నెల రోజుల క్రితం సుమలతకు ఓ వ్యక్తి నుంచి ఫోన్.. వారం కిందట మళ్లీ ఫోన్.. చివరికి ఊహించని షాక్!

ABN , First Publish Date - 2021-08-15T14:59:18+05:30 IST

ఆమెకు నెల రోజుల క్రితం ఓ వ్యక్తి ఫోన్‌ చేసి...

నెల రోజుల క్రితం సుమలతకు ఓ వ్యక్తి నుంచి ఫోన్.. వారం కిందట మళ్లీ ఫోన్.. చివరికి ఊహించని షాక్!

  • ఇతరుల క్రెడిట్‌ కార్డుతో..
  • రూ. 7 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ ఓటీపీ చెప్పి మరీ దోపిడీ

హైదరాబాద్ సిటీ/రాజేంద్రనగర్‌ : ఓ అపరిచితుడు ఇతరుల క్రెడిట్‌ కార్డుతో ఓ ట్రావెల్‌ ఏజెన్సీ ద్వారా రూ. 7 లక్షల వరకు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నాడు. కార్డుదారుడు ప్రశ్నించడంతో విషయం బయటపడి, పోలీసులకు ఫిర్యాదు అందింది. బండ్లగూడ సన్‌సిటీ ప్రాంతానికి చెందిన సుమలత సేథి ట్రావెల్‌ ఏజెన్సీ నిర్వహిస్తోంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కార్యకలాపాలు కూడా నిర్వహిస్తోంటోంది. ఆమెకు నెల రోజుల క్రితం ఓ వ్యక్తి ఫోన్‌ చేసి, తన క్రెడిట్‌ కార్డు నుంచి తాను చెప్పిన బ్యాంక్‌ అకౌంట్‌కు డబ్బులు పంపించాలని కోరాడు. ఇందుకోసం కావాల్సిన కమిషన్‌ తీసుకోవాలని కోరాడు.


దీంతో ఆమె.. అపరిచితుడు చెప్పిన క్రెడిట్‌ కార్డు నంబర్‌ ద్వారా.. అతడు సూచించిన బ్యాంకు ఖాతాకు రూ. 50 వేలు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ఓటీపీ నెంబర్‌ కూడా చెప్పడంతో ఆమెకు ఏ మాత్రం అనుమానం రాలేదు. ఇలా నెల రోజులలోవేర్వేరు కార్డుల ద్వారా 14 సార్లు రూ. 50 వేల చొప్పున ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నాడు. మొత్తం రూ. 7 లక్షల వరకు ఇలా ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నాడు. వారం రోజుల క్రితం మరో వ్యక్తి సుమలతకు ఫోన్‌ చేసి, తన క్రెడిట్‌ కార్డు ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారని ప్రశ్నించడంతో ఆమె కంగుతింది. మోసం జరిగి ఉంటుందని అనుమానించి, రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


ఖాతా నుంచి రూ. 65 వేలు మాయం..

రాజేంద్రనగర్‌కు చెందిన డాక్టర్‌ పెండ్యాల ప్రదీ‌ప్‌రెడ్డి తన ఖాతా నుంచి రూ. 65 వేలు గుర్తు తెలియని వ్యక్తులు డ్రా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఖాతాలో నుంచి ఏటీఎం ద్వారా రూ. 40 వేలు డ్రా చేశారని, రూ. 25 వేలు ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏటీఎం కార్డు తన దగ్గరే ఉందని వివరించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-08-15T14:59:18+05:30 IST