2030 నాటికి రూ.75 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2021-07-22T06:11:06+05:30 IST

భారత రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ పరిమాణం 2030 నాటికి లక్ష కోట్ల డాలర్లకు (సుమారు రూ.75 లక్షల కోట్లు) చేరుకోవచ్చని కేంద్ర హౌసింగ్‌, పట్టణ వ్యవహారాల కార్యదర్శి దుర్గా శంకర్‌ మిశ్రా అంచనా వేశారు.

2030 నాటికి రూ.75  లక్షల కోట్లు

7 కోట్ల మందికి ఉపాధి భారత రియల్టీపై హౌసింగ్‌ సెక్రటరీ మిశ్రా 


న్యూఢిల్లీ: భారత రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ పరిమాణం 2030 నాటికి లక్ష కోట్ల డాలర్లకు (సుమారు రూ.75 లక్షల కోట్లు) చేరుకోవచ్చని కేంద్ర హౌసింగ్‌, పట్టణ వ్యవహారాల  కార్యదర్శి దుర్గా శంకర్‌ మిశ్రా అంచనా వేశారు. 2-3 ఏళ్ల క్రితం ఈ మార్కెట్‌ సైజు 20,000-30,000 కోట్ల డాలర్ల స్థాయిలో ఉందన్నారు. 2019 నాటికి స్థిరాస్తి రంగం 5.5 కోట్ల మంది ఉపాధి కల్పిస్తుండగా.. 2030 నాటికి ఈ సంఖ్య 7 కోట్లకు చేరుకోవచ్చన్నారు. దేశంలో గృహాలు, వాణిజ్య సముదాయాలకు డిమాండ్‌ వేగంగా పెరుగుతుండటం ఇందుకు దోహదపడనుందన్నారు. రెరా చట్టం అమలు సహా గడిచిన ఏడేళ్లలో ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణలు సైతం ఇందుకు తోడ్పడనున్నాయని మిశ్రా పేర్కొన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) రియల్టీ రంగంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగించారు. 


మిశ్రా ప్రస్తావించిన మరిన్ని విషయాలు

ఈ ఏడాది జూన్‌ లో ఆమోదించిన కొత్త అద్దె చట్టాన్ని త్వరగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. రాష్ట్రాలు కొత్త చట్టాన్ని అమలులోకి తేవడం ద్వారా అద్దె ఒప్పంద వివాదాలకు పరిష్కారం లభించేందు కు అవకాశం ఉంటుంది. 

కరోనా తొలి, మలి ఉధృతికి కుదేలైన దేశీయ రియల్టీలో గృహాలకు డిమాండ్‌ క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో డిమాండ్‌ గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంతో పోలిస్తే పెరిగిందని పలు ప్రాపర్టీ కన్సల్టెన్సీల నివేదికలు చెబుతున్నాయి. 

భారత ఆర్థిక వ్యవస్థకు కీలక రంగాల్లో స్థిరాస్తి ఒకటి. ఈ రంగంలో డిమాండ్‌ పెరుగుదల స్టీల్‌, సిమెంట్‌ సహా 270 రకాల పరిశ్రమలకు అదనపు గిరాకీని సృష్టించగలదు.

ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో 46 కోట్ల మంది నివసిస్తున్నారు. 2051 నాటికి ఈ సంఖ్య 88 కోట్లకు పెరగవచ్చని అంచనా. భవిష్యత్‌లో రియల్టీ వృద్ధి అవకాశాలకు ఇదే సంకేతం. 

కేంద్ర ప్రభుత్వం గడిచిన ఏడేళ్లలో చేపట్టిన కీలక సంస్కరణల్లో రెరా ఒకటి. ఈ చట్టంతో స్థిరాస్తి రంగంలో విప్లవాత్మక మార్పులు రావడంతోపాటు వినియోగదారుల్లో ఇండస్ట్రీపై నమ్మకం పెంచింది. 

ఈ చట్టంలో ఇప్పటివరకు 67,000 ప్రాజెక్టులు, 52,000 ప్రాపర్టీ ఏజెంట్లు రిజిస్టర్‌ అయ్యారు. ఈ చట్టం పరిధిలో ఏర్పాటైన రియల్‌ ఎస్టేట్‌ అథారిటీలు ఇప్పటివరకు 70 వేలకు పైగా కేసులను పరిష్కరించాయి. 

Updated Date - 2021-07-22T06:11:06+05:30 IST