Abn logo
Sep 26 2021 @ 00:39AM

కార్వీ కేసులో రూ.700 కోట్ల షేర్లు ఫ్రీజ్‌

  • రూ.2,873 కోట్లు అక్రమంగా మళ్లించినట్లు గుర్తింపు 
  • ఆరు చోట్ల సోదాలు.. కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్న ఈడీ 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): బ్యాంకులకు రుణాల ఎగవేత, నిధుల దారి మళ్లింపు వ్యవహారంలో కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ (కేఎ్‌సబీఎల్‌)కు చెందిన రూ.700 కోట్ల విలువైన షేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శనివారం ఫ్రీజ్‌ చేసింది. కేఎ్‌సబీఎల్‌ సీఎండీ సి. పార్థసారథి, ఆయన కుమారులు రజత్‌ పార్థసారథి, అధిరాజ్‌ పార్థసారథిలు రూ.2,873 కోట్ల మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ తెలిపింది. ప్రైవేటు వ్యక్తుల ద్వారా కంపెనీల్లోని తన వాటాలను అమ్మేందుకు పార్థసారథి ప్రయత్నిస్తున్నారని తమకు తెలిసిందని, ఈ నేపథ్యంలోనే రూ.700 కోట్ల విలువైన షేర్లను స్తంభింప (ఫ్రీజ్‌) చేసినట్లు పేర్కొంది. ఇన్వెస్టర్ల షేర్లను తాకట్టుపెట్టి నిబంధనలకు విరుద్ధం గా బ్యాంకుల నుంచి రుణాలు పొందారని వివరించింది. హెచ్‌డీఎ్‌ఫసీ నుంచి రూ.329 కోట్లు, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ నుంచి రూ.137 కోట్లు, ఐసీసీఐసీ బ్యాంక్‌ నుంచి రూ.562 కోట్ల రుణం తీసుకుని.. వాటిని దారి మళ్లించారని తెలిపింది. షేర్లను తాకట్టుపెట్టి రుణాలు తీసుకునేందుకు కార్వీకి చట్టబద్దంగా ఎలాంటి  హక్కులేదని తెలిపింది. కార్వీ సీఎండీ పార్థసారథి ఆధ్వర్యంలోనే ఈ మోసాలు జరిగాయని, హైదరాబాద్‌, సైబరాబాద్‌తో పాటు మహారాష్ట్ర, పంజాబ్‌, కర్ణాటక పోలీసులు కార్వీపై కేసులు నమోదయ్యాయని గుర్తుచేసింది. ఆ కేసుల ఆధారంగానే దర్యాప్తును ప్రారంభించామని, పార్థసారథిని కోర్టు అనుమతితో మూడు రోజులు చంచల్‌గూడ జైల్‌లో విచారించామని తెలిపింది. 


కార్వీ రియల్టీకి రూ.1,096 కోట్లు

 కేఎ్‌సబీఎల్‌ నుంచి ఆరు వ్యక్తిగత బ్యాంక్‌ ఖాతాల్లోకి భారీగా నిధులు మళ్లించారని ఈడీ తెలిపింది. అలాగే ఆ గ్రూప్‌ కంపెనీ అయిన కార్వీ రియల్టీ ఇండియా లిమిటెడ్‌ (కేఆర్‌ఐఎల్‌) ఖాతాలో రూ.1,096 కోట్లను జమ చేశారని, 2016 ఏప్రిల్‌ నుంచి 2019 అక్టోబరు వరకు ఈ లావాదేవీలు జరిగాయని పేర్కొంది. భారీ మొత్తంలో నిధుల మళ్లింపుపై పార్థసారథి సరైన సమాధానాలు చెప్పలేదని, ఎలాంటి ఆధారాలు తమకు సమర్పించలేదని స్పష్టం చేసింది. తమ విచారణలో రూ.1,096 కోట్లతో స్థిరాస్తులను కొనుగోలు చేసినట్లు తేలిందని వివరించింది. బీమా వ్యాపారం ముసుగులో 8 డొల్ల కంపెనీలను ఏర్పాటు చేశారని తెలిపింది. కంప్యూటర్‌ సర్వర్‌లు, ఈ-మెయిల్స్ల్‌లోని లావాదేవీలకు సంబంధించిన వివరాలను యాంటీ ఫోరెన్సిక్‌ టూల్స్‌తో పార్థసారథి తొలగించినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని పేర్కొంది. కార్వీ గ్రూప్‌ కంపెనీలకు, షెల్‌ కంపెనీలకు మధ్య ఎత్తున నిధుల లావాదేవీలు జరిగాయని వివరించింది. 


‘‘ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల 22న కార్వీ కార్యాలయాలతో పాటు పార్థసారథి ఇళ్లలో సోదాలు చేశాం. ఆస్తి పత్రాలు, వ్యక్తిగత డైరీలు, ఎలకా్ట్రనిక్‌ పరికరాలు, ఈ-మెయిల్‌ డంప్‌లు, తదితర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నాం. వాటిని ప్రస్తుతం విశ్లేషిస్తున్నాం. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ), సెబీ..ఈ ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నాయి. ఈ మోసాలపై మరింత మంది ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయి.’’ అని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది.