75 రోజులు... 52,613 కేసులు

ABN , First Publish Date - 2021-06-15T07:29:10+05:30 IST

జిల్లాపై విరుచుకుపడిన కరోనా రెండో వేవ్‌ ఇంకా ప్రభావాన్ని చూపుతోంది.

75 రోజులు... 52,613 కేసులు

జిల్లాపై తీవ్ర ప్రభావం చూపిన రెండో వేవ్‌

నేటికీ నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్‌లు 

ఇంకా 8,336 యాక్టివ్‌ కేసులు

ఆసుపత్రుల్లో చికిత్స పొందుత్ను వెయ్యి మంది

పెరుగుతున్న డిశ్చార్జీలతో స్వల్ప ఊరట

ఒంగోలు, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి) : జిల్లాపై విరుచుకుపడిన కరోనా రెండో వేవ్‌ ఇంకా ప్రభావాన్ని చూపుతోంది. దాదాపు 13 మాసాలపాటు కొనసాగిన తొలిదశలో మొత్తం 63,223 పాజిటివ్‌లు నమోదై, 582 మరణాలు సంభవించగా సెకండ్‌ వేవ్‌లో కొద్ది నెలల్లోనే భారీగా కేసులు వెలుగు చూశాయి. కేవలం 75 రోజుల్లోనే ఏకంగా 52,613 మంది వైరస్‌ బారిన పడ్డారు. 292 మంది మరణించారు. తొలిదశలో ఈస్థాయిలో కేసుల నమోదుకు దాదాపు 8 నెలలు పట్టింది. జిల్లాలో తొలికేసు గత ఏడాది మార్చి 18న నమోదు కాగా జూన్‌ వరకు నెమ్మదిగానే వైర్‌సవ్యాప్తి ఉంది. జూన్‌ ఆఖరు వరకూ ఇంచుమించు వంద రోజుల వ్యవధిలో 662 కేసులు మాత్రమే నమోదు కాగా జూలైలో ఒక్కసారిగా పెరిగాయి.  అక్టోబరు వరకూ ఉధృతి కొనసాగింది. నవంబరు నుంచి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేవలం 31 కేసులు మాత్రమే నమోదు కాగా మార్చిలో 419 వచ్చాయి. మొత్తంతొలిదశలో 582 మంది మరణించారు.


రెండో వేవ్‌లో వైరస్‌ వేగం

జిల్లాను రెండో వేవ్‌ వణికించింది. ఏప్రిల్‌ 1నుంచి సెకండ్‌ వేవ్‌ అని పరిగణిస్తుండగా ఈ 75 రోజుల్లో ఏకంగా 52,613 కేసులు నమోదయ్యాయి. 292 మంది మరణించారు. అందులో మేలో కరోనా ఉగ్రరూపం చూపింది. గత ఏడాది వైరస్‌ తీవ్రత అధికంగా కనిపించిన సెప్టెంబరులో గరిష్ఠంగా 25,479 కేసులు నమోదు కాగా, రెండో వేవ్‌ ఒక్క మేలోనే ఏకంగా 35,543 పాజిటివ్‌లు వెలుగు చూశాయి.  


ఇంకా పూర్తిగా తగ్గని తీవ్రత

సెకండ్‌ వేవ్‌ తీవ్రత జిల్లాలో ఇంకా పూర్తిగా తగ్గలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా కేసులు నమోదైన అనేక జిల్లాల్లో ప్రస్తుతం చాలా స్వల్పంగా పాజిటివ్‌ కేసులు వస్తుండగా జిల్లాలో మాత్రం నిత్యం 500లకు పైనే నమోదవుతున్నాయి. ఒక్క సోమవారం మాత్రమే అత్యల్పంగా 187 వెలుగు చూశాయి.  ఇంకా జిల్లాలో 8336 యాక్టివ్‌ కేసులు ఉండగా వారిలో దాదాపు వెయ్యి మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 90శాతం మంది ఆక్సిజన్‌, వెంటిలేటర్‌పై ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే రోజువారీ డిశ్చార్జిలు గణనీయంగా ఉండటం ఒకింత ఊరట కలిగిస్తోంది. ఏమైనా ఇంకా నిత్యం వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్న నేపథ్యం లో జిల్లా యంత్రాంగం, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది.


Updated Date - 2021-06-15T07:29:10+05:30 IST