HYD : అదృశ్యమై.. మర్నాడు శవంగా.. బాలుడి మృతికి కారణాలేంటి.. అసలేం జరిగింది..!?

ABN , First Publish Date - 2021-10-23T18:19:11+05:30 IST

వీరికి లక్కీ, అనీష్‌, ఇశాంక్‌ ముగ్గురు సంతానం. రెండో కుమారుడు అనీష్‌...

HYD : అదృశ్యమై.. మర్నాడు శవంగా.. బాలుడి మృతికి కారణాలేంటి.. అసలేం జరిగింది..!?

హైదరాబాద్ సిటీ/రాజేంద్రనగర్ : అపార్ట్‌మెంట్‌ ముందు ఆడుకుంటూ గురువారం అదృశ్యమైన బాలుడు శుక్రవారం శవమై కనిపించాడు. నీటి గుంత వద్దకు ఈత కొట్టడానికి వచ్చి అందులో పడి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం బాలుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. న్యూ ఫ్రెండ్స్‌ కాలనీ కొండలరెడ్డి అపార్ట్‌మెంట్‌లో వై.శివ, అపర్ణల కుటుంబం నివసిస్తోంది. వీరికి లక్కీ, అనీష్‌, ఇశాంక్‌ ముగ్గురు సంతానం. రెండో కుమారుడు అనీష్‌ (7) గురువారం మధ్నాహ్నం 1:30 గంటల ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌ వద్ద ఆడుకుంటున్నాడు. చాలా సమయం అయినా కుమారుడు రాకపోవడంతో తల్లి భోజనం చేయడానికి పిలుద్దామని కిందికి వచ్చింది. అనీష్‌ కనిపించలేదు. చుట్టుపక్కల వారిని అడిగినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు రాజేంద్రనగర్‌  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ కె.కనకయ్యతో పాటు ఎస్‌ఐ సమరంరెడ్డి తదితరులు బాలుడి ఆచూకీ కోసం గాలించారు. అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించగా వాచ్‌మన్‌ రూమ్‌లో ఉన్న కెమెరాలు పని చేయడం లేదని తెలిసింది.


నీటి గుంతలో శవంగా.. 

అనీష్‌ కోసం పోలీసులు గాలిస్తుండగా శుక్రవారం ఉదయం అపార్ట్‌మెంట్‌ వెనకాల 50 మీటర్ల దూరంలో ఉన్న నీటి గుంతలో బాలుడి శవం బోర్లా పడి కనిపించింది. అతడి దుస్తులు ఒడ్డున  ఉన్నాయి. పోలీసులు కుటుంబ సభ్యులను పిలిచి విచారించగా చూసి నిర్ధారించారు. రాజేంద్రనగర్‌ ఏసీసీ బి.గంగాధర్‌, ఇన్‌స్పెక్టర్‌ కె.కనకయ్య, డీఐ పవన్‌కుమార్‌ల సమక్షంలో బాలుడి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమా ర్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.


బంధువుల అనుమానాలు 

అనీష్‌ మృతిపై నానమ్మ శోభారాణి, మామ ప్రవీణ్‌తో పాటు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 14 నుంచి అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌ గదిలో ఉన్న సీసీ కెమెరాలు ఎందుకు పని చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌ యజమాని వద్ద ఉన్న సీసీ కెమెరాలలో బాలుడి ఆచూకీ కనిపించకపోవడంపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలుడు అపార్ట్‌మెంట్‌ వెనకాల ఉన్న ఎతైన ప్రహరీ దూకి నీటి గుంతవైపు వెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తుండగా, అంత ఎత్తైన ప్రహరీని ఏడేళ్ల బాలుడు ఎలా ఎక్కుతాడని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని మార్చురీకి తీసుకువెళ్లిన సమయంలో ముఖంపై గాయాలు కనిపించాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గురువారం నీళ్లలో పడి మరణిస్తే నీళ్లు మింగి కడుపు ఉబ్బుతుందని, బాలుడి కడుపు అలా లేదని అంటున్నారు. అనీష్‌ మృతిపై సమగ్ర విచారణ చేయాలని కోరుతున్నారు. 


ఈత కోసం వచ్చి మరణించి ఉంటాడు : ఏసీపీ బి.గంగాధర్‌

అనీష్‌ నీటి గుంత వద్దకు ఈత కోసం వచ్చి మరణించి ఉంటాడని రాజేంద్రనగర్‌ ఏసీపీ బి.గంగాధర్‌ తెలిపారు. గుంత ఒడ్డున దుస్తులు విప్పి నీటిలోకి దిగి ఉంటాడని, నీళ్లు మింగి మరణించి ఉంటాడని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Updated Date - 2021-10-23T18:19:11+05:30 IST