రూ. 750 కోట్లపైనే వర్షార్పణం

ABN , First Publish Date - 2020-12-03T06:48:13+05:30 IST

అద్దంకి మండలంలోని రామాయపాలెం రెవెన్యూ పరిధిలో ఉన్న రామాయపాలెం, తిమ్మాయపాలెంలో అధికారుల లెక్కల ప్రకారం 720 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

రూ. 750 కోట్లపైనే వర్షార్పణం
కారంచేడు-పర్చూరు మధ్య పూర్తిగా దెబ్బతిన్న బర్లీపొగాకు తోట

రూ. 750 కోట్లపైనే వర్షార్పణం

రైతుల పెట్టుబడులన్నీ నీళ్లపాలే

తుడిచిపెట్టుకుపోయిన పంటలు

సగం గ్రామాల్లో సాగులో ఉన్న అన్ని పైర్లూ ధ్వంసం

ఎంత ఎక్కువ సాగు చేస్తే అంత నష్టపోయిన రైతులు

ఊర్లకు, ఊర్లే రూ. కోట్లు కోల్పోయిన  వైనం

అంచనాల్లో అధికారులు.. క్షేత్రస్థాయి పరిశీలనలు

మళ్లీ పెట్టుబడుల కోసం అప్పులే దిక్కు

అద్దంకి మండలంలోని రామాయపాలెం రెవెన్యూ పరిధిలో ఉన్న రామాయపాలెం, తిమ్మాయపాలెంలో అధికారుల లెక్కల ప్రకారం 720 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 360 ఎకరాల్లో సాగు చేసిన శనగ తుడిచి పెట్టుకుపోయింది. ఇక ఎత్తిపోతల ఆయకట్టులో సాగు చేసిన వరి 250ఎకరాల్లో, చేతికొచ్చే దశలో ఉన్న పత్తి 60ఎకరాల్లో, పొగాకు 25 ఎకరాలు, మినుము 25ఎకరాల్లో దెబ్బతింది. ఎకరా సాగుకు రూ.20 వేలకుపైగా ఖర్చుపెట్టగా అంతా వర్షార్పణమైంది. రూ.కోటిపైనే పెట్టుబడులను రైతులు నష్టపోయినట్లు అంచనా.

పీసీపల్లి మండలంలోని గుంటుపల్లి, తురకపల్లి, లింగన్నపాలెం, అడవిలోపల్లి, లక్ష్మక్కపల్లి, కోదండరామాపురం, మెట్లవారిపాలెం, శేషిరెడ్డిపల్లి, వెంగళాయపల్లి, వేపగుంపల్లి, పెద్దన్నపల్లి, నేరేడుపల్లి, వేపగుంపల్లిల్లో 4,900 ఎకరాల్లో మినుము దెబ్బతింది. రైతులు ఎకరాకు రూ.20వేల పెట్టుబడి పెట్టారు. పంటంతా నీటిపాలైంది. మినుములు కాయపైనే మొలకెత్తాయి. రూ.7కోట్ల మేర నష్టం వాటిల్లింది.  

కందుకూరు మండలంలోని కొండముడుసుపాలెం, లింగసముద్రం మండలంలోని తూనుగుంటల్లో మిర్చి రైతులకు అపారనష్టం వాటిల్లింది. కొండముడుసుపాలెంలో 350 ఎకరాల్లో,  తూనుగుంటలో 200 ఎకరాల్లో మిరపతోటలు దెబ్బతిన్నాయి. రైతులు ఇప్పటికే ఎకరానికి రూ.70వేల చొప్పున ఖర్చుచేశారు. తోటలు ఆనవాళ్లు లేకుండా దెబ్బతినటంతో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. కౌలురైతులైతే ఎకరానికి రూ.25 వేలు కౌలు చెల్లించారు. ప్రస్తుతం వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. రెండు గ్రామాల్లో కలిపి రూ.4కోట్ల మేర రైతులు పెట్టుబడులను నష్టపోయారు.

ఒంగోలు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి)/అద్దంకి/పీసీపల్లి/కందుకూరు:ఇదీ జిల్లాలో రైతుల పరిస్థితి. నివర్‌ తుఫాన్‌తో  పంటలకు జరిగిన నష్టం ఊహకందని స్థాయిలో కనిపిస్తోంది. పొలంలో ఉన్న ప్రతి పంటా దెబ్బతినడగా.. చాలా ప్రాంతాల్లో ఊర్లకు, ఊర్లలో పంటలు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. రైతులు కోట్లాది రూపాయలు కోల్పోయారు. అనేక చోట్ల చేతికి అందివచ్చే దశలో ప్రధాన పంటలు తుఫాన్‌ బారిన పడటంతో వాటి నుంచి రావాల్సిన ఆదాయం ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని గ్రామాల్లో అయితే ఎంత ఎక్కువ విస్తీర్ణంలో రైతులు పంటలు సాగు చేస్తే అంత ఎక్కువ మొత్తంలో నష్టపోయిన పరిస్థితి కనిపించింది.

