భర్త కోసం మారథాన్‌ పరుగు!

ABN , First Publish Date - 2020-02-03T19:58:30+05:30 IST

అనారోగ్యంతో బాధపడుతున్న భర్త ప్రాణాలు కాపాడుకోవాలనే లక్ష్యం ఆమెది. ఆ లక్ష్యం కోసం తాను ఆరు పదులు దాటిన వృద్ధురాలినన్న విషయాన్ని మరిచిపోయి...

భర్త కోసం మారథాన్‌ పరుగు!

అనారోగ్యంతో బాధపడుతున్న భర్త ప్రాణాలు కాపాడుకోవాలనే లక్ష్యం ఆమెది. ఆ లక్ష్యం కోసం తాను ఆరు పదులు దాటిన వృద్ధురాలినన్న విషయాన్ని మరిచిపోయిందామె. తన ఐదోతనాన్ని నిలుపుకోవడం కోసం వయసును లెక్కచేయకుండా ‘మారథాన్‌’లో పాల్గొన్నది. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ విజేతగా నిలిచింది. ఒక్కసారి కాదు... వరుసగా మూడేళ్ల పాటు ‘బారామతి మారథాన్‌’లో విజేతగా నిలిచి ఎందరికో స్ఫూర్తినిచ్చింది 72ఏళ్ల లతా కరే. మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఈ వృద్ధురాలి కథనంతో స్ఫూర్తి పొందిన ఇద్దరు యువకులు ఆమె కథకు దృశ్యరూపమిచ్చారు. ఆ విశేషాలే ఇవి...

 

కరీంనగర్‌కు చెందిన నవీన్‌కుమార్‌, యాదాద్రి జిల్లా బీబీనగర్‌ మండలం నెమురగొముల గ్రామానికి చెందిన ఎర్రబోతు కృష్ణ మారథాన్‌ విజేత లతా కరే జీవిత కథ ఆధారంగా ఆమె పేరుతోనే మరాఠీలో చిత్రం ‘లతా భగవాన్‌ కరే’ను రూపొందించారు. ఈ చిత్రం ఇటీవల (జనవరి 17న) మహారాష్ట్రలో విడుదలయ్యింది.

 

ఎవరీ మారథాన్‌ విజేత...

మహారాష్ట్రలోని బుల్దాన జిల్లా పింప్లీ గ్రామానికి చెందిన లతా భగవాన్‌ కరే దంపతులకు నలుగురు కూతుళ్లు. ఏళ్ల తరబడి కూలీనాలీ చేసి కూడబెట్టిన డబ్బుతో కూతుళ్ల పెళ్ళిళ్లు జరిపించారు. అందుకోసం చేసిన అప్పులు ఆమె కుటుంబానికి భారంగా మారాయి. అప్పులు తీర్చేందుకు భార్యాభర్తలు కష్టపడుతున్న సమయంలో అనుకోని ఆపద వచ్చి పడింది. భర్త భగవాన్‌ కరే ఒంట్లో నలతగా ఉందని చెప్పడంతో లతా కరే ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లింది. ఏదో ఇన్‌ఫెక్షన్‌ సోకి ఉంటుందని పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్తే గాని అసలు విషయం ఏమిటో తెలుస్తుందని చెప్పడంతో ఆమె ఆందోళనకు గురైంది.

 

రెండు రోజుల్లోనే భర్త నడవలేని స్థితికి చేరుకున్నారు. పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించే ఆర్థిక స్థోమత లేక తనలో తాను మదనపడింది. భర్తను ఎలాగైన కాపాడుకోవాలనే ఆరాటంతో బంధువులు, చుట్టుపక్కల వాళ్ల దగ్గరకెళ్లి సాయం అందించాలని వేడుకుంది. ఎంతో కొంత అందిన సాయంతో భర్తను పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఎంఆర్‌ఐ లాంటి పరీక్షలు చేయాలంటే రూ.5వేల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆమె గుండె ఆగినంత పనైంది. హృదయవిదారకంగా రోదిస్తూ ఆ రోజంతా బారామతి ఆసుపత్రి వరండాలోనే ఉండిపోయిందామె.

 

పేపరు ప్రకటనే ఊపిరి పోసింది...

