శుభవార్త: బోనస్‌గా 78రోజుల వేతనం

ABN , First Publish Date - 2021-10-07T12:57:32+05:30 IST

ప్రభుత్వం శుభవార్త చెప్పింది..

శుభవార్త: బోనస్‌గా 78రోజుల వేతనం

రైల్వే ఉద్యోగులకు బోనస్‌

పండగ బోనస్‌ ప్రకటించిన కేంద్రం

నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులకు వర్తింపు

11.56 లక్షల మందికి ప్రయోజనం

దేశంలో 7 మెగా టెక్స్‌టైల్‌ పార్కులు

తెలంగాణ, ఏపీతోపాటు 10 రాష్ట్రాల ఆసక్తి: కేంద్ర క్యాబినెట్‌


న్యూఢిల్లీ(ఆంధ్రజ్యోతి): రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి పండగ బోన్‌సను ప్రకటించింది. 78 రోజుల వేతనానికి సమానంగా బోనస్‌ ఇవ్వాలని కేంద్ర కేబినెట్‌ బుధవారం నిర్ణయం తీసుకుంది. నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా సుమారు 11.56 లక్షల మంది రైల్వే ఉద్యోగులు దీని ద్వారా ప్రయోజనం పొందనున్నారని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చెప్పారు. దీనికోసం ఖజానా నుంచి రూ.1,985 కోట్లను కేంద్రం ఖర్చుపెట్టనుంది. అర్హతను బట్టి గరిష్ఠంగా ఒక్కో ఉద్యోగికి రూ.17,951 బోనస్‌ అందుతుందని కేంద్రం తెలిపింది. అయితే ఈ నిర్ణయం రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ సిబ్బందికి వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం మరికొన్ని నిర్ణయాలను కూడా ప్రకటించింది.


వచ్చే ఐదేళ్లలో దేశంలో రూ.4,445 కోట్లు వెచ్చించి 7 మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌, అప్పారెల్‌ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. వీటితో 7లక్షల మందికి ప్రత్యక్షంగా, మరో 14 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు సహా 10 రాష్ట్రాలు ఈ పార్కుల ఏర్పాటుపై ఆసక్తి చూపించాయని కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. గ్రీన్‌ ఫీల్డ్‌, బ్రౌన్‌ ఫీల్డ్‌ పార్కులుగా వీటిని ఏర్పాటు చేస్తారు. మౌలిక సదుపాయాల కోసం గ్రీన్‌ఫీల్డ్‌ పార్కుకు రూ.500 కోట్లు, బ్రౌన్‌ఫీల్డ్‌ పార్కుకు రూ.200 కోట్లు చొప్పున నిధులను కేంద్రం ఇవ్వనుంది. ప్రోత్సాహకాల కింద ఒక్కో పార్కుకు రూ.300 కోట్లు కేటాయిస్తారు. 2021-22 బడ్జెట్‌లో పీఎం-మిత్రా (మెగా ఇంటెగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ రీజియన్‌ అండ్‌ అప్పారెల్‌) పేరుతో ఈ పార్కులను కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2021-10-07T12:57:32+05:30 IST