Chattisgarh : కలుషిత ఆహారం తిన్న 77 మందికి అస్వస్థత

ABN , First Publish Date - 2021-10-20T21:38:59+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌లోని గటపర్ కల గ్రామంలో వారపు సంతలో

Chattisgarh : కలుషిత ఆహారం తిన్న 77 మందికి అస్వస్థత

రాజనందగావ్ : ఛత్తీస్‌గఢ్‌లోని గటపర్ కల గ్రామంలో వారపు సంతలో అమ్మిన ఆహార పదార్థాలను తిన్న 77 మంది అస్వస్థులైనట్లు రాజనందగావ్ ప్రధాన వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ మిథిలేశ్ చౌదరి బుధవారం చెప్పారు. బాధితుల్లో ఎక్కువ మంది బాలలేనని తెలిపారు. వీరు మంగళవారం ఈ ఆహార పదార్థాలు తిన్నారని చెప్పారు. 


రాజనందగావ్ జిల్లాలోని థెల్కడిహ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గటపర్ కల గ్రామంలో మంగళవారం వారపు సంత జరిగింది. ఈ సంతలో అమ్మిన వివిధ ఆహార పదార్థాలను తిన్నవారిలో 77 మంది అస్వస్థతకు గురయ్యారని డాక్టర్ మిథిలేశ్ చెప్పారు. వీరిలో 57 మంది బాలలని చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం వీరు పానీ పూరీ, ఇతర ఆహార పదార్థాలను తిన్నట్లు  తెలిసిందన్నారు. వీరికి వాంతులు, తల తిప్పడం వంటి లక్షణాలు కనిపించడంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు తెలిపారు. 


అస్వస్థులైనవారిని పెండ్రిలోని వైద్య కళాశాల, ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఉదయం 26 మందిని ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించినట్లు తెలిపారు. మిగిలినవారు ప్రమాదం నుంచి బయటపడినట్లు చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోందన్నారు. ఈ గ్రామంలో బుధవారం వైద్య శిబిరాన్ని నిర్వహించి, గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు.


Updated Date - 2021-10-20T21:38:59+05:30 IST