భర్త ఆకలిగా ఉందని చెప్పడంతో లతా కరే ఆస్పత్రి బయట రోడ్డు చివరన ఉన్న ఓ కొట్టు వద్దకు వెళ్లి తన దగ్గర ఉన్న కొద్దిపాటి చిల్లరతో రెండు సమోసాలు తీసుకువచ్చి తినమని భర్తకు ఇచ్చింది. సమోసాలు చుట్టిన పేపరులో మరాఠీలో పెద్ద పెద్ద అక్షరాలతో కూడిన ప్రకటన లతా కరే కంట పడింది. ‘బారామతి మారథాన్‌లో పాల్గొనండి.. రూ.3వేలు నగదు గెలుచుకోండి’ అనేది ఆ ప్రకటన సారాంశం. రాత్రంతా తెగ ఆలోచించి... మారథాన్‌లో పాల్గొని రూ.3వేలు గెలుచుకోవాలనుకుంది. ఆ డబ్బుతో భర్తకు వైద్యం చేయించాలని గట్టిగా నిర్ణయించుకుంది. మరుసటి రోజు (2013 డిసెంబర్‌ 17న) బారామతి మారథాన్‌ ప్రారంభం కావడానికి సిద్ధమైంది. పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అనేక మంది మహిళలు స్పోర్ట్స్‌ దుస్తులు, షూ ధరించి పరుగుకు సిద్ధమయ్యారు. అప్పుడే లతా కరే 9గజాల నేత చీరతో, పాదాలకు కనీసం చెప్పులు కూడా లేకుండా మారథాన్‌ జరిగే ప్రదేశానికి చేరుకుంది.

 

పోటీల్లో పాల్గొనేందుకు తనకు కూడా అవకాశం ఇవ్వాలని నిర్వాహకులను కోరింది. అందుకు వాళ్లు నిరాకరించారు. అయితే పరిస్థితిని వివరించి వేడుకోవడంతో నిర్వహకులు ఎట్టకేలకు అనుమతి ఇచ్చి చివరి వరుసలో నిలబెట్టారు. ‘తాను ఎక్కడ నిలుచున్నాను అనేది కాదు... ఎలాగైన రూ.3వేలు గెలుచుకుని తన భర్తకు వైద్యం చేయించాల’నే టార్గెట్‌ ఒక్కటే ఆమె కళ్ల ముందు కనిపించింది. పరుగుపందెం మొదలైంది... లక్ష్యం ముందు తన కాళ్లకు గుచ్చుకుంటున్న రాళ్లు రప్పలు కనిపించడం లేదు.. అదే లక్ష్యం.. అదే వేగం.. అదే పరుగు .. బారామతి ప్రజల చప్పట్లు ఆమెను మరింత ఉత్సాహపరిచాయి. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ లతా కరే మారథాన్‌ విజేతగా నిలిచింది. భర్తపై లతా కరేకు ఉన్న ప్రేమకు అక్కడివారంతా జేజేలు పలికారు. అప్పటికప్పుడు మారథాన్‌ నగదు ప్రైజు రూ.3వేల నుంచి రూ.5వేలకు పెంచారు. ఆమె లక్ష్యం ముందు సమస్యలన్నీ చిన్నబోయాయి.

 

గెలుచుకున్న డబ్బుతో భర్తను కాపాడుకుంది. అంతే... మహారాష్ట్రలోని పత్రికలు, ఛానళ్లు ఆమె గొప్పతనాన్ని కీర్తించాయి. నెల తిరగకుండానే ఎంతో మంది సహాయం అందించగా ఆమె బ్యాంకు ఖాతాలో రూ.2లక్షల వరకు జమ అయ్యాయి. అప్పటినుంచి వరుసగా మూడేళ్ల పాటు మారథాన్‌ విజేతగా లతా కరేనే గెలవడం గమనార్హం. ఇదే కథను ‘లతా కరే’ పేరుతో మరాఠీలో సినిమాగా తీశారు ఇద్దరు తెలుగు యువకులు. ఇటీవలే మహారాష్ట్రలో విడుదలైన ఈ సినిమాను త్వరలోనే తెలుగులోకి అనువదించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

పత్రికల్లో చదివి...

 మాది కరీంనగర్‌. సినిమా దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో లతా కరే కథనం చదివాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఆమె జీవిత కథాంశంతో సినిమా తీయాలనుకున్నా. అనేక వ్యయ ప్రయాసలకోర్చి మహారాష్ట్రకు వెళ్లి లతాకరే కుటుంబాన్ని కలిశా. స్ర్కిప్టు సిద్ధం చేసుకుని, ఆమెతోనే బయోగ్రఫీ తీశా.

 

                                                                     - నవీన్‌కుమార్‌

                                                                             దర్శకుడు

 

 తెలుగు ప్రేక్షకుల ముందుకు...

 లతా కరే జీవితం ఎందరికో ఆదర్శం. అలాంటి గొప్పవ్యక్తి యదార్థగాథను సమాజానికి తెలియచెప్పాలనే ఉద్దేశంతో చిత్రనిర్మాణం చేపట్టా. మహారాష్ట్రలో ఈ సినిమా విడుదలై అందరి ప్రశంసలు అందుకుంటోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించి మన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తా.

                                                  - ఎర్రబోతు కృష్ణ, నిర్మాత

 

 

                                                    - బొమ్మగాని గురులింగం

                                         బీబీనగర్‌, యాదాద్రి భువనగిరి జిల్లా

Updated Date - 2020-02-03T19:58:30+05:30 IST