ఏడాదిలో రూ.7.1 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2022-02-05T08:39:43+05:30 IST

ఏడాదిలో రూ.7.1 లక్షల కోట్లు

ఏడాదిలో రూ.7.1 లక్షల కోట్లు

మహమ్మారి కాలంలో రికార్డు పొదుపు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి జీవితాలను ఛిద్రం చేసిన 2020-21 ఆర్థిక సంవత్సరంలో గృహస్థులు చారిత్రక రికార్డు స్థాయి లో పొదుపు చేశారు. ఆ సంవత్సరం గృహస్థుల పొదుపు రూ.7.1 లక్షల కోట్లుంది. కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఇళ్లకే పరిమితమైన గృహస్థులు ముందు జాగ్రత్త చర్యగా లేదా నిర్భందంగా పొదుపు పెంచుకున్నారని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు ఒక నివేదికలో తెలిపారు. భవిష్యత్‌ ఆదాయాలపై అనిశ్చితి, నిరుద్యోగిత భయం కారణంగా ప్రజలు భారీ వ్యయాలకు కళ్లెం వేసి సాధారణ వ్యయాలకు పరిమితం కావడమే పొదుపు అలవాటును పెంచిందని వారు విశ్లేషించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో గృహస్థుల పొదుపు రూ.1.35 లక్షల కోట్ల మేరకు పెరగ్గా రుణ భారం రూ.15,374 కోట్ల మేరకు పెరిగిందని ఆ నివేదిక తెలిపింది. 

2020-21 సంవత్సరంలో గృహస్థుల రుణభారం 18,669 కోట్లు పెరిగి రూ.8.05 లక్షల కోట్లకు చేరింది.

గత రెండు సంవత్సరాల కాలంలో గృహస్థుల స్థూల పొదుపు రూ.8.5 లక్షల కోట్లకు, రుణ భారం రూ.34,000 కోట్లకు పెరిగింది.

బంగారం, వెండికి తగ్గిన ఆదరణ: ఎస్‌బీఐ నివేదికలోని విశ్లేషణ ప్రకారం పొదుపుగా బంగారం, వెండి కొనుగోలు గణనీయంగా తగ్గింది. బంగారం వెండిలో పెట్టిన పొదుపు మొత్తం 2015-16 సంవత్సరంలో రూ.46,469 కోట్లుండగా 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.38,444 కోట్లకు తగ్గింది. ప్రజల పొదుపు అలవాటులో ప్రవర్తనాపూర్వకమైన మార్పును ఇది ప్రతిబింబిస్తోంది. వీటికి బదులు ఫైనాన్షియల్‌ ఆస్తులనే ప్రాధాన్య, విశ్వసనీయ పెట్టుబడులుగా ప్రజలు ఎంచుకున్నారు.

ఈక్విటీ పెట్టుబడులపై మోజు: ప్రజ లు సొమ్మును క్యాపిటల్‌ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయడానికే మొగ్గు చూపుతున్నట్టు 2021 ఆర్థిక సర్వే తెలిపింది. స్టాక్‌ మార్కెట్లు నిరంతర ర్యాలీ సాధిస్తూ ఉండడంతో ఈక్విటీ పెట్టుబడుల్లో వ్యక్తిగత ఇన్వెస్టర్ల భాగస్వా మ్యం  పెరిగింది. ఎన్‌ఎ్‌సఈలో వ్యక్తిగత ఇన్వెస్టర్ల వాటా 2019-20 సంవత్సరం ఏప్రిల్‌-అక్టోబరు నెలల మధ్య కాలంలో 38.8 శాతం పెరిగింది. 2020 ఫిబ్రవరి నుంచి కూడా కొత్త ఇన్వెస్టర్ల రిజిస్ర్టేషన్లు గణనీయంగా పెరిగాయి. వరుసగా కొత్త పబ్లిక్‌ ఇష్యూలు రావటం కూడా ఇందుకు కారణంగా ఉంది. 


ఇతర ముఖ్యాంశాలు..

 2021 ఏప్రిల్‌-నవంబరు నెలల మధ్య కాలంలో కొత్తగా 221 లక్షల వ్యక్తిగత డీమ్యా ట్‌ ఖాతాలు జోడయ్యాయి.

 ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సంపద రెండేళ్లలో 164 శాతం పెరిగింది. 2020 డిసెంబరు 30 నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.50,005తో పోల్చితే గత ఏడాది డిసెంబరు 30 నాటికి ధర రూ.47,895కి పడిపోయింది. అంటే ఏడాదిలో బంగారం ధర 4.2 శాతం తగ్గింది.

జీడీపీలో గృహస్థుల రుణ భారం ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో చాలా తక్కువగా ఉంది. రుణ భారం 2019-20తో పోల్చితే 32.5 శాతం నుంచి 37.3 శాతానికి పెరగ్గా 2022 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 34 శాతానికి తగ్గింది.

గృహస్థుల మొత్తం రుణ భారం 2020-21 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.73.6 లక్షల కోట్లుండగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో అది రూ.75 లక్షల కోట్లకు పెరిగింది.




Updated Date - 2022-02-05T08:39:43+05:30 IST