75 కిలోల బస్తా రూ.800

ABN , First Publish Date - 2021-11-30T05:38:43+05:30 IST

ఎడతెరిపి వర్షాలు కురుస్తుండడంతో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇటీవలే కురిసిన వర్షాలకు చేతికందే దశలో ఉన్న వరి నేలవాలింది.

75 కిలోల బస్తా రూ.800
వర్షంలోనే లారీలోకి ధాన్యం బస్తాలు

  1.  అయిన కాడికి అమ్ముతున్న వరి రైతులు
  2.  ఎడతెరిపిలేని వర్షాలకు తడిసిన ధాన్యం


రుద్రవరం, నవంబరు 29: ఎడతెరిపి వర్షాలు కురుస్తుండడంతో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇటీవలే కురిసిన వర్షాలకు చేతికందే దశలో ఉన్న వరి నేలవాలింది. రెండు రోజులు విరామం ఇవ్వడంతో కోత కోయించిన రైతులు ధాన్యాన్ని కుప్పలు పోశారు. అంతలోనే మళ్లీ వాన మొదలైంది. దీంతో ధాన్యం తడిచిపోయింది. ఆరబోయడానికి కూడా వీలు లేక వ్యాపారులు అడిగిన కాడికే అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని నరసాపురం రైతు నాగేశ్వర్‌రెడ్డి వాపోయారు. ఇలాగైతే పెట్టుబడులు కూడా రాక అప్పులు మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశాడు. పట్ట కప్పి ఉంచితే ధాన్యం మొలకలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే చాలాచోట్ల రైతులు రహదారులపై ధాన్యం కుప్పలు పోసి తడవకుండా పట్టలు కప్పి ఉంచారు. వర్షపు నీరు కుప్పలు అడుగు భాగానికి చేరి ధాన్యం తడిసి పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 75 కిలోల వడ్ల బస్తా మామూలు రోజుల్లో రూ.1500 పలుకుతుండగా.. ఇప్పుడు రూ.800కే అమ్మాల్సి వస్తోందన్నారు. 

రెండో రోజూ వర్షం

  ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌: ఆళ్లగడ్డ, రుద్రవరం, చాగలమర్రి, పగిడ్యాల, దొర్నిపాడు తదితర మండలాల్లో సోమవారం వర్షం కురిసింది. దీంతో వరి, శనగ, మినుము పంటలు దెబ్బతిన్నాయి. చాగలమర్రి మండలంలో 800 ఎకరాల్లో కేపీ ఉల్లి దెబ్బతిందని రైతులు చెబుతున్నారు. పగిడ్యాల మండలంలో కల్లాల్లో ఆరబెట్టుకున్న మొక్కజొన్న తడిచిపోయింది. 





Updated Date - 2021-11-30T05:38:43+05:30 IST