బీబీనగర్‌ ఎయిమ్స్‌కు రూ.7.99కోట్లు

ABN , First Publish Date - 2021-07-30T05:45:17+05:30 IST

బీబీనగర్‌లోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)లో నూతన భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.7.99కోట్లు మంజూరు చేసింది.

బీబీనగర్‌ ఎయిమ్స్‌కు రూ.7.99కోట్లు
ఎయిమ్స్‌

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు

యాదాద్రి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): బీబీనగర్‌లోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)లో నూతన భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.7.99కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు టెండర్లను ఆహ్వానిస్తూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఎయిమ్స్‌లో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు, స్థానిక నేతలంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరడంతోపాటు, పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలురాశారు. ఇటీవల కరీంనగర్‌ ఎంపీ, ఎయిమ్స్‌ సభ్యుడు బండి సంజయ్‌కుమార్‌ ఫోరెన్సిక్‌ మెడిసినల్‌ అండ్‌ టాక్సికాలజీ విభాగం సేవలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీకి ఎయిమ్స్‌ అధికారులు పలు సమస్యలను వివరించారు. ఎయిమ్స్‌లో మూడో బ్యాచ్‌ ఎంబీబీఎస్‌ అడ్మిషన్లు ప్రారంభం కాబోతుండగా, వీరికి హాస్టల్‌ భవనంతోపాటు అవసరమైన వసతులు లేవని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీనిచ్చారు. తాత్కాలికంగా ఏర్పాట్లు చేసేందుకు అధికారులతో చర్చిస్తానని తెలిపారు. ఎంపీల విజ్ఞప్తి మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ విస్తరణకు చర్యలు తీసుకుంది. నూతన భవన నిర్మాణానికి రూ.7.99కోట్లను మంజూరు చేయగా రెండేళ్లలో పనులు పూర్తి చేయనుంది. ఎయిమ్స్‌లో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి వస్తే నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌, హైదరాబాద్‌, వరంగల్‌ జిల్లాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎయిమ్స్‌ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించకపోయినా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌ చొరవ తీసుకోవడం వల్లే నిధులు మంజూరయ్యాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌రావు తెలిపారు. నిధుల మంజూరీపై హర్షం వ్యక్తంచేశారు.   

Updated Date - 2021-07-30T05:45:17+05:30 IST