Advertisement
Advertisement
Abn logo
Advertisement

7 నుంచి ఆనందయ్య మందు!

అప్పటివరకు కృష్ణపట్నం రాకండి

పాజిటివ్‌ బాధితులకే తొలి ప్రాధాన్యం

వారి వద్దకే వెళ్లి మందును అందిస్తాం

దూర ప్రాంతాలవారికి ప్రత్యేకంగా యాప్‌

కొరియర్‌, పోస్టల్‌ ద్వారా కూడా పంపిణీ

నెల్లూరు కలెక్టర్‌ చక్రధర్‌బాబు వెల్లడి

విధివిధానాలపై ఆనందయ్యతో భేటీ


నెల్లూరు, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): రానున్న నాలుగైదు రోజుల్లో ఆనందయ్య మందు పంపిణీకి శ్రీకారం చుడతామని నెల్లూరు జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌బాబు ప్రకటించారు. మందు పంపిణీపై విధి విధానాలను ఖరారుచేయడం కోసం మంగళవారం ఆనందయ్యతో కలెక్టర్‌ చక్రధర్‌బాబు, ఎస్పీ భాస్కర్‌భూషణ్‌, ఇతర శాఖల ముఖ్య అధికారులు, సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమావేశం అయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. తాము చెప్పేవరకు ఆనందయ్య మందు కోసం ఎవరూ కృష్ణపట్నం రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘మందు తయారీకి అవసరమైన మూలికలు, ఇతర పదార్థాలు సిద్ధం చేసుకోవడానికి ఆనందయ్యకు ఐదు రోజుల సమయం పడుతుంది. బహుశా సోమవారం నుంచి (7వ తేదీ) మందు పంపిణీ మొదలవుతుంది. అన్ని జిల్లాలు, ముఖ్య పట్టణాల్లోని ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రజలకు మందు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇతర రాష్ట్రాలకు కూడా అందేలా చర్యలు తీసుకొంటున్నాం. దూరప్రాంతాల వారు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే వారికి కొరియర్‌, స్పీడ్‌ పోస్టు ద్వారా మందులు అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ తయారు చేస్తున్నాం. తొలుత పాజిటివ్‌ వచ్చిన వారికే మందు పంపిణీలో తొలి ప్రాధాన్యం ఇస్తాం. పాజిటివ్‌ లేని వారికి ఇచ్చే పీ రకం మందును రెండో ప్రాధాన్యతగా తయారు చేసి పంపిణీ చేస్తాం’’ అని కలెక్టర్‌ వివరించారు. 


కోర్టులో ‘కంటిచుక్కల’ అంశం

కంటి చుక్కల మందు పంపిణీ విషయం న్యాయస్థానం పరిధిలో ఉందని, దీనిపై గురువారం కోర్టులో వాదనలు జరుగుతాయని కలెక్టర్‌ తెలిపారు. కోర్టు ఉత్తర్వుల మేరకు దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మందుల పంపిణీలో పోలీస్‌, రెవెన్యూ యంత్రాంగాల సేవలు వినియోగించుకుంటామన్నారు. కొవిడ్‌ నిబంధనలకు లోబడి ఆనందయ్య మందు పంపిణీ జరుగుతుందని, దీనికి ప్రజలు సహకరించాలని కలెక్టర్‌ కోరారు. కాగా, కృష్ణపట్నంలో మందు తయారీకి అవసరమై ఏర్పాట్లు ఊపందుకున్నాయి. వనమూలికల సేకరణ పెద్ద ఎత్తున జరుగుతోంది. తేనె ఇతర పదార్థాలను పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నారు.


‘పాజిటివ్‌’లకు పంపిణీ ఇలా..

