రెండు జిల్లాల్లో 759 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-04-21T05:49:32+05:30 IST

మెదక్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 20: జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. మంగళవారం జిల్లావ్యాప్తంగా 1,542 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా..

రెండు జిల్లాల్లో 759 కరోనా కేసులు నమోదు
పరీక్షల కోసం హెల్త్‌ సెంటర్‌కు వచ్చిన ప్రజలు

మెదక్‌ జిల్లాలో 347 మందికి పాజిటివ్‌

సంగారెడ్డి జిల్లాలో 412 మందికి పాజిటివ్‌ 


మెదక్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 20: జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది.  మంగళవారం జిల్లావ్యాప్తంగా 1,542 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 347 మందికి కొవిడ్‌ సోకినట్లు తేలింది. నర్సాపూర్‌ ఏరియా ఆసుపత్రిలో 37, మెదక్‌ 31, తూప్రాన్‌ 27, చేగుంట 26, రామాయంపేట 38, చిన్నశంకరంపేట 27, మెదక్‌ యూపీసీహెచ్‌సీలో 21, వెల్దురి 11, శివ్వంటపేట 15, పాపన్నపేట 20, పెద్దశంకరంపేట 8, రెడ్డిపల్లి 12, రేగోడ్‌ 12, టేక్మాల్‌ 7, నార్సింగి 18, కౌడిపల్లి 7, సర్ధన 9, అల్లాదుర్గంలో 2 చొప్పున కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు బాధితుల సంఖ్య 7,279కు చేరుకుంది. 


కరోనాతో ఒకరి మృతి

పాపన్నపేట, ఏప్రిల్‌ 20: కరోనాతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని జయపురం గ్రామంలో మంగళవారం వెలుగు చూసింది. పోడ్చన్‌పల్లి ఆరోగ్య సిబ్బంది, గ్రామ సర్పంచ్‌ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వ్యక్తి (45) వారం రోజుల క్రితం పోడ్చన్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేసుకోగా నిర్ధారణ అయింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదివారం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు.


వ్యాక్సిన్‌ సురక్షితం : ఎమ్మెల్యే పద్మారెడ్డి

రామాయంపేట, ఏప్రిల్‌ 20: కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు అవసరంలేదని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. మండల పరిధిలోని కోనాపూర్‌లో వ్యాక్సినేషన్‌ శిబిరాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం పైలేరియా  వ్యాధిగ్రస్తులకు దోమ తెరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, మండల వైద్యాధికారి ఎలిజిబెత్‌ పాల్గొన్నారు. 


నేటి నుంచి చిన్నశంకరంపేటలో లాక్‌డౌన్‌ 

చిన్నశంకరంపేట, ఏప్రిల్‌ 20: కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంధ్రంతో పాటు గవ్వలపల్లి, కామారం తదితర గ్రామాల్లో నేటి నుంచి పది రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించారు. చిన్నశంకరంపేటలో వారాంతపు సంత బంద్‌ చేశారు. నిబంధనల మేరకే దుకాణాలను తెరువాలని చాటింపు వేయించారు. 


సంగారెడ్డి జిల్లాలో 412 మందికి పాజిటివ్‌ 

సంగారెడ్డి అర్బన్‌, ఏప్రిల్‌ 20 : సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 412 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం ఆదివారం ఉదయం  8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 184 మందికి కరోనా సోకింది. పటాన్‌చెరు-36, నారాయణఖేడ్‌-27, జహీరాబాద్‌-15, సదాశివపేట-12, సంగారెడ్డి-18, జోగిపేట-20, అమీన్‌పూర్‌-10, మొగుడంపల్లి-3, కోహీర్‌-3, రాయికోడ్‌-3, బొల్లారం-3, తాలెల్మ-3, మల్కాపూర్‌-3, ఝరాసంగం-2, రేజింతల్‌-2, మార్డి-2, అల్లాపూర్‌-2, కంది-2, దౌల్తాబాద్‌-2, కానుకుంట-2, కొండాపూర్‌-2, ఆర్సీపురంలో 12 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. అలాగే 4,917 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేశారు. జిల్లాలోని ఆయా ఆస్పత్రులు, ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాల్లో నమోదైన కొవిడ్‌ కేసుల వివరాల మేరకు కంది-22, ఝరాసంగం-10, రాయికోడ్‌-5, దిగ్వాల్‌-38, రాయికోడ్‌-5, న్యాల్‌కల్‌-7, మిర్జాపూర్‌-32, మొగుడంపల్లి-5, సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రి-31, ఇంద్రానగర్‌ యూపీహెచ్‌సీలో- 34, మార్స్క్‌నగర్‌ యూపీహెచ్‌సీలో 39 మందికి ఇలా 228 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల నిమిత్తం సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రి నుంచి 163 మంది, పటాన్‌చెరు ఆస్పత్రి నుంచి 155 మంది శాంపిళ్లు సేకరించి కొవిడ్‌ నిర్ధారణకు గాంధీకి పంపామని వైద్యులు తెలిపారు. 


జహీరాబాద్‌లో కరోనాతో ఇద్దరు మృతి

జహీరాబాద్‌, ఏప్రిల్‌ 20: జహీరాబాద్‌ మండలంలోని ఓ గ్రామ సర్పంచ్‌ భర్త కరోనాతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం మృతిచెందాడు. జహీరాబాద్‌లోని ఓ హాస్టల్‌ వార్డెన్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి కూడా కరోనా సోకడంతో నాలుగు రోజుల క్రితం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందాడు.  


కరోనా కేసులపై గోప్యం.. హెల్త్‌ బులెటిన్‌ బంద్‌

ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయని మూడు రోజులుగా వివరాలు ఇవ్వని వైద్య ఆరోగ్యశాఖ

మెదక్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 20: కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి కొనసాగుతున్నది. గ్రామాలు, పట్టణాలు అనే తేడా తెలియకుండా వైరస్‌ వేగంగా వ్యాప్తిస్తున్నది. తమ గ్రామంలో ఎంతమంది కొవిడ్‌ బారినపడ్డారో తెలియక ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. ప్రతీరోజు ఉదయం వివరాలను తెలుసుకోవడానికి సాధారణ ప్రజలు దినపత్రికలను చూస్తున్నారు. పరిస్థితిని ప్రజలకు వివరించాల్సిన పరిస్థితుల్లో డీఎంహెచ్‌వో కార్యాయలం నుంచి రోజువారీ కరోనా హెల్త్‌ బులెటెన్‌ను నిలిపి వేశారు. ప్రభుత్వం నుంచి మౌలిక ఆదేశాలు ఉన్నాయని అధికారలు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య, యాక్టివ్‌ కేసులు, హోం ఐసోలేషన్‌లో, ఆసుపత్రుల్లో ఎంతమంది చిక్సిత పొందుతున్నారు.. కరోనాతో ఎందిమంది మృతి చెందారు.. ఎంత మంది కోలుకున్నారనే సమగ్ర సమాచారంతో హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండేవారు.  మూడు రోజులుగా ఈ వివరాలేమీ విడుదల చేయకపోవడంతో దీంతో వాస్తవ పరిస్థితి గురించి సమాచారం లేక గందరగోళం నెలకొంటున్నది. కరోనా కేసుల తీవ్రత తెలియక ప్రజల్లో నిర్లక్ష్య వైఖరి పెరిగిపోతున్నది. దీంతో వైరస్‌ విజృంభిచడానికి ఆస్కారం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Updated Date - 2021-04-21T05:49:32+05:30 IST