రక్షణ కావాలి అని పోలీసులతో అన్నారు. ‘మనవరాలిని ఎవరో వేధించి ఉంటారు. కేసు పెట్టడానికి వచ్చి ఉంటాడు’ అని పోలీసులు భావించారు. ‘విషయం ఏంటో పూర్తిగా చెప్పండి.. ఏం జరిగింది’ అని అడిగితే వాళ్లు చెప్పింది విని పోలీసులు నివ్వెరపోయారు. ‘మేం ప్రేమ పెళ్లి చేసుకున్నాం. మా కుటుంబాల నుంచి మాకు రక్షణ కావాలి. మేం మేజర్లం కాబట్టి మా పెళ్లికి మా కుటుంబ సభ్యులు అడ్డు రాకుండా చూడండి’ అని ఆ వృద్ధుడు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. చివరకు వీళ్లిద్దరూ రక్షణ కల్పించాలంటూ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వీరి వ్యవహారంపై ఆరా తీయాలని హైకోర్టు ఆదేశించడంతో ఇది కాస్తా చర్చనీయాంశమయింది. హర్యానా రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 


హర్యానా రాష్ట్రంలోని హతిన్ నగర పరిధిలోని హంచ్‌పురీ గ్రామానికి చెందిన 67 ఏళ్ల వృద్ధుడికి చాలా ఏళ్ల క్రితమే పెళ్లయింది. అతడి భార్య నాలుగేళ్ల క్రితమే చనిపోయింది. అతడికి ఏడుగురు కుమార్తెలు ఉన్నారు. వాళ్లందరికీ పెళ్లిళ్లు కూడా అయిపోయాయి. చక్కగా మనవళ్లు, మనవరాళ్లను ఆడించాల్సిన వయసులో అతడు ఓ వింత నిర్వాకానికి పాల్పడ్డాడు. నూహ్ జిల్లా పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి కుటుంబానికి ఆ గ్రామంలో భూతగాదాలు ఉన్నాయి. ఆ కుటుంబంతో ఇతడికి పరిచయం ఉంది. ఆ భూతగాదాను తాను పరిష్కరిస్తానని చెప్పి ఆ కుటుంబంతో కలిసిపోయాడు. ఈ క్రమంలోనే ఆ 19 ఏళ్ల యువతితో చనువు పెంచుకున్నాడు. ఆ యువతికి కూడా అంతకుముందే పెళ్లయింది. భర్తతో గొడవల కారణంగా మళ్లీ పుట్టింటికే వచ్చింది. ఆ వృద్ధుడు ఏం మాయమాటలు చెప్పాడో.. ఆ యువతి ఏమని భావించిందో ఏమో కానీ ఇద్దరూ కలిసి గుళ్లో పెళ్లి చేసుకున్నారు. 


ఈ విషయం తెలిసి ఇరువురి కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. దీంతో ఆ వృద్ధుడు, ఆ యువతి తమకు రక్షణ కల్పించాలంటూ మొదట పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఆ తర్వాత హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. అయితే వీరి వ్యవహారంపై హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ప్రస్తుతానికి ఇరువురినీ వేరు వేరు చోట్ల ఉంచి రక్షణ కల్పించాలనీ, అదే సమయంలో ఈ 67ఏళ్ల వృద్ధుడి వ్యవహారం గురించి, గతంలో అతడి ప్రవర్తన గురించి కూడా ఆరా తీయాలని పల్వాల్ జిల్లా ఎస్పీ దీపక్ గెహ్లావత్‌ను ఆదేశించింది. ఆ యువతి మేజిస్ట్రేట్‌ ముందు హాజరయి తన స్టేట్‌మెంట్‌ను ఇవ్వాలని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఏ పరిస్థితుల్లో అసలు అతడితో పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చిందో, ఆమె మానసిక స్థితి ఎలా ఉందో, ఒత్తిడి, బెదిరింపులు వంటివి ఏమయినా జరిగాయో కూడా తెలుసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, వీరి గురించి ప్రస్తుతం వారి గ్రామాల్లో విచారణ చేస్తున్న పోలీసులు.. కోర్టు ఇచ్చిన వ్యవధిలో రిపోర్టును ఇవ్వనున్నారు. ఆగస్టు పదో తారీఖులోపు పోలీసులు ఈ విషయమై రిపోర్టును ఇవ్వాల్సి ఉంటుంది. ఆగస్టు పదో తారీఖున మళ్లీ ఈ కేసును హైకోర్టు విచారించనుంది. మరి కోర్టు వీరిద్దరి ప్రేమ పెళ్లి గురించి ఏమని తీర్పునిస్తుందోనన్న ఉత్కంఠ ఆయా గ్రామాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement