లోడ్‌తో ఉన్న లారీలే టార్గెట్‌.. ఎనిమిది పేర్లు.. 34 కేసులు

ABN , First Publish Date - 2021-06-13T17:23:53+05:30 IST

నిత్యావసరాల లోడ్‌తో ఉన్న లారీలే ఆ ఇద్దరి టార్గెట్‌. డ్రైవర్ల దృష్టి

లోడ్‌తో ఉన్న లారీలే టార్గెట్‌.. ఎనిమిది పేర్లు.. 34 కేసులు

  • నిత్యావసరాల సరుకుతో ఉన్న లారీలే లక్ష్యంగా చోరీలు
  • మరొకరితో కలిసి నేరాలు
  • అరెస్టు చేసిన పోలీసులు, 10.20 లక్షల  సొత్తు స్వాధీనం

హైదరాబాద్ సిటీ/సరూర్‌నగర్‌ : నిత్యావసరాల లోడ్‌తో ఉన్న లారీలే ఆ ఇద్దరి టార్గెట్‌. డ్రైవర్ల దృష్టి మరల్చి లారీలోని సరుకును చాకచక్యంగా చోరీ చేసేవారు. ఆ ఇద్దరిలో ఒకడికి ఎనిమిది పేర్లు ఉన్నాయి. పేరు మారుస్తూ 34 చోరీలు చేశాడు. ఇద్దరూ శనివారం మీర్‌పేట్‌ పోలీసులకు చిక్కారు. మీర్‌పేట్‌ పీఎస్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ కె.పురుషోత్తంరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ ఎం.మహేందర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. మలక్‌పేట్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ రహీం అలియాస్‌ ఫిరోజ్‌ (32) చాదర్‌ఘాట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన తుమ్ము సాయి నందకిషోర్‌ (36) బియ్యం వ్యాపారి. ఇతడికి ఒరిజినల్‌ పేరుతో పాటు సత్యనారాయణ, సత్య, అక్షయ్‌, రాజేశ్‌కుమార్‌, శేషాద్రికుమార్‌, సంజయ్‌కుమార్‌, చిన్నా అనే మరో ఏడు(అలియాస్‌) పేర్లు కూడా ఉన్నాయి. 


ఇతనిపై పీడీయాక్టు కూడా ఉంది. ఫిరోజ్‌, నందకిషోర్‌ పెద్ద పెద్ద షాపులకు బియ్యం, వంట నూనె, మసాలా దినుసులు సరఫరా చేసే లారీలు, డీసీఎంలను టార్గెట్‌గా చేసుకుని చోరీలు చేసేవారు. ఉదయాన్నే లేచి ప్రధాన రహదారుల్లో తిరుగుతూ ఆయా సరకుతో ఉన్న వాహనాలను గుర్తించి తాము ఫలానా షాపు నుంచి వచ్చామని, సరకును తమ దుకాణం వద్దకు తీసుకురావాలని చెప్పేవారు. అప్పటికే ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని లారీని అక్కడకు తీసుకువెళ్లేవారు. అక్కడ సరుకు మొత్తం అన్‌లోడ్‌ చేయించుకుని డబ్బును ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్‌ చేస్తామని చెప్పి నమ్మించేవారు. దాంతో డ్రైవర్‌ వాహనంతో అక్కడి నుంచి వెళ్లగానే మరో వాహనంలోకి సరకును లోడ్‌ చేసుకుని ఉడాయించే వారు.


ఇలా మొదటి నిందితుడు రహీం గతంలో వివిధ పీఎస్‌ల పరిదిలో ఏడు కేసుల్లో అరెస్టు కాగా, రెండో నిందితుడు నందకిషోర్‌ 27 కేసుల్లో అరెస్టయ్యాడు. ఇద్దరిదీ ఒకే ప్రాంతం కావడంతో జైలు నుంచి బయకు వచ్చాక మళ్లీ అవే నేరాలు చేసేవారు. ఇటీవల మీర్‌పేట్‌, సరూర్‌నగర్‌, మైలార్‌దేవ్‌పల్లి, మాదన్నపేట్‌, సంతోష్‌నగర్‌, షాహినాయత్‌గంజ్‌ తదితర పీఎస్‌ల పరిదిలోనూ ఇలాంటి ఏడు చోరీలు చేశారు. దాంతో రెండో నిందితుడి కేసుల సంఖ్య 34కి చేరింది. మీర్‌పేట్‌ పోలీసులు శనివారం విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు మలక్‌పేట్‌లో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తమ నేరాల చిట్టాను విప్పారు. వారి నుంచి 1920 కేజీల గోల్డ్‌డ్రాప్‌ వంట నూనె, 4 టన్నుల బియ్యం, 1100 కేజీల జిలకర్ర,  2,250 కేజీల పల్లీ, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.10.20 లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు.

Updated Date - 2021-06-13T17:23:53+05:30 IST