ఆనందయ్య మందు పంపిణీకి నాలుగు పద్ధతులను ఎంచుకున్నారు. పాజిటివ్‌ వచ్చినవారికి నేరుగా అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత అన్ని జిల్లాల కలెక్టర్లకు జిల్లాకు పదివేల మంది పాజిటివ్‌ బాధితులకు సరిపడా మందు పాకెట్లను పంపిణీ చేస్తారు. కలెక్టర్‌ నేతృత్వంలో ఆ జిల్లా పరిధిలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్లు, హోం ఐసొలేషన్‌లో ఉన్న పాజిటివ్‌ బాధితులకు రెవెన్యూ, వలంటీర్ల ద్వారా నేరుగా మందు పాకెట్లు అందేలా ఏర్పాట్లు  చేస్తున్నారు. ఇవి చాలని పక్షంలో రెండో విడతగా కలెక్టర్లకు మందు పాకెట్లను పంపిణీ చేస్తారు. ఇక రెండోవది వెబ్‌ పద్ధతి.. వ్యక్తిగతంగా మందులు కావాలనుకున్నవారి కోసం వెబ్‌ సర్వీసును ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా బుక్‌ చేసుకుంటే కొరియర్‌ ద్వారా మందులు పంపిస్తారు. కొరియర్‌ సర్వీసులు లేని గ్రామీణ ప్రాంతాలకు పోస్టల్‌  ద్వారా పంపిణీ చేయడం మూడో పద్ధతి. ఈ విషయమై సోమవారం పోస్టుమాస్టర్‌ జనరల్‌తో మాట్లాడగా, మందుల పంపిణీకి అంగీకరించినట్లు సమాచారం. నాలుగో పద్ధతి కాల్‌ సెంటరు..మందు బుకింగ్‌ కోసం ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ నంబరుకు ఫోన్‌ చేసి వివరాలు తెలియజేస్తే వారికి పోస్టు ద్వారా మందులు అందే ఏర్పాట్లు చేస్తున్నారు.

మందు ఆనందయ్యే పంచాలి

వైసీపీ ఎమ్మెల్యేలు తలదూరిస్తే ఊరుకోం: సోమిరెడ్డి


అమరావతి, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఆనందయ్య మందును వైసీపీ ఎమ్మెల్యేలు ఆక్రమించుకొని.. వాళ్ల ద్వారా పంచుతామంటే సహించేది లేదని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హెచ్చరించారు. అదే జరిగితే మరోసారి కోర్టును ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆనందయ్య మందును పంపిణీ చేయడానికి హైకోర్టు అనుమతిస్తే, వైసీపీ ఎమ్మెల్యేలు అందులో తలదూర్చి తమ ద్వారానే మందు పంపిణీ జరగాలని అంటున్నారు. ఆనందయ్య తన మందును తానే పంపిణీ చేయడానికి అనుమతి ఇవ్వాలి. మే17 నుంచి ఈ మందు పంపిణీని నిలిపివేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు... ఏపీహైకోర్టు వల్ల మళ్లీ దాని పంపిణీకి అవకాశం వచ్చింది. ఇన్ని రోజులు ఎందుకు ఆపారని బీసీ కమిషన్‌ సభ్యులు డీఐజీకి ఫోన్‌ చేసి అడిగితే స్థానిక వైసీపీ ఎమ్మెల్యేను అడగండని చెప్పి ఫోన్‌ పెట్టేశారు. ఇదేమైనా రాజరికమా? ఎమ్మెల్యే చెప్పిందే చట్టమా?’ అని సోమిరెడ్డి ప్రశ్నించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ మందును ఆనందయ్య తనంతట తానే పంపిణీ చేసేలా అధికారులు చూడాలని, దానికి ఏర్పాట్లు చేయాలని ఉమా డిమాండ్‌ చేశారు.

‘మందు’పై ప్రజలను మోసగిస్తున్న సర్కారు : హేతువాద సంఘం


విజయవాడ(పాయకాపురం), జూన్‌ 1: ఆనందయ్య ‘మందు’లో కరోనాను నిరోధించే గుణాలు లేవంటూనే.. పంపిణీకి అనుమతిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఎలా ప్రకటిస్తుందని హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నార్నె వెంకట సుబ్బయ్య ప్రశ్నించారు. ఇది  ప్రజలను మోసం చేయటమేనన్నారు. ‘‘దేన్నైనా మందుగా గుర్తించాలంటే ప్రయోగశాలలో రుజువుకావాలి. ఆ మందు భారత వైద్య మండలి ఆమోదం పొందాలి. ఆయుష్‌ అధికారులు ఇది మందు కాదని చెప్పారు. దీనివలన కరోనా తగ్గదని కూడా తేల్చారు’’ అని వివరించారు. శాస్త్రీయం కాకపోయినా, ప్రజలు కోరుతున్నారని ఆనందయ్య మందును అనుమతించడమంటే ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవటమే అవుతుందన్నారు.

Advertisement
Advertisement