 రైతుల కష్టం వర్షార్పణమైంది. లక్షలాది ఎకరాల్లో పంట దెబ్బతింది. వెయ్యి కోట్లకు పైగా పెట్టుబడులు నీళ్లపాలైనట్లైంది. జిల్లాలో గత నెల 25నుంచి 28వ తేదీవరకు నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో భారీవర్షం కురిసిన  విషయం విదితమే. దీంతో జిల్లాలోని 950 గ్రామాల్లో దాదాపు లక్షా 50వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన యం త్రాంగం క్షేత్రస్థాయి సర్వే చేపట్టింది. కాగా వర్షాలు ఆగి తెరిపి వాతా వరణం ఏర్పడటంతో వాస్తవ పంట నష్టాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. ఆయా ప్రాంతాల నుంచి అందుతున్న సమాచారం ప్రకా రం అనేక గ్రామాల్లో ఖరీఫ్‌లో సాగుచేసి ప్రస్తుతం చేతికి అందివస్తున్న దశలో ఉన్న పలురకాల పంటలు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. కొన్నిగ్రామాల్లో అయితే వందల ఎకరాల్లో పంటలకు నష్టం కోట్లల్లోనే కనిపిస్తోంది. పత్తి, మి ర్చి, పొగాకు, మి నుము, వరి, కంది పంటలకు తీవ్రనష్టం వాటిల్లగా సగటున రూ.కోటి నుంచి రూ.5కోట్ల వరకు పంటనష్టం జరిగిన గ్రామాలు 400 వరకు ఉన్నా యి. రూ.50లక్షల నుంచి రూ.కోటి వరకు నష్టం జరిగినవి మరో 300 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద హెక్టార్‌కు రూ.50వేల చొప్పున రైతులు రూ.750కోట్లకుపైగా  పెట్టుబడులు  నష్టపోయారు. 

మునిగిన మినుము రైతు

వీవీపాలెం మండలం పోకూరులో 1,300ఎక రాలు, వీవీపాలెంలో 600 ఎకరాలు, లింగసముద్రం మం డలం పెద్దపవనిలో 500ఎకరాలు, మొగిలిచర్లలో 400 ఎకరా ల్లో మినుము పూర్తిగా దెబ్బతింది. ఎకరాకు రూ.20వేల వంతున చూసినా ప్రతి గ్రామంలోనూ కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిం ది. జరుగుమల్లి మండలం ఎడ్లూరపాడులో 300 ఎకరాల్లో మినుము, 200 ఎకరాల్లో మిర్చి దెబ్బతిని రూ.4కోట్లకు పైగా అక్కడి రైతులు నష్టపోయారు. చీరాల ప్రాంతంలోని గవనివారిపాలెం, అక్కాయపాలెం గ్రామాల్లో పొట్టదశలో ఉన్న వందలాది ఎకరాల్లో వరి పంట వర్షార్పణం కాగా గ్రామంలోని రైతులు రూ.కోటికిపైగానే రైతుల నష్ట పోనున్నారు. చీమకుర్తి మండలం ఊబచెత్తపాలెంలో ముందుగా వేసిన బీపీటీ రకం వరి పంట ప్రస్తుతం కోతకు రాగా భారీ వర్షాలతో మొత్తం దెబ్బతిని రూ.కోటిన్నర మేర రైతులు నష్టపోయారు. ఇలాంటి పరిస్థితే జిల్లావ్యాప్తంగా వందలాది గ్రామాల్లో కనిపి స్తుండగా జరిగిన నష్టాన్ని తట్టుకోలేక రైతులు ఆవేదన చెందుతున్నారు. 

కోలుకోలేని దెబ్బ

ఆయా ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే చాలా గ్రామాల్లో రైతులు తిరిగి కోలుకొనే అవకాశాలు కనిపించడం లేదు. మిర్చి విస్తారంగా సాగుచేసిన పంగులూరు మండలం చందలూరు లో దాదాపు 800ఎకరాల్లో పూర్తిగా దెబ్బతిని ఆ గ్రామ రైతులు సు మారు రూ.5కోట్ల వరకూ నష్టపోయినట్లు సమాచారం. కొరిశపాడు మండలం పమిడిపాడులో సాగుచేసిన మిర్చి, శనగ పంటలకు రూ.2కోట్లు నష్టం వాటిల్లగా, ఎన్‌జీపాడు మండలం కండ్లగుంటలో సాగు చేసిన 400 ఎకరాల మిర్చి భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిని రూ.2కోట్ల మేర రైతులు నష్టపోయారు. కందుకూరు మండలం పలు కూరులో వేసిన 1200 ఎకరాల్లో మినుము పూర్తిగా ధ్వంసమైంది. ఎక రాకు సగటున రూ.15వేల వంతున చూసినా దాదాపు రూ.2కోట్ల మేర అక్కడి రైతులు నష్టపోయారు. కొండముడుసుపాలెంలో అయితే సాగు చేసిన 400ఎకరాల్లో మిర్చి తుడిచిపెట్టుకుపోయింది. సగటున ఇప్పటికే రూ.80వేలు ఖర్చుకాగా రూ.3.20కోట్ల మేర రైతులు నష్టపోయారు. 




Updated Date - 2020-12-03T06:48:13+05:30 IST